ప్లాట్లుగా కొండ పోరంబోకు
సెంటు రూ.3 లక్షల చొప్పున విక్రయం
సీఆర్‌డీఏ అధికారుల అండపై అనుమానం
ఓ తెలుగుదేశం పార్టీ నేత నిర్వాకం
పట్టించుకోని ప్రభుత్వ శాఖలు
►ప్లాట్లుగా కొండ పోరంబోకు
మంగళగిరి : మండలంలోని ఎర్రబాలెం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ఒకరు పెనుమాక-ఎర్రబాలెం మధ్యలో కొండను ఆనుకుని మూడు ఎకరాల్లో అనధికార లేఅవుట్ వేసి విక్రయించారు. నాలుగు నుంచి ఐదు సెంట్లను ప్లాట్‌లుగా విభజించి ఒక్కో సెంటు రూ.3 నుంచి 3.50 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఆ ప్లాట్‌లు గ్రామకంఠంలోకి రావని తెలిసి స్థానికులు ఎవరూ కొనుగోలు చేయకపోయినా తనకున్న పరిచయాలతో హైదరాబాద్‌కు చెందిన వారిని మధ్యవర్తులుగా నియమించి భారీగా కమీషన్లు అందజేసి విక్రయించారు. ఈ వ్యవహారంలో సీఆర్‌డీఏకు చెందిన కొందరు అధికారులు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలొచ్చాయి. వారి అండదండలతోనే అక్రమార్కులు కొండపోరంబోకు భూమిని ఆక్రమించి యథేచ్ఛగా ప్లాట్లు వేశారని పలువురు అంటున్నారు. తమ అనుమతి లేనిదే అంగుళం స్థలం కూడా అమ్మటానికి లేదని చెప్పిన సీఆర్‌డీఏ అధికారులు... ఏకంగా కొండ పోరంబోకు భూమినే విక్రయిస్తే కళ్లు మూసుకొని చూస్తున్నారా...అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మంత్రి అండతోనే....
రాష్ట్ర మంత్రి, సీఆర్‌డీఏ వైస్‌చైర్మన్ తనకు అత్యంత సన్నిహితులని ప్లాట్‌లు అన్నింటినీ గ్రామ కంఠంలో చేర్చి మినహాయిస్తామని హామీ ఇవ్వడంతోనే కొందరు స్థలాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అనధికార లేఅవుట్‌లు వేసి ప్లాట్‌లను విక్రయిస్తున్నా సీఆర్‌డీఏ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఎర్రబాలెం కొండకు అటవీశాఖ ఏర్పాటు చేసిన రక్షణగోడను ఆనుకుని ప్లాట్లు వేశారు. రక్షణ గోడ నుంచి అటవీశాఖ వదిలిన 50 అడుగుల భూమిని కలుపుకుని లేఅవుట్‌కు రోడ్‌గా ఏర్పాటు చేసినా అటు అటవీశాఖ గానీ ఇటు సీఆర్‌డీఏ, మరో వైపు రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఆర్‌డీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలతో పాటు ఒక్క అంగుళం భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న అధికారులకు అధికారపార్టీ నేతలు వేసిన అనధికారలేఅవట్ కనిపించడకపోవడం విశేషం. అనధికార లేఅవుట్, అటవీభూముల ఆక్రమణలపై సీఆర్‌డీఏ అధికారులతో పాటు రెవెన్యూ, అటవీశాఖ అధికారులను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు.