ఈ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కొనసాగిన ఆటా(అమెరికన్ తెలుగు అసోసియేషన్) సభలు అట్టహాసంగా జరిగాయి. రికార్డు స్థాయిలో దాదాపు 10,000 మంది ఆటా వేడుకలకు హాజరయ్యారని నిర్వహకులు ఓ ప్రకటనలో తెలిపారు. సంప్రదాయబద్దమైన తెలుగు కళలు, నృత్యాలు, ఆటపాటలతో కార్యక్రమం విజయవంతమైందని వివరించారు.
మొదటిరోజు జులై 1న ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రానర్ కార్యక్రమాన్ని ఆరంభించారని వెల్లడించారు. చివరి రోజైన జులై 3న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి చేతుల మీద కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఏ ప్రాంతంలో జీవిస్తున్నా.. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ.. పిల్లలకు తెలుగు భాష నేర్పించడం గొప్ప విషయమని అన్నారు.
ఉత్తర అమెరికాలో సగానికి పైగా విజయాలు సాధించిన వారందరూ ఇతర దేశాలకు చెందిన వారేనని అన్నారు. వారిలో సగం మంది తెలుగు వారేనని చెప్పారు. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ, వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరయ్యారు.