సోషల్ మీడియాలో ఆ మంత్రులదే హవా!
న్యూఢిల్లీ: ఎక్కువమంది ప్రజలతో సంబంధాలు కొనసాగించడానికి, తమ విధానాలను, విమర్శలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలో ఉన్న బలమైన అస్త్రం సోషల్ మీడియా అని చెప్పొచ్చు. సోషల్ మీడియా వినియోగం విషయంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక శ్రద్థ తీసుకుంటుంది. ఈ విషయం కొందరు కేంద్ర మంత్రులు నిరంతరం సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండటం చూస్తేనే అర్థమౌతోంది. మొన్నటికి మొన్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు.. ఓ ప్రయాణికురాలు తనకు రైళ్లో ఆపద ఉందని ట్వీట్ చేస్తే వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేసిన విషయం ఈ తెలిసిందే.
ఇకపోతే సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్గా ఉండని మంత్రులపై కూడా పీఎంఓ కార్యాలయం ఓ కన్నేసింది. వీరికి సోషల్ మీడియాను ప్రభావవంతంగా వినియోగించడం ఎలా అనే అంశంపై క్లాసులు పెట్టి మరీ నేర్పిస్తున్నారని తెలిసింది. ట్విట్టర్, ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండాలని స్వయానా అధినాయకత్వమే కోరుతుండటంతో లీడర్లు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే మంత్రుల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హెచ్ఆర్డీ మినిస్టర్ స్మృతీ ఇరానీ, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్, వాణిజ్య మంత్రి నిర్మాలా సీతారామన్, జితేంద్ర సింగ్లు కూడా సాధారణ ప్రజానికానికి సైతం సోషల్ మీడియాలో రిప్లైలు ఇస్తూ అందుబాటులో ఉంటున్నారు. ఈ ఆరుగురు మంత్రుల బాటలోనే మిగతా నేతలు కూడా నడవాలని, మంత్రుల రోజువారి సోషల్ మీడియా కార్యకలాపాలను ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఇలాంటి చర్యలతో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడటమే కాకుండా పారదర్శకత సైతం పెరుగుతోందని ఆశిస్తున్నారు.