⇒ సూత్రధారులు రెవెన్యూ అధికారులు
⇒ పాత్రధారులు తెలుగు తమ్ముళ్లు
⇒ యథేచ్ఛగా ఇళ్ల స్థలాల ఆక్రమణ
ఉదయగిరి: ఉదయగిరిలో యథేచ్ఛగా భూఆక్రమణలు, దందాలు సాగుతున్నాయి. దీనికి కొందరు రెవెన్యూ అధికారులు సూత్రధారులు కాగా తెలుగుతమ్ముళ్లు పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు రెవెన్యూ అధికారుల సహకారంతో అక్కడ కొందరు తెలుగుతమ్ముళ్లు పాగా వేసి ప్లాట్లు వేసి అమ్మకాలు సాగిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. దీంతో పేదలకు జానెడు స్థలం దొరకని దుస్థితి నెలకుంది. ఇంటి స్థలాల కోసం రెవెన్యూ అధికారులు చుట్టూ పేదలు తిరుగుతున్నా ఎలాంటి ఫలితం కానరావడం లేదు. సీఎంగా కిరణ్ ఉన్నప్పుడు సాగిస్తున్న ఈ దందా చంద్రబాబు వచ్చేసరికి తారాస్థాయికి చేరింది. తమకు అండగా నిలుస్తున్న అధికారులకు అక్రమార్కులు భారీగా ముడుపులు ముట్టచెబుతున్నారనే ప్రచారం బలంగా ఉంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాకమునుపు ఉదయగిరిలో ప్రభుత్వ భూములకు పెద్దగా విలువ లేదు. కనీసం ఇల్లు కట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపేవారు కాదు. ఉదయగిరి దుర్గాన్ని రాజులు ఏలిన ప్రాంతం కావడంతో ఇక్కడ ఇళ్ల స్థలాలకు పట్టాలు లేవు. కొందరు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. చాలా వరకు ప్రభుత్వ స్థలాలు అట్లే ఉండిపోయాయి. గత ఆరేడేళ్ల నుంచి ఉదయగిరి పట్టణం క్రమంగా అభివృద్ధి పథంలో పయనించడంతో చుట్టుపక్కల గ్రామీణులు ఇక్కడే ఇళ్లు కట్టుకోవడం ప్రారంభించారు. దీంతో ఇళ్ల స్థలాలకు డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు రాజకీయ అండదండలతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ప్లాట్లగా విభజించి అమ్మడం ప్రారంభించారు.
గతంలో తహశీల్దారుగా పనిచేసిన నారాయణమ్మ ఆక్రమిత స్థలాలను గుర్తించి ప్రభుత్వ స్వాధీనం చేసింది. రెండేళ్లుగా ఇక్కడికి వచ్చిన కొంతమంది తహశీల్దార్లు ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టారు. పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని రికార్డులు తారు మారు చేస్తూ ఆక్రమణదారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉదయగిరిలోని బీసీ కాలనీ సమీపంలో సర్వే నం.37లో అధికార పార్టీకి చెందిన ఓ నేత బంధువు వారం కొంత స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా చదును చేశాడు. దీనికి గిరాకీ అధికంగా ఉండటంతో కొంతమంది తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. తహశీల్దారు నామమాత్రంగా స్థల పరిశీలన చేసి మిన్నకుండిపోయారు.
అలాగే షబ్బీర్ కాలనీ ప్రాంతంలో ఇటీవల లేఔట్లు వేసిన కొంతమంది నేతలు పక్కనే ఉన్న శ్మశానాన్ని ఆక్రమించి ప్లాట్లు వేసుకునేందుకు కొంత చదును చేశారు. స్థానికులు అభ్యంతరం తెలపడంతో ప్రస్తుతానికి నిలిపివేశారు. ఉదయగిరి-కావలి రోడ్డు మార్గంలో సుమారు రూ.50 లక్షల విలువచేసే ఇళ్ల స్థలాలను కొంతమంది నేతలు ఆక్రమించి అమ్మేశారు. మరికొంత స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారు. టూరిజం బంగ్లా సమీపంలో గతంలో ఇచ్చిన ప్లాట్లను జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్ రద్దుచేసి దానిని టూరిజం కోసం ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా కొంతమంది అధికార పార్టీ నేతలు ఆ స్థలాన్ని ఖాళీ చేయకుండా వివిధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఎక్కువ ఖరీదు చేసే ఈ స్థలాలు కూడా అమ్మకాలు జరిగాయి.
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడ దర్జాగా ఇళ్లు వెలిశాయి. ఇక్కడే ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలాలను అధికార నేతలకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు అవగాహనకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు పెద్దమొత్తంలో చేతులు మారినట్టు విమర్శలున్నాయి. అలాగే మోడల్‌కాలనీ పేరుతో గతంలో ఉదయగిరికి చెందిన కొంతమంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా, ఇళ్లు కట్టుకోలేదన్న ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు వాటిని రద్దుచేశారు.
ఈ స్థలంలో కొంతమేర కొందరు ఆక్రమించుకొని ఫెన్సింగ్ వేసుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ఈ విధంగా ఉదయగిరి పట్టణంలోని ఇళ్ల మధ్య ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికావడంపై పట్టణవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి ఆక్రమణ స్థలాలపై సమగ్ర విచారణ జరిపితే కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారుల నుంచి విముక్తి అవుతాయని పట్టణవాసులు ఆశిస్తున్నారు.
అమ్మకానికి ఉదయగిరి
Published Mon, Dec 1 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement