బుట్టాయగూడెం : అటవీప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ గుడి వద్ద అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ వర్గీయులు ఆదివారం మద్యం తాగి హడావుడి సృష్టించారు. పోలీసులపై తిరగబడ్డారు. అదేమని అడిగిన ఆలయ కమిటీ సభ్యులతోనూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై స్థానికులు, భక్తులు చెప్పిన వివరాల ప్రకారం.. గుబ్బల మంగమ్మ గుడికి కైకలూరు నుంచి వచ్చిన ఎంపీ వర్గీయులు 50 మంది ఆలయ ప్రాంగణంలో మద్యం సేవించి గొడవ చేస్తుండగా, ఇద్దరు పోలీసులు వెళ్లి ఇలా చేయడం తప్పని చెప్పారు.
దీంతో మద్యం మత్తులో ఉన్న ఎంపీ వర్గీయులు పోలీసులపై తిరగబడ్డారు. వారితో వాదనకు దిగారు. దీంతో పోలీసులు ఆలయ కమిటీ సభ్యులకు, సర్పంచ్ కోర్స కన్నప్పరాజుకు విషయం చెప్పారు. వారు వెళ్లి ఎంపీ వర్గీయులతో మాట్లాడారు. ఈ సమయంలో ఎంపీ వర్గీయులు వారిపైనా వాదనకు దిగారు. ఇది ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది.
ఈ ఘటనలో ఎంపీ వర్గీయులతోపాటు ఆలయ కమిటీ సభ్యులకు గాయాలైనట్టు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న బుట్టాయగూడెం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఎంపీ వర్గీయుల్లో కొందరిని బుట్టాయగూడెం పోలీసుస్టేషన్‌కి తీసుకువచ్చారు. కేసు నమోదు చేయకుండా ఆలయ కమిటీ సభ్యులకు, ఎంపీ వర్గీయులకు మధ్య పోలీసులు రాజీ చేసి వివాదాన్ని సద్దుమణిగేటట్టు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులను వివరణ అడిగితే గుడివద్ద ఎటువంటి గొడవ జరగలేదని, యాత్రికులకు, ఆలయ కమిటీ సభ్యులకు మధ్య స్వల్ప వాదన చోటుచేసుకుందని చెబుతున్నారు.
పోలీసులపై తిరగబడిన ఎంపీ వర్గీయులు!
Published Mon, Feb 29 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM
Advertisement