దేవుడి ఆస్తుల్నీ వదలా
రంగనాయకుల స్వామి దేవస్థానం స్థలం ఆక్రమణకు యత్నం
రూ.కోటి విలువ చేసేస్థలం స్వాహాకు రంగం సిద్ధం
పట్టించుకోని అధికారులు
ఉదయగిరి: ఉదయగిరిలో ఆక్రమణదారుల చేష్టలు పతాకస్థాయికి చేరాయి. ప్రభుత్వ స్థలం ఎక్కడ కనిపిస్తే అక్కడ దర్జాగా కబ్జా చేస్తున్నారు. కాలువలు, వాగులు, వంకలు, శ్మశానాలే కాకుండా వేటినైనా స్వాహా చేస్తున్నారు. చివరకు దేవుని స్థలాలు కూడా వదల్లేదు.
ఉదయగిరిలోని రంగనాయకుల స్వామికి చెందిన రూ.1 కోటి విలువచేసే సుమారు ఎకరా స్థలాన్ని స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆ స్థలాన్ని చదునుచేసి ఇళ్ల స్థలాలకు అమ్మేందుకు కొంతమేర ప్లాట్లుగా విభజించారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు తమకు ఏమీ తెలియదన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎండోమెంట్ అధికారులు తమ స్థలాలను రక్షించుకునే ప్రయత్నానికి ఉపక్రమించకపోవడంపై పట్టణవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.
ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కొలువై ఉన్న రంగనాయకుల స్వామి దేవాలయం వెనుకభాగాన సు మారు ఎకరా స్థలం ఉంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం అంకణం రూ.25 వేలు నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో విలువైన ఈ స్థలంపై కన్నేసిన ఓ వ్యక్తి మొత్తాన్ని కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ స్థలంలో ఉన్న కంపచెట్లు తొలగించి చదును చేశారు. అంతటితో ఆగకుండా ఈ స్థలంలో కొంతమేర ప్లాట్లుగా విభజించి అమ్మకానికి పెట్టారు. కొంతమంది స్థానికులు ఈ విషయమై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అలావచ్చి ఇలా వెళ్లిపోయారే తప్ప ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టలేదు.
విలువైన స్థలానికి ముప్పు
ప్రస్తుతం చదును చేసిన స్థలం 400 అంకణాల వరకు ఉంటుందని అంచనా. అంకణం రూ.25 వేలు చొప్పున విక్రయించినా రూ.1 కోటి పలుకుతుంది. ఇంత విలువైన స్థలాన్ని ఆక్రమించాలంటే దీని వెనుక ప్రభుత్వ అధికారుల హస్తం ఖచ్చితంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పేదలు నిలువ నీడలేక అంకణం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే కేసులు బనాయించే రెవెన్యూ అధికారులు ఇంత విలువైన స్థలం స్వాహా అవుతున్నా కిమ్మనకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ స్థలంలో కొంతమేర అమ్మకం జరిగినట్లుగా సమాచారం. కొన్న కొంతమంది వ్యక్తులు ఈ స్థలం దేవుడిదని తెలియడంతో అక్కడ కట్టడాలు నిర్మిస్తే ఇబ్బంది వస్తుందన్న భయంతో మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు స్పందించి ఆక్రమణకు గురవుతున్నా విలువైన ఈ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
మరికొన్నిచోట్ల ఆక్రమణలు
ఉదయగిరి పట్టణంలో టీడీపీ అధికారంలోకొచ్చిన తర్వాత ఆక్రమణల పర్వం రోజురోజుకూ మితిమీరుతోంది. కొంతమంది రెవెన్యూ అధికారులతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఉదయగిరి-నెల్లూరు రోడ్డు మార్గంలోని పర్యాటక భవనం ప్రాంతంలోని స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు అర కోటి విలువ గల ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదయగిరి-కావలి రోడ్డు మార్గంలో ఇప్పటికే లక్షల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కొంతమంది ఆక్రమించి బేసిమట్టాలు వేసి అమ్మేస్తున్నారు. ఉదయగిరి-నెల్లూరు మార్గంలోని బీసీ కాలనీ సమీపంలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొనివున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని గూడు లేని పేదలకు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.