సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న మావల చెరువు చుట్టూ ఆక్రమణలే. నిజాముల కాలం నాటి మావల చెరువు ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోతోంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువును ఆక్రమించి కొందరు పె(గ)ద్దలు అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. ఫంక్షన్‌హాల్స్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల అండదండలతో రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు ఊతమిచ్చారు. యథేచ్ఛగా సాగుతున్న ఆక్రమణలతో మావల చెరువు కబ్జాకు గురవుతుండగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువు ఏ మేరకు ఆక్రమణకు గురయ్యిందో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. రూ.10 కోట్ల విలువ చేసే భూములు ఇప్పటికే ఆక్రమణకు గురి కాగా, పదేళ్ల క్రితం ఆక్రమించి నిర్మించిన భవనాల బాగోతం సైతం బట్టబయలు అవుతోంది.
ఏళ్ల తరబడిగా ఆక్రమణలు
జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి-7ను ఆనుకుని ఉన్న మావల చెరువు 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. 131, 135 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 100 ఎకరాలు కాగా, 60 ఎకరాల విస్తీర్ణంలో చెరువు, 40 ఎకరాల్లో చెరువు శిఖం ఉంది. అయితే ఈ చెరువును అనుకొని ఫోర్‌లేన్ (నేషనల్ హైవే) పడటం తో చుట్టూ ఉన్న భూముల ధర అమాంతం గా పెరిగింది. దీంతో చెరువు శిఖంతోపాటు చెరువును ఆనుకొని ఉన్న పట్టా స్థలాలపై రాజకీయ పెద్దలు, భూమాఫియా గద్దల కన్ను పడింది. అధికారపక్షం, ప్రతిపక్షం తేడా లేకుండా అందరొక్కటై మావల చెరువును కలుపుకుని ఓ సర్వే నంబర్‌తో ‘బినామీ’ పట్టాదారున్ని సృష్టించి రూ.7 కోట్ల విలువ చేసే 9 ఎకరాల స్థలంలో పాగా వేశారు. తెరవెనుక ఓ రెవెన్యూశాఖ అధికారి, ఓ సర్వేయర్ కీలకం కాగా, రాజకీయ అండదండలతో జరిగిన ఈ ఆక్రమణ ఎవరికీ పట్టకపోవడం చర్చనీయాంశం అవుతోంది. అయితే వేసవికాలంలో చెరువులో నీటిమట్టం తగ్గిపోయి విస్తీర్ణం తక్కువగా కనిపించగా, జూలై 15 నుంచి కురిసిన వర్షాలతో మావల చెరువుకు జలకళ వచ్చింది. దీంతో 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో పూర్తిగా నీరు చేరింది. 40 ఎకరాల్లో ఉండాల్సిన చెరువు శిఖం నుంచి సగానికి పైగా ఆక్రమణకు గురి కాగా, పట్టా భూముల్లో కలుపుకొని చెరువు శిఖంలో నిర్మించిన భవనాలు దర్శనమిస్తున్నాయి.
కలెక్టర్ గారూ.. స్పందించండి..
మావల చెరువుతో పాటు ఆదిలాబాద్ చుట్టూ ఉన్న మావల, దస్నాపూర్, బట్టి సావర్‌గామ్, అనుకుంట, ఖానాపూర్ శివార్లలో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ, రెవెన్యూ, అటవీ, అసైన్డ్‌భూములు ఆక్రమణకు గురయ్యాయి. భూ ఆక్రమణలపై ఏడాది క్రితం పెద్ద ఎతున ప్రజాందోళనలు చోటు చేసుకోగా... అప్పటి కలెక్టర్ ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేశారు. అక్రమ లేఅవుట్లు, భూ ఆక్రమణలపై మొదట కొంత సీరియస్‌గానే వ్యవహరించినట్లు కనిపించినా... ఆ తర్వాత ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆక్రమణదారులపై చర్యలకు వెనుకంజ వేశారు. దీంతో భూ మాఫియా, ఆక్రమణదారులు రెచ్చిపోయి కనిపించిన సర్కారు స్థలాలను కబ్జా చేశారు. ఈ భూ బాగోతాల వెనుక గతంలో పనిచేసిన ఇద్దరు రెవెన్యూ అధికారుల పాత్రపై ప్రముఖంగా విమర్శలు వినిపిం చాయి.
అయిన్పటికీ ఫలితం లేకపోవడంతో ల్యాండ్ మాఫియా పడగ విప్పింది. ప్రభుత్వ, రెవెన్యూ, అసైన్డ్, చెరువుశిఖంలను ఆక్రమించిన అక్రమ కట్టడాలు చేపట్టడం వివాదాస్పదం అవుతోంది. జాతీయ రహదారిని అనుకుని ఉన్న అత్యంత ఖరీదైన మావల చెరువును అక్రమించిన గతంలో కట్టడాలు జరిపినా... ఇంకా ఆక్రమణలు జరుగుతున్నాయని తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. కలెక్టర్ స్పందించిన మావల చెరువు చుట్టూ సాగుతున్న ఆక్రమణలపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల కిందట ఆక్రమించి జరిపిన కట్టడాలపైనా విచారణ జరిపి... భవిష్యత్‌లో ఆక్రమణలకు తావు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.
సర్కారు జాగా.. వేసేయ్ పాగా!
Published Sat, Aug 24 2013 6:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement