భూరాబందులు
తిరుపతి/మదనపల్లె: మదనపల్లెలో అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు పెచ్చుమీరిపోయాయి. కంటికి కనిపించిన ఖాళీ స్థలాలన్నింటినీ టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే మదనపల్లెలోని మాజీ సైనికుల స్థలాన్ని ఆక్రమించిన అధికార పార్టీ నేతలు తమ ఆక్రమణల పరంపరను కొనసాగిస్తూ పట్టణంలో మిగిలిన ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఎవ రి పరిధిలో వారు తమదైన శైలిలో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తాజాగా పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీకి చెందిన కోట్ల విలువ చేసే స్థలంపై వీరి కన్ను పడింది. టెండరు ద్వారా ఆర్టీసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకు న్న వ్యాపారి నిర్మిస్తున్న గదుల నిర్మాణాలను శనివారం రాత్రి అడ్డుకుని దౌర్జన్యానికి పాల్ప డ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మదనపల్లె ఆర్టీసీ డిపో పక్కన మెయిన్ రోడ్డుకు ఆనుకుని సర్వే నంబరు 294/1, 294ఏ, 294బీలలో 1,535 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. గతంలో ఆర్టీసీ నిర్మాణాలు పూర్తి కాగా మిగిలిన స్థలాన్ని అధికారులు తమ పరిధిలోనే ఉంచుకున్నారు. ఆదాయ వనరులు పెంచుకునే క్రమంలో ఈ స్థలాన్ని లీజుకివ్వాలని మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సుమారు రూ.1.50 కోట్ల విలువైన ఈ స్థలా న్ని ఎలాగైనా దక్కించుకోవాలని పక్కనే ఉన్న ఓ చోటా టీడీపీ నేత కన్నేశాడు. తనకున్న అధికార బలంతో ఇప్పటికే పలుమార్లు కోర్టుకెళ్లి ఆర్టీసీ టెండర్లను అడ్డుకునేందుకు స్టేలు తెచ్చారు. దీంతో మూడేళ్లుగా ఆర్టీసీ టెండర్ల ద్వారా గదుల నిర్మాణం చేపట్ట లేక లక్షలాది రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. అయితే రెండు నెలల కిందట హైకోర్టు ఆర్టీసీకి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.
వీటిని అమల్లో పెట్టేందుకు మదనపల్లె డిపో అధికారులు సదరు స్థలాన్ని లీజుకిచ్చేందుకు టెండర్లు పిలిచారు. ఏప్రిల్‌లో ఈ స్థలాన్ని వెంకటేశ్ అనే వ్యాపారి లీజుకు పొందాడు. నెలకు రూ.42 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని హోటల్ నిర్మాణ పనులు చేపట్టాడు. అయితే పక్కనే ఉన్న ఓ ప్రయివేటు హోటల్ యజమాని దీన్ని అడ్డుకుని ఆ స్థలా న్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశాడు. శని వారం రాత్రి నిర్మాణ పనులను అడ్డుకుని అక్కడున్న సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. పట్టణ టీడీపీలో క్రియాశీలకంగా ఉండే సదరు యు వ నాయకుడు పార్టీ అండ చూసుకుని ఆక్రమణలకు సిద్ధపడినట్లు సమాచారం.
అధికారుల హెచ్చరికలు బేఖాతరు
ఆ స్థలం ఆర్టీసీదనీ ఎవరూ జోక్యం చేసుకోవద్దని డిపో మేనేజర్ పెద్దన్నశెట్టి చెప్పినా వినని టీడీపీ నేత తనదైన దందాను ప్రదర్శించారు. స్థలం జోలి కొస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు చేయడమే కాకుండా అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా నిర్మాణానికి సిద్ధం చేసిన ఇటుకలు ఇతరత్రా సామాగ్రిని ట్రాక్టర్లలో బలవంతంగా తీసుకెళ్లారు. ఇదేమిటని ప్రశ్నించిన ఆర్టీసీ సిబ్బందిపై గొడవకు దిగి దుర్భాషలాడారు. ఆర్టీసీ సిబ్బందిపై జరిగిన దాడులకు, స్థల ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు డిపో మేనేజర్ పెద్దన్నశెట్టి తెలిపారు.
ఆ స్థలం మాది ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు
మదనపల్లెలోని ఖాళీ స్థలం ఆర్టీసీదనీ, ఎవరో ఆక్రమించేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తిరుపతి ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుని ఆక్రమించేందుకు యత్నించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.