ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
► అంతా వీఐపీలే
► పత్తి గోదాంలో అడ్డా..
► కేసు కాకుండా నేతల విఫలయత్నం
► కోర్టుకు వెళ్లొచ్చిన కొద్దిగంటలకే అరెస్టు
వేములవాడ రూరల్ : మండలంలోని తిప్పాపురం గ్రామంలోని ఒక పత్తి గోదాంలో పేకాట ఆడుతున్న ఆరుగురుని సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలక్ష్మీబాలాజీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన పత్తి గోదాంలో మంగళవారం కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్నారు. పేకాట ఆడుతున్న వేములవాడ పట్టణానికి చెందిన కట్కం శ్రీనివాస్, తాటికొండ రాంబాబు, కట్కం శంకరయ్య, బుస్స కైలాసం, మోటూరి శ్రీనివాస్‌లతోపాటు ఫాజుల్‌నగర్ గ్రామానికి చెందిన బిక్కుమల్ల రమేశ్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.39,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరంతా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ, ప్రముఖులుగా చలామణి అవుతున్నవారే. విషయం తెలుసుకున్న పట్టణంలోని ప్రముఖ వ్యాపారులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. కేసు కాకుండా విడిపించాలని తీవ్రప్రయత్నాలు చేశారు. సీఐ శ్రీనివాస్ పైరవీలకు అవకాశం ఇవ్వకుండా కేసు నమోదు చేశారు.
నాయకుల వత్తాసు
పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన వారికి పట్టణానికి చెం దిన ప్రముఖ నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి వత్తాసు పలికాడు. అధికార పార్టీలో ఉన్న ఆ నాయకుడు పేకాటరాయుళ్లకు సమీప బంధువు కావడం, వారితో పలు వ్యాపార లావాదేవీలు ఉండడంతో కేసు నుంచి తప్పించాలని ప్రయత్నించాడు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన పోలీసులతో చేసిన సంధి ప్రయత్నం విఫలం కావడంతో ‘కేసు నమోదు చేశారు కనుక రాత్రికి ఇంటికి పంపించాలని’ ఒత్తిడి తీసుకువచ్చాడు.
పత్తి మిల్లే అడ్డాగా..
రోజంతా పత్తి వ్యాపారం నిర్వహిస్తున్న ఈ మిల్లు ప్రముఖ నాయకులకు పేకాట అడ్డాగా కూడా మారినట్లు ఆరోపణ లు వస్తున్నాయి. వేములవాడ, సిరిసిల్ల ప్రధాన రోడ్డు పక్కన గల శ్రీలక్ష్మీబాలాజీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన పత్తిగోదాం పేకాట రాయుళ్లకు అడ్డాగా మారింది. ఉదయం వ్యాపారం పత్తి వ్యాపారం... సాయంత్రం వేళ ఇందులో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేకాటలో పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోరుున ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.
కోర్టుకు వెళ్లొచ్చిన కొన్ని గంటలకే...?
పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన వారిలో కొందరు మంగళవారం పేకాట కేసులోనే కోర్టుకు వెళ్లొచ్చారు. కొద్ది గంటలకే మళ్లీ పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కడం విశే షం. కోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి నేరుగా మళ్లీ పత్తి గోదాం కు చేరుకుని పేకాట ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి అరెస్టు చేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఈ పేకాటరాయుళ్లలో తండ్రీకొడుకులు సైతం ఉండటం కొసమెరుపు.