- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తారా?
- అసలు ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు ఏముంది?
- టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదుపై తదుపరి చర్యలన్నీ నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల భూ ఆక్రమణలపై కథనాలు ప్రచురించినందుకు సాక్షి విలేకరులు, యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు, ఫిర్యాదుదారైన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తీరును న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. ఓ చర్చి ఆస్తులను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కాజేసిన వైనంపై సాక్షి దినపత్రిక గత నెల 6, 7 తేదీల్లో వరుస కథనాలు ప్రచురించింది.
అవి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వర్గపోరును ప్రోత్సహించేలా ఉన్నాయంటూ గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అరండల్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సాక్షి విలేకరులు, యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 153ఎ, 500, 501, 502, 505ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సాక్షి విలేకరులతో పాటు యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు చెల్లదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.శ్రీరామ్ స్పష్టం చేశారు. ప్రతిష్టకు భంగం వాటిల్లిందనుకున్నప్పుడు నిబంధనల ప్రకార ం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకూడదని, సంబంధిత మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు దాఖలు చేయాలని తెలి పారు. సాక్షి కథనాల వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు.
ఇది అధికార దుర్వినియోగమే..: ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఓ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఐపీసీ 153 కింద ఎలా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఆ కథనాలు వర్గపోరును ఎలా ప్రోత్సహిస్తున్నాయని నిలదీశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు మీడియాపై పరువు నష్టం కేసులు ఎలా దాఖలు చేస్తాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన విషయం గుర్తులేదా? అంటూ నిలదీశారు.
పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగిందని భావిస్తే, దానిపై ఫిర్యాదుకు ఓ నిర్దిష్ట విధానం ఉందని చెప్పారు. మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేయాల్సిన ఫిర్యాదును ఎమ్మెల్యే పోలీసులకు చేశారని, వారూ చట్టం నిర్దేశించిన విధానాన్ని పట్టించుకోకుండా కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించారు. పోలీసులు పరువు నష్టం కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఇది అధికార దుర్వినియోగం కిందకు రాదా? అనినిలదీశారు. అసలు ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఏముందని ప్రశ్నిస్తూ.. కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
‘సాక్షి’పై కేసులో హైకోర్టు స్టే
Published Tue, Sep 20 2016 12:59 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement