విజయనగరం ఫోర్ట్: మెంటాడ మండలానికి చెందిన ఓ అభ్యర్థి తనకు అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు ఇప్పించాలని కోరుతూ అధికార పార్టీ నేతను ఆశ్రయించింది. ఈ విషయమై ఆ నేత బదులిస్తూ ‘పోస్టు తప్పనిసరిగా నీకే ఇప్పిస్తాను.. మరి మాకు ఖర్చులు ఉంటాయి. వాటిని భరించగలిగితే పోస్టు ఖాయం. ఇక వెళ్లిపోవచ్చు..’ అంటూ తేల్చిచెప్పారు.
గజపతినగరం నియోజకవర్గంలోని గంట్యాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్త పోస్టు కోసం ఓ అభ్యర్థి అధికార పార్టీ నేతను ఆశ్రయించగా సదరు నాయకుడు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం ఇచ్చేందుకు అభ్యర్థి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇదీ జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ విషయంలో చాలాచోట్ల జరుగుతున్న వ్యవహారం.
కొద్ది నెలల కిందట జరిగిన అంగన్‌వాడీ నియామకాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫారుసు చేసిన వారిలో దాదాపు 90 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలియడంతో డబ్బులు ఇస్తే పని అయిపోతుందనే భావన చాలా మంది అభ్యర్థుల్లో నెలకొంది. వాస్తవ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. తాజాగా అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడటంతో అధికార పార్టీ నేతలు పండగ చేసుకుంటున్నారు. గతంలో మాదిరిగానే అధిక మొత్తంలో దండుకోవచ్చుననే భావనలో చాలామంది తెలుగు తమ్ముళ్లలో ఉన్నట్టు సమాచారం.
పోస్టుల వివరాలు.. : మైదాన ప్రాంతంలో 275 పోస్టులు, ఐటీడీఏ పరిధిలో 409 అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మైదాన ప్రాంతంలో 28 కార్యకర్త, 115 ఆయా, 34 మినీ అంగన్‌వాడీ కార్యకర్త, 98 లింక్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీడీఏ పరిధిలో 16 అంగన్‌వాడీ కార్యకర్త, 55 ఆయా, 19 మిని అంగన్‌వాడీ కార్యకర్త, 57 క్రైసీ వర్కర్, 262 లింక్ వర్కర్ పోస్టుల నియామకాలు జరగనున్నాయి.
15 నుంచి ఇంటర్వ్యూలు... : ప్రాజెక్టు వారీగా ఖాళీగా ఉన్న పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపిక కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, మెంబర్ కన్వీనర్‌గా ఐసీడీఎస్ పీడీ, సభ్యులుగా డీఎంహెచ్‌ఓ, ఆర్డీఓ, సీడీపీఓలు వ్యవహరిస్తారు. ఈ నెల 15 నుంచి 17 వరకు మైదాన ప్రాంతంలోని అంగన్‌వాడీ పోస్టులకు , 18 నుంచి 20వతేది వరకు గిరిజన ప్రాంతంలో ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
సిఫారుసులుంటేనే...! : అధికార పార్టీ నేత ఎవరికి చెబితే వారికే పోస్టు దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అధికార పార్టీ నేతలు లెటర్‌హెడ్‌పై ఇచ్చిన పేర్లకే ఉద్యోగాలు రావడంతో ఈ ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. మరోవైపు అధికారులు కూడా టీడీపీ నేత సిఫారుసులకే ప్రాధాన్యమిస్తున్నట్లు బాధిత అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారమే నియామకాలు చేపడతామని అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతా పారదర్శకం..
ఈసారి అంగన్‌వాడీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తాం. దీనికోసం సిబ్బందిని కూడా నియమించనున్నాం. సిఫారుసులను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోం.
-ఎ.ఇ.రాబర్ట్స్, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం
పైసలిస్తే పోస్టునీదే
Published Fri, Feb 12 2016 1:19 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement