జిల్లాలో భూ ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆక్రమణదారులు కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రా జకీయ నాయకులే కబ్జాదారులవుతున్నారు. దీంతో జిల్లాలో పేదలకు పంచడానికి జాగా లేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో నిజామాబాద్ నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు, కా మారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, డిచ్‌పల్లి, బా ల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్, నిజాంసాగర్ తదితర ప ట్టణాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి.
ఇదీ పరిస్థితి.. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో ఉన్న ఎల్లమ్మ చెరువు శిఖం భూమి పది ఎకరాలు ఆక్రమణకు గురైంది. అధికార పార్టీకి చెందిన నేతల అండదండలతో కబ్జా చేసిన వ్యక్తులు ఈ భూమిని బైపాస్ రోడ్డు కోసం ఇచ్చి లక్షల రూపాయలు తమ ఖాతాలో వేసుకున్నారు. నగర పరిధిలో 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్న పూలాంగ్ కాలువ భూములు ఎప్పుడో కబ్జాకు గురయ్యాయి. నిజామాబాద్-సారంగాపూర్ ప్రధాన రహదారిలో నిజాంసాగర్ కాలువ పక్కనున్న భూములను పలువురు పెద్దలు కబ్జా చేసి, ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. కాంప్లెక్సులు నిర్మించి వ్యాపారాలు చేసుకుంటున్నారు.
సిర్‌పూర్ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 1, 2, 48లో సుమా రు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు బినామీ పేర్లతో తమ అధీనంలోకి తీసుకున్నారు. సారంగాపూర్‌లోని సర్వేనంబర్ 92లో ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయానికి సన్నద్ధమవుతున్నారు. నిజామాబాద్-బోధన్ రహదారిలో సారంగాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 158లో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే ఎకరం సర్కారు స్థలాన్ని ప్రతిపక్షానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఆక్రమించుకొని విక్రయించడానికి సిద్ధమయ్యారని, ఆయనకు రెవెన్యూ ఉద్యోగుల అండదండలు ఉన్నాయని తెలుస్తోంది. గ్రామస్తులు దీనిని గ్రహించి, ప్రభుత్వ భూమిని రక్షించాలంటూ అందోళనకు దిగారు. దీంతో రక్షణ చర్యల్లో భాగంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ అధికారుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మల్లారం ముద్దరోని కుంటకు చెందిన భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసినట్లు తెలుస్తోంది. పాంగ్రాలోని సర్వే నంబర్ 443లో ఉన్న భూమి కబ్జా అయ్యింది. గూపన్‌పల్లి ప్రాంతంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది.
ఎక్కడ చూసినా..
ఆర్మూర్ మండలం పెర్కిట్, కోటార్మూర్ శివార్లలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మడానికి రియల్ వ్యాపారులు సన్నాహాలు చేస్తున్నారు. బాన్సువాడ నడిబొడ్డున ఇందూరు సహకార మార్కెటింగ్ సొసైటీకి చెందిన 7 ఎకరాల స్థలంలో 4 ఎకరాల స్థలం కబ్జా అయ్యింది. మాక్లూర్ మండలం దాస్‌నగర్‌లో కోటి రూపాయల విలువ చేసే ఎకరం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. ఈ స్థలంలో ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంకు, రైస్‌మిల్లుతో పాటు పలు నిర్మాణాలు చేపట్టారు. రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు రెవన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. డిచ్‌పల్లి, నడిపల్లి శివార్లలోని సర్వే నంబర్ 334లో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. జిల్లాలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రభుత్వ భూమిని కాపాడడానికి సీసీఎల్‌ఏ, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ
Published Thu, Oct 10 2013 6:56 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
Advertisement
Advertisement