సాక్షి, సిటీబ్యూరో: అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ (ఆటా) ఆహ్వానం మేరకు ప్రముఖ నృత్య గురువు పద్మజారెడ్డి అమెరికాలోని హూస్టన్ నగరంలో ఈ నెల 29, 30, జులై –1 తేదీల్లో మూడు రోజుల పాటు నాట్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం పద్మజారెడ్డి లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. జీవిత సాఫల్య పురస్కారంతో తనను సత్కరించనున్నారని తెలిపారు.
తాను ప్రణవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యూచిపూడి డ్యాన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభవాన్ని కాకతీయం నృత్య రూపకం ద్వారా ప్రాచుర్యం కల్పించినందుకు ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారన్నారు. హూస్టన్ నగరంలో తమ మూడు రోజుల పర్యటనలో నవదుర్గలు నృత్య రూపకంతో పాటు.. కాకతీయం నృత్యంలోని కొన్ని భాగాలను ప్రదర్శిస్తామన్నారు. భద్రాచలం అర్చకులు సీతారామకల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. తాను శిష్య బృందంలోని ఆరుగురితో కలిసి సీతారామ కల్యాణానికి సంబంధించి అంశాలను నృత్యరూపంలో ప్రదర్శిస్తామని పద్మజారెడ్డి వివరించారు.
అంతేకాకుండా కెనడా, సింగపూర్, మలేషియా, సిడ్నీల్లో ఇదే రకంగా ప్రదర్శనలకు ఆహ్వానం వచ్చిందన్నారు. భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు మదన్ మోహనాచార్య మాట్లాడుతూ.. భద్రాది రామయ్య కల్యాణాన్ని అమెరికాలోని హూస్టన్‌లోని నగరంలో నిర్వహించేందుకు అనుమతించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, దేవాదాయ కమిషనర్ శివశంకర్‌లకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో నాట్య బృందంలోని నర్తకిలు అమరనేని షాలిని, ఆవుల భూమిక, కనక హర్షిణి, త్రిష, చందన, మ్రేనిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment