భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి
కమ్మవారిపాళెం గ్రామస్తుల ధర్నా
దుత్తలూరు: పశువులు, జీవాలకు వినియోగించే కంచె, మేత పోరంబోకు భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని దుత్తలూరు రెవెన్యూ పరిధిలోని కమ్మవారిపాళెం గ్రామస్తులు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కమ్మవారిపాళెం సమీపంలో గల సర్వే నంబర్లు 820, 821, 830-1, 830-2, 831 నుంచి 838 వరకు, 840 నుంచి 845 వరకు, 849-4, 851-2, 867-1, 867-2, 869, 870-3, 872-1, 872-2, 873, 874-1, 877, 878, 881-1, 882-2, 893, 894లో సుమారు 250 ఎకరాల భూములకు నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించి సాగు చేసుకుంటున్నారన్నారు. దీంతో పశువులు, జీవాలు మేతకోసం అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. గతంలో కొంతమంది రెవెన్యూ అధికారుల సహకారంతో కొంతమంది పట్టాలు సృష్టించుకున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల నుంచి ఈ పరిస్థితి నెలకొందన్నారు.
నాలుగేళ్ల క్రితం కమ్మవారిపాళెం, కట్టకిందపల్లి, కట్టకిందపల్లి హరిజనవాడ తదితర గ్రామాలకు చెందిన పశువులు మేతకోసం ఆయా పొలాలకు వెళ్లేవన్నారు. ప్రస్తుతం ఆక్రమణదారులు ఆ భూమలను ఆక్రమించుకుని కనీ సం పశువులు వెళ్లేందుకు దారి కూడా లేకుండా చేశారన్నారు. అరటి, జామాయిల్, పొగాకు తదితర పంటలు సాగు చేస్తూ ప్రతి ఏటా రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారన్నా రు.
ఆక్రమించి సాగు చేసుకోవడంతో పాటు అడంగల్‌లో సైతం పే ర్లు నమోదు చేసుకుం టున్నారన్నారు. గతం లో కొంతమంది అధికారుల దృష్టికి తీసికెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు నకిలీ పట్టాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యాలయానికి అడ్డంగా కూర్చొని రెవెన్యూ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ హనుమంతునాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు రంగయ్యనాయు డు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.