Land acquisitions
-
భూరాబందులు
తిరుపతి/మదనపల్లె: మదనపల్లెలో అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు పెచ్చుమీరిపోయాయి. కంటికి కనిపించిన ఖాళీ స్థలాలన్నింటినీ టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే మదనపల్లెలోని మాజీ సైనికుల స్థలాన్ని ఆక్రమించిన అధికార పార్టీ నేతలు తమ ఆక్రమణల పరంపరను కొనసాగిస్తూ పట్టణంలో మిగిలిన ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఎవ రి పరిధిలో వారు తమదైన శైలిలో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తాజాగా పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీకి చెందిన కోట్ల విలువ చేసే స్థలంపై వీరి కన్ను పడింది. టెండరు ద్వారా ఆర్టీసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకు న్న వ్యాపారి నిర్మిస్తున్న గదుల నిర్మాణాలను శనివారం రాత్రి అడ్డుకుని దౌర్జన్యానికి పాల్ప డ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మదనపల్లె ఆర్టీసీ డిపో పక్కన మెయిన్ రోడ్డుకు ఆనుకుని సర్వే నంబరు 294/1, 294ఏ, 294బీలలో 1,535 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. గతంలో ఆర్టీసీ నిర్మాణాలు పూర్తి కాగా మిగిలిన స్థలాన్ని అధికారులు తమ పరిధిలోనే ఉంచుకున్నారు. ఆదాయ వనరులు పెంచుకునే క్రమంలో ఈ స్థలాన్ని లీజుకివ్వాలని మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సుమారు రూ.1.50 కోట్ల విలువైన ఈ స్థలా న్ని ఎలాగైనా దక్కించుకోవాలని పక్కనే ఉన్న ఓ చోటా టీడీపీ నేత కన్నేశాడు. తనకున్న అధికార బలంతో ఇప్పటికే పలుమార్లు కోర్టుకెళ్లి ఆర్టీసీ టెండర్లను అడ్డుకునేందుకు స్టేలు తెచ్చారు. దీంతో మూడేళ్లుగా ఆర్టీసీ టెండర్ల ద్వారా గదుల నిర్మాణం చేపట్ట లేక లక్షలాది రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. అయితే రెండు నెలల కిందట హైకోర్టు ఆర్టీసీకి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమల్లో పెట్టేందుకు మదనపల్లె డిపో అధికారులు సదరు స్థలాన్ని లీజుకిచ్చేందుకు టెండర్లు పిలిచారు. ఏప్రిల్‌లో ఈ స్థలాన్ని వెంకటేశ్ అనే వ్యాపారి లీజుకు పొందాడు. నెలకు రూ.42 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని హోటల్ నిర్మాణ పనులు చేపట్టాడు. అయితే పక్కనే ఉన్న ఓ ప్రయివేటు హోటల్ యజమాని దీన్ని అడ్డుకుని ఆ స్థలా న్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశాడు. శని వారం రాత్రి నిర్మాణ పనులను అడ్డుకుని అక్కడున్న సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. పట్టణ టీడీపీలో క్రియాశీలకంగా ఉండే సదరు యు వ నాయకుడు పార్టీ అండ చూసుకుని ఆక్రమణలకు సిద్ధపడినట్లు సమాచారం. అధికారుల హెచ్చరికలు బేఖాతరు ఆ స్థలం ఆర్టీసీదనీ ఎవరూ జోక్యం చేసుకోవద్దని డిపో మేనేజర్ పెద్దన్నశెట్టి చెప్పినా వినని టీడీపీ నేత తనదైన దందాను ప్రదర్శించారు. స్థలం జోలి కొస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు చేయడమే కాకుండా అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా నిర్మాణానికి సిద్ధం చేసిన ఇటుకలు ఇతరత్రా సామాగ్రిని ట్రాక్టర్లలో బలవంతంగా తీసుకెళ్లారు. ఇదేమిటని ప్రశ్నించిన ఆర్టీసీ సిబ్బందిపై గొడవకు దిగి దుర్భాషలాడారు. ఆర్టీసీ సిబ్బందిపై జరిగిన దాడులకు, స్థల ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు డిపో మేనేజర్ పెద్దన్నశెట్టి తెలిపారు. ఆ స్థలం మాది ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు మదనపల్లెలోని ఖాళీ స్థలం ఆర్టీసీదనీ, ఎవరో ఆక్రమించేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుని ఆక్రమించేందుకు యత్నించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘సాక్షి’పై కేసులో హైకోర్టు స్టే
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తారా? - అసలు ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు ఏముంది? - టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదుపై తదుపరి చర్యలన్నీ నిలిపివేత సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల భూ ఆక్రమణలపై కథనాలు ప్రచురించినందుకు సాక్షి విలేకరులు, యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు, ఫిర్యాదుదారైన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తీరును న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. ఓ చర్చి ఆస్తులను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కాజేసిన వైనంపై సాక్షి దినపత్రిక గత నెల 6, 7 తేదీల్లో వరుస కథనాలు ప్రచురించింది. అవి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వర్గపోరును ప్రోత్సహించేలా ఉన్నాయంటూ గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అరండల్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సాక్షి విలేకరులు, యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 153ఎ, 500, 501, 502, 505ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సాక్షి విలేకరులతో పాటు యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు చెల్లదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.శ్రీరామ్ స్పష్టం చేశారు. ప్రతిష్టకు భంగం వాటిల్లిందనుకున్నప్పుడు నిబంధనల ప్రకార ం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకూడదని, సంబంధిత మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు దాఖలు చేయాలని తెలి పారు. సాక్షి కథనాల వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఇది అధికార దుర్వినియోగమే..: ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఓ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఐపీసీ 153 కింద ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఆ కథనాలు వర్గపోరును ఎలా ప్రోత్సహిస్తున్నాయని నిలదీశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు మీడియాపై పరువు నష్టం కేసులు ఎలా దాఖలు చేస్తాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన విషయం గుర్తులేదా? అంటూ నిలదీశారు. పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగిందని భావిస్తే, దానిపై ఫిర్యాదుకు ఓ నిర్దిష్ట విధానం ఉందని చెప్పారు. మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేయాల్సిన ఫిర్యాదును ఎమ్మెల్యే పోలీసులకు చేశారని, వారూ చట్టం నిర్దేశించిన విధానాన్ని పట్టించుకోకుండా కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించారు. పోలీసులు పరువు నష్టం కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఇది అధికార దుర్వినియోగం కిందకు రాదా? అనినిలదీశారు. అసలు ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఏముందని ప్రశ్నిస్తూ.. కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
'నయీం అనుచరులతో ప్రాణభయం'
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరులతో తమకు ప్రాణభయం ఉందని నయీం బాధితులు ఆరోపించారు. కరీంనగర్లో నయీం బాధితులు బుధవారం మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా బాధితులు వీరలక్ష్మీ, కాంతారావు, రియల్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ...14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చేశారన్నారు. నగునూరు భూ ఆక్రమణలో నయీం, అతని అనుచరులు ఉన్నారని చెప్పారు. భూ ఆక్రమణలతో ప్రమేయమున్న అందరినీ అరెస్ట్ చేయాలని నయీం బాధితులు డిమాండ్ చేశారు. -
ప్లాట్లుగా కొండ పోరంబోకు
సెంటు రూ.3 లక్షల చొప్పున విక్రయం సీఆర్డీఏ అధికారుల అండపై అనుమానం ఓ తెలుగుదేశం పార్టీ నేత నిర్వాకం పట్టించుకోని ప్రభుత్వ శాఖలు ►ప్లాట్లుగా కొండ పోరంబోకు మంగళగిరి : మండలంలోని ఎర్రబాలెం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ఒకరు పెనుమాక-ఎర్రబాలెం మధ్యలో కొండను ఆనుకుని మూడు ఎకరాల్లో అనధికార లేఅవుట్ వేసి విక్రయించారు. నాలుగు నుంచి ఐదు సెంట్లను ప్లాట్లుగా విభజించి ఒక్కో సెంటు రూ.3 నుంచి 3.50 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఆ ప్లాట్లు గ్రామకంఠంలోకి రావని తెలిసి స్థానికులు ఎవరూ కొనుగోలు చేయకపోయినా తనకున్న పరిచయాలతో హైదరాబాద్‌కు చెందిన వారిని మధ్యవర్తులుగా నియమించి భారీగా కమీషన్లు అందజేసి విక్రయించారు. ఈ వ్యవహారంలో సీఆర్డీఏకు చెందిన కొందరు అధికారులు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలొచ్చాయి. వారి అండదండలతోనే అక్రమార్కులు కొండపోరంబోకు భూమిని ఆక్రమించి యథేచ్ఛగా ప్లాట్లు వేశారని పలువురు అంటున్నారు. తమ అనుమతి లేనిదే అంగుళం స్థలం కూడా అమ్మటానికి లేదని చెప్పిన సీఆర్డీఏ అధికారులు... ఏకంగా కొండ పోరంబోకు భూమినే విక్రయిస్తే కళ్లు మూసుకొని చూస్తున్నారా...అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంత్రి అండతోనే.... రాష్ట్ర మంత్రి, సీఆర్డీఏ వైస్‌చైర్మన్ తనకు అత్యంత సన్నిహితులని ప్లాట్లు అన్నింటినీ గ్రామ కంఠంలో చేర్చి మినహాయిస్తామని హామీ ఇవ్వడంతోనే కొందరు స్థలాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అనధికార లేఅవుట్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నా సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఎర్రబాలెం కొండకు అటవీశాఖ ఏర్పాటు చేసిన రక్షణగోడను ఆనుకుని ప్లాట్లు వేశారు. రక్షణ గోడ నుంచి అటవీశాఖ వదిలిన 50 అడుగుల భూమిని కలుపుకుని లేఅవుట్‌కు రోడ్‌గా ఏర్పాటు చేసినా అటు అటవీశాఖ గానీ ఇటు సీఆర్డీఏ, మరో వైపు రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఆర్డీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలతో పాటు ఒక్క అంగుళం భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న అధికారులకు అధికారపార్టీ నేతలు వేసిన అనధికారలేఅవట్ కనిపించడకపోవడం విశేషం. అనధికార లేఅవుట్, అటవీభూముల ఆక్రమణలపై సీఆర్డీఏ అధికారులతో పాటు రెవెన్యూ, అటవీశాఖ అధికారులను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. -
అమ్మకానికి ఉదయగిరి
⇒ సూత్రధారులు రెవెన్యూ అధికారులు ⇒ పాత్రధారులు తెలుగు తమ్ముళ్లు ⇒ యథేచ్ఛగా ఇళ్ల స్థలాల ఆక్రమణ ఉదయగిరి: ఉదయగిరిలో యథేచ్ఛగా భూఆక్రమణలు, దందాలు సాగుతున్నాయి. దీనికి కొందరు రెవెన్యూ అధికారులు సూత్రధారులు కాగా తెలుగుతమ్ముళ్లు పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు రెవెన్యూ అధికారుల సహకారంతో అక్కడ కొందరు తెలుగుతమ్ముళ్లు పాగా వేసి ప్లాట్లు వేసి అమ్మకాలు సాగిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. దీంతో పేదలకు జానెడు స్థలం దొరకని దుస్థితి నెలకుంది. ఇంటి స్థలాల కోసం రెవెన్యూ అధికారులు చుట్టూ పేదలు తిరుగుతున్నా ఎలాంటి ఫలితం కానరావడం లేదు. సీఎంగా కిరణ్ ఉన్నప్పుడు సాగిస్తున్న ఈ దందా చంద్రబాబు వచ్చేసరికి తారాస్థాయికి చేరింది. తమకు అండగా నిలుస్తున్న అధికారులకు అక్రమార్కులు భారీగా ముడుపులు ముట్టచెబుతున్నారనే ప్రచారం బలంగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాకమునుపు ఉదయగిరిలో ప్రభుత్వ భూములకు పెద్దగా విలువ లేదు. కనీసం ఇల్లు కట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపేవారు కాదు. ఉదయగిరి దుర్గాన్ని రాజులు ఏలిన ప్రాంతం కావడంతో ఇక్కడ ఇళ్ల స్థలాలకు పట్టాలు లేవు. కొందరు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. చాలా వరకు ప్రభుత్వ స్థలాలు అట్లే ఉండిపోయాయి. గత ఆరేడేళ్ల నుంచి ఉదయగిరి పట్టణం క్రమంగా అభివృద్ధి పథంలో పయనించడంతో చుట్టుపక్కల గ్రామీణులు ఇక్కడే ఇళ్లు కట్టుకోవడం ప్రారంభించారు. దీంతో ఇళ్ల స్థలాలకు డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు రాజకీయ అండదండలతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ప్లాట్లగా విభజించి అమ్మడం ప్రారంభించారు. గతంలో తహశీల్దారుగా పనిచేసిన నారాయణమ్మ ఆక్రమిత స్థలాలను గుర్తించి ప్రభుత్వ స్వాధీనం చేసింది. రెండేళ్లుగా ఇక్కడికి వచ్చిన కొంతమంది తహశీల్దార్లు ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టారు. పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని రికార్డులు తారు మారు చేస్తూ ఆక్రమణదారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉదయగిరిలోని బీసీ కాలనీ సమీపంలో సర్వే నం.37లో అధికార పార్టీకి చెందిన ఓ నేత బంధువు వారం కొంత స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా చదును చేశాడు. దీనికి గిరాకీ అధికంగా ఉండటంతో కొంతమంది తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. తహశీల్దారు నామమాత్రంగా స్థల పరిశీలన చేసి మిన్నకుండిపోయారు. అలాగే షబ్బీర్ కాలనీ ప్రాంతంలో ఇటీవల లేఔట్లు వేసిన కొంతమంది నేతలు పక్కనే ఉన్న శ్మశానాన్ని ఆక్రమించి ప్లాట్లు వేసుకునేందుకు కొంత చదును చేశారు. స్థానికులు అభ్యంతరం తెలపడంతో ప్రస్తుతానికి నిలిపివేశారు. ఉదయగిరి-కావలి రోడ్డు మార్గంలో సుమారు రూ.50 లక్షల విలువచేసే ఇళ్ల స్థలాలను కొంతమంది నేతలు ఆక్రమించి అమ్మేశారు. మరికొంత స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారు. టూరిజం బంగ్లా సమీపంలో గతంలో ఇచ్చిన ప్లాట్లను జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్ రద్దుచేసి దానిని టూరిజం కోసం ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా కొంతమంది అధికార పార్టీ నేతలు ఆ స్థలాన్ని ఖాళీ చేయకుండా వివిధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఎక్కువ ఖరీదు చేసే ఈ స్థలాలు కూడా అమ్మకాలు జరిగాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడ దర్జాగా ఇళ్లు వెలిశాయి. ఇక్కడే ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలాలను అధికార నేతలకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు అవగాహనకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు పెద్దమొత్తంలో చేతులు మారినట్టు విమర్శలున్నాయి. అలాగే మోడల్‌కాలనీ పేరుతో గతంలో ఉదయగిరికి చెందిన కొంతమంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా, ఇళ్లు కట్టుకోలేదన్న ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు వాటిని రద్దుచేశారు. ఈ స్థలంలో కొంతమేర కొందరు ఆక్రమించుకొని ఫెన్సింగ్ వేసుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ఈ విధంగా ఉదయగిరి పట్టణంలోని ఇళ్ల మధ్య ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికావడంపై పట్టణవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి ఆక్రమణ స్థలాలపై సమగ్ర విచారణ జరిపితే కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారుల నుంచి విముక్తి అవుతాయని పట్టణవాసులు ఆశిస్తున్నారు. -
తప్పించాల్సిందే..
నలుగురు అవినీతి మంత్రులపై బీజేపీ ఆగ్రహం విధానసౌధలోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నాకు యత్నం అదుపులోకి తీసుకున్న పోలీసులు బెంగళూరు : భూ ఆక్రమణలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు డీకే శివకుమార్, ఖమరుల్ ఇస్లాం, దినేష్ గుండూరావు, మహదేవప్రసాద్ను తక్షణమే మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగేందుకు విఫలయత్నం చేశారు. గురువారమిక్కడి విధానసౌధ ప్రాంగణానికి చేరుకున్న బీజేపీ నేతలు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విధానసౌధ తూర్పు వైపు ప్రవేశ ద్వారం గాంధీజీ విగ్రహం వైపు కదిలారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విధానసౌధ ప్రాంగణంలో ధర్నాకు అవకాశం లేద ంటూ బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ఈ సందర్భంలో బీజేపీ నేతలు, పోలీసుల నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులను తోసుకుంటూ బీజేపీ నేతలు గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అక్కడి నుంచి తరలించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి, ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహరాల ఇన్చార్జ్ మురళీధరవ్రావు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప, ఎంపీ శోభాకరంద్లాజే తదితరులను పోలీసులు ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపే అవకాశాన్ని సైతం కల్పించకపోవడం దారుణమంటూ ధ్వజమెత్తారు. శాసన సభ్యుల హక్కుల ఉల్లంఘన.... విధానసౌధ ప్రాంగణంలో తాము నిర్వహించతలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా శాసనసభ్యుల హక్కుల ఉల్లంఘనకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందని మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. ఈ విషయంపై రానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. అవినీతి పరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని, అందుకే అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర మంత్రులను సైతం వెనకేసుకొస్తోందని మండిపడ్డారు. డిసెంబర్ 2న మరోసారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. -
కుంటల్లో కబ్జాదారుల కాసుల పంట
పట్టణంలోని చెరువులు, కుంటలు కబ్జాదారులకు కాసుల పంట పండిస్తున్నాయి. ఇన్నాళ్లు పట్టణంలోని పలుచోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వీరు ప్రస్తుతం కుంటలు, చెరువులపై కన్నేశారు. ఫలితంగా పట్టణంలో భూగర్భ జలాల పెంపు కోసం ఉపయోగపడిన ఈ జలాశయాలు క్రమక్రమంగా కుచించుకుపోతున్నాయి. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. - మహబూబాబాద్ - యథేచ్ఛగా భూ ఆక్రమణలు - పట్టించుకోని రెవెన్యూ అధికారులు - చెరువుల కబ్జాతో అడుగంటుతున్న భూగర్భ జలాలు అడుగంటిన భూగర్భ జలాలు.. కుంటలు, చెరువుల విస్తీర్ణం తగ్గడంతో మానుకోటలో భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయాయి. బావుల్లో నీరు అడుగంటి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చేతి పంపులు పనిచేయడం లేదు. అధికారుల అండదండలతోనే కబ్జాదార్లు కబ్జాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కబ్జాదారులు ఏకంగా సంబంధిత బై నంబర్లతో పత్రాలను కూడా తయారు చేయించుకోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుంటలను, చెరువులను కబ్జా కాకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కుంటలకు, చెరువులకు హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయూలని వేడుకుంటున్నారు. కబ్జాదారులపై కేసులు నమోదు చేసి, తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో భూముల ధరలకు రెక్కలు రెండేళ్ల క్రితం వరకు మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మానుకోట పట్టణం ప్రస్తుతం మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. సుమారు 60 కాలనీలు, లక్ష జనాభాతో దినదినం అభివృద్ధి చెందుతోంది. నివేశన స్థలాలకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకున్న కబ్జాదారులు చెరువులు, కుంటలను ఆక్రమిస్తున్నారు. మానుకోట శివారులో ఎకరం ధర రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోంది. పట్టణ శివారులోనూ గజం ధర రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంది. కుచించుకుపోతున్న చెరువులు పట్టణంలోని పాతబజార్‌లో నిజాం చెరువు(సర్వే నంబర్ 642) విస్తీర్ణం 29 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా ఇందులో ఎఫ్టీఎల్ కింద ఉన్న 13 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే బంధం చెరువు(సర్వే నెంబర్ 307) 29 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఇందులో చాలా మేరకు కబ్జాకు గురికావడంతో చిన్న కుంటగా మారింది. కంబాల చెరువు(సర్వే నెంబర్ 442) 87 ఎకరాల 7 గుంటల విస్తీర్ణంలో ఉండగా కొంత మేర కబ్జా జరిగింది. రాభద్రు చెరువు 14 ఎకరాల విస్తీర్ణం ఉండగా 2 ఎకరాలకుపైగా కబ్జాకు గురైంది. జానాల చెరువు 201 ఎకరాల్లో ఉండగా 10 ఎకరాలు కబ్జాకు గురైందని అధికారులు చెబుతున్నప్పటికీ సగానికి పైగా భూములు కబ్జాకు గురై చెరువు విస్తీర్ణం పూర్తిగా తగ్గినట్లు ఆ ప్రాంతాన్ని చూస్తే తెలుస్తుంది. గుండ్లకుంట 9 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఎకరంన్నర కబ్జాకు గురైందని అధికారులు చెబుతున్నప్పటికీ సగానికిపైగా కబ్జాకు గురైనట్లు ఆ ప్రాంతంలో వెలిసిన గృహాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటికితోడు పలు పార్టీల ఆధ్వర్యంలో చెరువు శిఖం భూముల్లో కాలనీలు ఏర్పాటు చేయడంతో చెరువులు కుంటలుగా, కుంటలు నీటి మడుగులుగా మారిపోయూయి. అధికారులు మాత్రం ఎఫ్టీఎల్ స్థలాల్లో గృహాలు నిర్మించుకున్నవారికి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కబ్జాదారులకు నోటీసులు జారీ చేశాం రాభ ద్రు చెరువుతోపాటు పలు చెరువు శిఖం భూములు కబ్జాకు గురికాగా కబ్జాదారులకు నోటీసులు జారీ చేశాం. శిఖం భూముల్లో నిర్మాణాలు చేపడుతుంటే కూల్చివేస్తున్నాం. భూములకు హద్దు రాళ్లను కేటాయించాం. కబ్జాకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. కొన్నేళ్ల క్రితమే కొంతభూమి కబ్జాకు గురైంది. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాం. - తిరుపతి, ఆర్ఐ -
యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ
జిల్లాలో భూ ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆక్రమణదారులు కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రా జకీయ నాయకులే కబ్జాదారులవుతున్నారు. దీంతో జిల్లాలో పేదలకు పంచడానికి జాగా లేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో నిజామాబాద్ నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు, కా మారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, డిచ్పల్లి, బా ల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్, నిజాంసాగర్ తదితర ప ట్టణాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ఇదీ పరిస్థితి.. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో ఉన్న ఎల్లమ్మ చెరువు శిఖం భూమి పది ఎకరాలు ఆక్రమణకు గురైంది. అధికార పార్టీకి చెందిన నేతల అండదండలతో కబ్జా చేసిన వ్యక్తులు ఈ భూమిని బైపాస్ రోడ్డు కోసం ఇచ్చి లక్షల రూపాయలు తమ ఖాతాలో వేసుకున్నారు. నగర పరిధిలో 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్న పూలాంగ్ కాలువ భూములు ఎప్పుడో కబ్జాకు గురయ్యాయి. నిజామాబాద్-సారంగాపూర్ ప్రధాన రహదారిలో నిజాంసాగర్ కాలువ పక్కనున్న భూములను పలువురు పెద్దలు కబ్జా చేసి, ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. కాంప్లెక్సులు నిర్మించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. సిర్పూర్ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 1, 2, 48లో సుమా రు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు బినామీ పేర్లతో తమ అధీనంలోకి తీసుకున్నారు. సారంగాపూర్‌లోని సర్వేనంబర్ 92లో ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయానికి సన్నద్ధమవుతున్నారు. నిజామాబాద్-బోధన్ రహదారిలో సారంగాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 158లో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే ఎకరం సర్కారు స్థలాన్ని ప్రతిపక్షానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఆక్రమించుకొని విక్రయించడానికి సిద్ధమయ్యారని, ఆయనకు రెవెన్యూ ఉద్యోగుల అండదండలు ఉన్నాయని తెలుస్తోంది. గ్రామస్తులు దీనిని గ్రహించి, ప్రభుత్వ భూమిని రక్షించాలంటూ అందోళనకు దిగారు. దీంతో రక్షణ చర్యల్లో భాగంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ అధికారుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మల్లారం ముద్దరోని కుంటకు చెందిన భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసినట్లు తెలుస్తోంది. పాంగ్రాలోని సర్వే నంబర్ 443లో ఉన్న భూమి కబ్జా అయ్యింది. గూపన్పల్లి ప్రాంతంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. ఎక్కడ చూసినా.. ఆర్మూర్ మండలం పెర్కిట్, కోటార్మూర్ శివార్లలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మడానికి రియల్ వ్యాపారులు సన్నాహాలు చేస్తున్నారు. బాన్సువాడ నడిబొడ్డున ఇందూరు సహకార మార్కెటింగ్ సొసైటీకి చెందిన 7 ఎకరాల స్థలంలో 4 ఎకరాల స్థలం కబ్జా అయ్యింది. మాక్లూర్ మండలం దాస్‌నగర్‌లో కోటి రూపాయల విలువ చేసే ఎకరం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. ఈ స్థలంలో ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంకు, రైస్‌మిల్లుతో పాటు పలు నిర్మాణాలు చేపట్టారు. రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు రెవన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. డిచ్పల్లి, నడిపల్లి శివార్లలోని సర్వే నంబర్ 334లో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. జిల్లాలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రభుత్వ భూమిని కాపాడడానికి సీసీఎల్ఏ, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
సర్కారు జాగా.. వేసేయ్ పాగా!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న మావల చెరువు చుట్టూ ఆక్రమణలే. నిజాముల కాలం నాటి మావల చెరువు ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోతోంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువును ఆక్రమించి కొందరు పె(గ)ద్దలు అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. ఫంక్షన్‌హాల్స్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల అండదండలతో రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు ఊతమిచ్చారు. యథేచ్ఛగా సాగుతున్న ఆక్రమణలతో మావల చెరువు కబ్జాకు గురవుతుండగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువు ఏ మేరకు ఆక్రమణకు గురయ్యిందో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. రూ.10 కోట్ల విలువ చేసే భూములు ఇప్పటికే ఆక్రమణకు గురి కాగా, పదేళ్ల క్రితం ఆక్రమించి నిర్మించిన భవనాల బాగోతం సైతం బట్టబయలు అవుతోంది. ఏళ్ల తరబడిగా ఆక్రమణలు జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి-7ను ఆనుకుని ఉన్న మావల చెరువు 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. 131, 135 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 100 ఎకరాలు కాగా, 60 ఎకరాల విస్తీర్ణంలో చెరువు, 40 ఎకరాల్లో చెరువు శిఖం ఉంది. అయితే ఈ చెరువును అనుకొని ఫోర్‌లేన్ (నేషనల్ హైవే) పడటం తో చుట్టూ ఉన్న భూముల ధర అమాంతం గా పెరిగింది. దీంతో చెరువు శిఖంతోపాటు చెరువును ఆనుకొని ఉన్న పట్టా స్థలాలపై రాజకీయ పెద్దలు, భూమాఫియా గద్దల కన్ను పడింది. అధికారపక్షం, ప్రతిపక్షం తేడా లేకుండా అందరొక్కటై మావల చెరువును కలుపుకుని ఓ సర్వే నంబర్‌తో ‘బినామీ’ పట్టాదారున్ని సృష్టించి రూ.7 కోట్ల విలువ చేసే 9 ఎకరాల స్థలంలో పాగా వేశారు. తెరవెనుక ఓ రెవెన్యూశాఖ అధికారి, ఓ సర్వేయర్ కీలకం కాగా, రాజకీయ అండదండలతో జరిగిన ఈ ఆక్రమణ ఎవరికీ పట్టకపోవడం చర్చనీయాంశం అవుతోంది. అయితే వేసవికాలంలో చెరువులో నీటిమట్టం తగ్గిపోయి విస్తీర్ణం తక్కువగా కనిపించగా, జూలై 15 నుంచి కురిసిన వర్షాలతో మావల చెరువుకు జలకళ వచ్చింది. దీంతో 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో పూర్తిగా నీరు చేరింది. 40 ఎకరాల్లో ఉండాల్సిన చెరువు శిఖం నుంచి సగానికి పైగా ఆక్రమణకు గురి కాగా, పట్టా భూముల్లో కలుపుకొని చెరువు శిఖంలో నిర్మించిన భవనాలు దర్శనమిస్తున్నాయి. కలెక్టర్ గారూ.. స్పందించండి.. మావల చెరువుతో పాటు ఆదిలాబాద్ చుట్టూ ఉన్న మావల, దస్నాపూర్, బట్టి సావర్‌గామ్, అనుకుంట, ఖానాపూర్ శివార్లలో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ, రెవెన్యూ, అటవీ, అసైన్డ్భూములు ఆక్రమణకు గురయ్యాయి. భూ ఆక్రమణలపై ఏడాది క్రితం పెద్ద ఎతున ప్రజాందోళనలు చోటు చేసుకోగా... అప్పటి కలెక్టర్ ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేశారు. అక్రమ లేఅవుట్లు, భూ ఆక్రమణలపై మొదట కొంత సీరియస్‌గానే వ్యవహరించినట్లు కనిపించినా... ఆ తర్వాత ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆక్రమణదారులపై చర్యలకు వెనుకంజ వేశారు. దీంతో భూ మాఫియా, ఆక్రమణదారులు రెచ్చిపోయి కనిపించిన సర్కారు స్థలాలను కబ్జా చేశారు. ఈ భూ బాగోతాల వెనుక గతంలో పనిచేసిన ఇద్దరు రెవెన్యూ అధికారుల పాత్రపై ప్రముఖంగా విమర్శలు వినిపిం చాయి. అయిన్పటికీ ఫలితం లేకపోవడంతో ల్యాండ్ మాఫియా పడగ విప్పింది. ప్రభుత్వ, రెవెన్యూ, అసైన్డ్, చెరువుశిఖంలను ఆక్రమించిన అక్రమ కట్టడాలు చేపట్టడం వివాదాస్పదం అవుతోంది. జాతీయ రహదారిని అనుకుని ఉన్న అత్యంత ఖరీదైన మావల చెరువును అక్రమించిన గతంలో కట్టడాలు జరిపినా... ఇంకా ఆక్రమణలు జరుగుతున్నాయని తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. కలెక్టర్ స్పందించిన మావల చెరువు చుట్టూ సాగుతున్న ఆక్రమణలపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల కిందట ఆక్రమించి జరిపిన కట్టడాలపైనా విచారణ జరిపి... భవిష్యత్‌లో ఆక్రమణలకు తావు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.