కబ్జాలపాటి
శాతవాహన కళాశాల స్థలం కబ్జాకు వ్యూహం
సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎగ్జిబిషన్‌కు అనుమతి
ఫిర్యాదు చేసినా స్పందించని అధికార యంత్రాంగం
అధికార పార్టీ పెద్దల ప్రమేయం
అమరావతి : విజయవాడ నగరంలో అధికార పార్టీ నేతల కబ్జాలు మితిమీరుతున్నాయి. కంటికి కనిపించిన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న అధికార పార్టీ పెద్దలు... ఇప్పుడు ప్రైవేటు స్థలాల పైనా కన్నేశారు. సర్వోత్తమ న్యాయస్థానం ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ అధికార పార్టీ నేతలు సాగిస్తున్న కబ్జాల పర్వానికి ‘శాతవాహన కళాశాల’ స్థల వివాదం ప్రత్యక్ష ఉదాహరణ. ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటం, వారికీ కబ్జాలో వాటా ఇస్తుండటంతో.. అధికార పార్టీ నేతల కబ్జాలను చూస్తూ ఊరుకోవాల్సిందేనంటూ అధికార యంత్రాంగానికి హుకుం జారీ చేస్తుండటం గమనార్హం. వివాదం తేలే వరకు శాతవాహన కళాశాల స్థలం విషయంలో యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను ధిక్కరించి అధికార పార్టీ నాయకులు స్థలాన్ని కబ్జా చేయడానికి ఒక్కో అడుగూ వేస్తూ పోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. వివాదం తేలే వరకు ఎలాంటి కార్యకలాపాలూ ఆ స్థలంలో నిర్వహించడానికి వీల్లేకపోయినా.. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి శాతవాహన కళాశాల కమిటీ కార్యదర్శి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అనుమతి ఇవ్వడం గమనార్హం.
సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఏకపక్షంగా ఎగ్జిబిషన్‌కు ఎలా అనుమతి ఇస్తారంటూ స్థలం అసలు యజమాని అభ్యంతరం చెప్పినా.. అధికార పార్టీ నేతలు లక్ష్యపెట్టలేదు. దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరించారని బెజవాడలో ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి న్యాయం చేయండి మహాప్రభో.. అంటూ జిల్లా కలెక్టర్ మొదలు అధికార యంత్రాంగాన్ని వేడుకున్నా... ప్రభుత్వ పెద్దలకు భయపడి అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ‘ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టారు.. తర్వాత స్థలాన్ని కబ్జాచేసి పారేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలకే దిక్కులేకపోతే ఎలా? అధికార యంత్రాంగం ఏమీ చేయలేకపోతే.. ఎవరికి చెప్పుకోవాలి’ అంటూ బాధితులు అధికారుల వద్ద వాపోయినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
వివాదం ఇదీ..
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు-11లో ఉన్న 5.10 ఎకరాల భూమిని దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి 1974లో విక్రయించడానికి స్థలం యజమాని బోయపాటి శ్రీనివాస అప్పారావు ‘షరతులతో కూడిన ఒప్పందం’ చేసుకున్నారు. పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం నుంచి తప్పించుకోవడానికి వీలుగా సొసైటీతో ఒప్పందం చేశారు. ఒప్పందం జరిగింది కానీ.. భూమిని సొసైటీకి అప్పజెప్పడం కానీ, విక్రయ రిజిస్ట్రేషన్ కానీ చేయలేదు. భూమిని తమకు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వమని కోరుతూ 1991లో సొసైటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భూమిపై సొసైటీకి హక్కులేదని సివిల్ కోర్టు తీర్పు చెప్పింది. జిల్లా కోర్టు కూడా ఈ తీర్పునే సమర్థించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన న్యాయపోరాటంలో అప్పారావు గెలిచారు. తాము చెల్లించిన సొమ్ము వడ్డీ సహా చెల్లించమని సొసైటీ చేసిన డిమాండ్‌కు అప్పారావు సానుకూలంగా స్పందించడంతో.. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. ఈ మేరకు లోక్ అదాలత్ అవార్డు కూడా ఇచ్చింది. సొసైటీకి అప్పారావు రూ.9 లక్షలు చెల్లించారు.
ఆలపాటి రాజా ఎంట్రీ...
వివాదాస్పద స్థలంపై 2011లో టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కన్నుపడింది. దీంతో సొసైటీ కార్యదర్శిగా ఉన్న కామేశ్వరరావు రాజీనామా చేయడం, తర్వాత రోజే సొసైటీ కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికవడం చకచకా జరిగిపోయాయి. సొసైటీ కార్యదర్శి మార్పు చెల్లదంటూ మాజీ కార్యదర్శి జగపతిరావు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది. సొసైటీ కార్యదర్శిగా ఆలపాటి రాజా నియామకం/నామినేషన్ చెల్లదని తీర్పు చెప్పింది. సొసైటీ కార్యదర్శిగా కొనసాగడానికి అవకాశం లేకపోవడంతో.. అదే సొసైటీ నడుపుతున్న శాతవాహన కళాశాల కార్యదర్శి/కరెస్పాండెంట్‌గా ఆయన తెరపైకి వచ్చారు. ఏదో రకంగా సొసైటీని గుప్పెట్లో పెట్టుకొని స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. భూమి యజమాని, సొసైటీ మధ్య రాజీ కుదరలేదని, ఫోర్జరీ సంతకాలు చేశారంటూ సొసైటీ కార్యదర్శి కామేశ్వరరావు మళ్లీ కేసు దాఖలు చేశారు. ఈ కేసు వేయడం వెనక ఆలపాటి రాజా ఉన్నారని సమాచారం. ఈ కేసును హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ భూమి యజమాని అప్పారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూమి విషయంలో తుది తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జీవో రద్దయిపోయింది
దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న శాతవాహన కళాశాలను కార్యదర్శి, కరస్పాండెంట్‌గా టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధమని, సొసైటీ సభ్యుల్లోనూ తీవ్ర విభేదాలున్నాయని, సొసైటీ కార్యవర్గాన్ని రద్దు చేసి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వివాదాలు ముగిసే వరకు ప్రత్యేక అధికారికి సొసైటీ బాధ్యతలను స్పెషల్ ఆఫీసర్‌కు అప్పగించాలని అడ్వకేట్ జనరల్‌తో పాటు ఉన్నత విద్యా శాఖ న్యాయవాది కూడా ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో శాతవాహన కళాశాల యాజమాన్యాన్ని రద్దు చేసి, బాధ్యతను కలెక్టర్‌కు అప్పగిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సునీత దావ్రా 2015 మార్చి 17న ఉత్తర్వులు (జీవో-84) జారీ చేశారు. ఏం జరిగిందో.. ఏమో.. సరిగ్గా 10 రోజులకు జీవో-84ను పక్కన (అబేయన్స్‌లో) పెడుతూ మరో ఉత్తర్వును (జీవో-97) జారీ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన పలుకుబడితో ఉత్తర్వులను రద్దు చేయించారని ఉన్నత విద్యాశాఖలో ప్రచారం జరుగుతోంది.
ఎగ్జిబిషన్‌కు అనుమతి
సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ సొసైటీ, కళాశాల యాజమాన్యం వివాదాస్పద స్థలాన్ని ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. స్థలం తమ చేతుల్లో ఉందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పుకోవడానికి, ఆ మేరకు ఆధారాలు సంపాదించుకోవడానికి వీలుగా అధికార బలంలో ఎగ్జిబిషన్ నిర్వహణకు స్థలాన్ని ఇచ్చారని, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడాన్ని ప్రశ్నిస్తూ అప్పారావు ప్రభుత్వ యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసినా.. ప్రభుత్వ పెద్దలకు భయపడి అధికారులు స్పందించడం లేదు.