ఎందుకో? ఏమో? | Delay in recruitment of Anganwadi Post | Sakshi
Sakshi News home page

ఎందుకో? ఏమో?

Published Fri, Feb 26 2016 12:34 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

Delay in recruitment of Anganwadi Post

అంగన్‌వాడీ నియామకాల్లో  జాప్యం  
  ఇంటర్వ్యూల రోజున ఫలితాలు వెల్లడిస్తామని చెప్పిన అధికారులు
 నేతల సిఫార్సు కోసమే వేచి చూస్తున్నారన్న ఆరోపణలు
  బేరసారాలు మొదలైనట్లు అనుమానాలు

 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: అంగన్‌వాడీ పోస్టుల వ్యవహారం షరామామూలుగానే తయారైంది. గత ఏడాది అక్టోబర్‌లో నియామకం చేపట్టిన పోస్టులు అమ్ముడై పోయిన విషయం సంచలనం సృష్టించింది. ఈ సారైనా అంగన్ వాడీల నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తారని భావించిన అభ్యర్థులు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఆశలు వదులుకుంటున్నారు. అంగన్‌వాడీ పోస్టులు మళ్లీ అంగట్లో సరుకుల్లానే అమ్ముడుపోతున్నట్లు సమాచారం.   నేతల ఒత్తిళ్లతో  ఫలితాల వెల్లడిలో అధికారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బేరసారాలు కొలిక్కి రాకపోవడం వల్ల నాయకులు ఫలితాల విడుదలకు సంకేతాలు ఇవ్వడం లేదా?   ఏ రోజుకా రోజు ఫలితాలు ప్రకటించకపోవడం వెనుక బలమైన కారణమిదేనా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపించక మానడం లేదు.
 
 మరకలు పోకుండానే   
 ఎన్నడూ లేని విధంగా గత అక్టోబర్‌లో ఎంపికలు నిర్వహించిన అంగన్‌వాడీ పోస్టులు అమ్ముడైపోయాయి. కార్యకర్త పోస్టుకు రూ.4లక్షల నుంచి రూ. 7లక్షలు వరకు, ఆయా పోస్టుకు రూ. 2లక్షల నుంచి రూ.3లక్షల వరకు రేటు పలికింది. క్రయ, విక్రయాల ఒప్పందం ప్రకారం అధికార పార్టీ నేతలు సిఫార్సు చేశారు. ఎమ్మెల్యేలు ఏకంగా లెటర్ హెడ్‌పై జాబితాలిచ్చారు. నేతలకు దాసోహమైన అధికారులు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా పచ్చజెండా ఊపారు.రాష్ట్రస్థాయిలో దీనిపై చర్చ జరిగింది.  ఆ వ్య వహారం ఇంకా చల్లారనే లేదు.
 
 మళ్లీ నియామకాలు  
 తాజాగా మరికొన్ని పోస్టుల నియామకాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. మైదాన ప్రాంతంలో (ఐసీడీఎస్ పరిధి) 28 అంగన్‌వాడీ కార్యకర్తలు, 115ఆయాలు, 34మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 98లింక్ వర్కర్ పోస్టులను, ఐటీడీఏ పరిధిలో 16 అంగన్‌వాడీ కార్యకర్తలు, 55ఆయా పోస్టులు, 19మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 57క్రైసీ వర్కర్లు, 262లింక్ వర్కర్ల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టారు.  గతంలో వచ్చిన  ఆరోపణలకు ఈసారి తావివ్వకూడదన్న ఉద్దేశంతో  ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే ఏ రోజుకా రోజు ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఐసీడీఎస్ పరిధిలో 15,16,22వ తేదీల్లోనూ, ఐటీడీఎ పరిధిలో 18,19,20వ తేదీల్లో ఇంటర్వ్యూలు జరిగాయి. ఐటీడీఎ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించిన రోజునే ఫలితాలను ప్రకటించారు. అంతకుముందే క్రయ, విక్రయాలు జరిగిపోయాయేమో తెలియదు గాని ఫలితాల వెల్లడిలో మాత్రం జాప్యం జరగలేదు.
 
 మైదానంలో మాట తప్పారు
 ఇంటర్వ్యూ పూర్తయి రోజులు గడుస్తున్నా ఫలితాల వెల్లడిలో జాప్యంతో అనుమానాలు  రేకేత్తుతున్నాయి.  క్షేత్రస్థాయిలో బేరసారాలు కుదరక, నేతలు సిఫార్సు చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగానే ఫలితాల వెల్లడిలో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంటర్వ్యూలు పూర్తయ్యాక ఫలితాల ప్రకటనలో జాప్యం జరిగితే ఎన్ని ఒత్తిళ్లు వస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని, క్షణాల్లో జాబితాలు తారుమారైనా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇంటర్వ్యూకు హాజరైన అర్హులైన అభ్యర్థులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అంగన్‌వాడీ పోస్టుల కోసం బయట పెద్ద ఎత్తున బేరసారాలు సాగుతున్నట్లు సమాచారం.  ప్రభుత్వ ఉద్యోగం మాదిరిగా ఉంటుందనే అభిప్రాయంతో ఆశావహులు రూ,లక్షల్లో చెల్లించేందుకు పోటీ పడుతున్నారు. ఉద్యోగం వస్తే ఏదో రకంగా సంపాదించుకోవచ్చన్న ఉద్దేశంతో అడిగినంత ముట్టజెప్పే స్థోమత ఉన్న వారు ముందుకొస్తున్నారు. ఈ పోటీయే నేతలకు కాసుల పంట పండిస్తోంది.  
 
 రెండు రోజుల్లో వెల్లడిస్తాం
 ఐటీడీఏ పరిధిలోని  409 పోస్టులకు ఫలితాలు వెల్లడించామని ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ తెలిపారు. మైదాన ప్రాంతంలో ఉన్న పోస్టు ల  మరో రెండు రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.  ఏరోజుకారోజు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు కదా అని ప్రశించగా సమాధానం దాటవేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement