తప్పించాల్సిందే..
నలుగురు అవినీతి మంత్రులపై బీజేపీ ఆగ్రహం
విధానసౌధలోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నాకు యత్నం
అదుపులోకి తీసుకున్న పోలీసులు
బెంగళూరు : భూ ఆక్రమణలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు డీకే శివకుమార్, ఖమరుల్ ఇస్లాం, దినేష్ గుండూరావు, మహదేవప్రసాద్‌ను తక్షణమే మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగేందుకు విఫలయత్నం చేశారు. గురువారమిక్కడి విధానసౌధ ప్రాంగణానికి చేరుకున్న బీజేపీ నేతలు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విధానసౌధ తూర్పు వైపు ప్రవేశ ద్వారం గాంధీజీ విగ్రహం వైపు కదిలారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విధానసౌధ ప్రాంగణంలో ధర్నాకు అవకాశం లేద ంటూ బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ఈ సందర్భంలో బీజేపీ నేతలు, పోలీసుల నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులను తోసుకుంటూ బీజేపీ నేతలు గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకున్నారు.
ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అక్కడి నుంచి తరలించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి, ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహరాల ఇన్‌చార్జ్ మురళీధరవ్‌రావు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప, ఎంపీ శోభాకరంద్లాజే తదితరులను పోలీసులు ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపే అవకాశాన్ని సైతం కల్పించకపోవడం దారుణమంటూ ధ్వజమెత్తారు.
శాసన సభ్యుల హక్కుల ఉల్లంఘన....
విధానసౌధ ప్రాంగణంలో తాము నిర్వహించతలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా శాసనసభ్యుల హక్కుల ఉల్లంఘనకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందని మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. ఈ విషయంపై రానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. అవినీతి పరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని, అందుకే అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర మంత్రులను సైతం వెనకేసుకొస్తోందని మండిపడ్డారు. డిసెంబర్ 2న మరోసారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.