ఆటా వేడుకలు: ముచ్చటగా మూడు రోజులు సందడే సందడి | 17th ATA Convention: july1st to 3rd Grand Celebrations Here is the details | Sakshi
Sakshi News home page

ఆటా వేడుకలు: ముచ్చటగా మూడు రోజులు సందడే సందడి

Published Sat, Jun 25 2022 12:50 PM | Last Updated on Sat, Jun 25 2022 1:19 PM

17th ATA Convention: july1st to 3rd Grand Celebrations Here is the details - Sakshi

వాషింగ్టన్‌ డీసీ వేదికగా జరగబోతున్న 17వ అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌  మహాసభలు ఘనంగా జరగనున్నాయి.  ఈ మేరకు  తన వేడుకలకు రంగం చేసింది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఏ రోజు ప్రత్యేకత దానికే ఉంది. ఆ వివరాలు..

జులై 1 మొదటి రోజు
కన్వెన్షన్‌ సెంటర్‌లోని గ్రాండ్‌ లాబీలో వెల్‌కం రిసెప్షన్‌తో  వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గేయరచయిత  చంద్రబోస్‌ స్వరపరిచిన ప్రారంభోత్సవ గీతాన్ని గాయకులు కొమాండూరి రామాచారి ఆలపిస్తారు. అదే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన తెలుగు ప్రముఖులకు అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ అవార్డులందించనుంది. బాంకెట్‌ వేడుకల్లో సింగర్‌ రామ్‌ మిరియాల స్పెషల్‌ మ్యూజిక్‌ నైట్‌తో అలరించబోతున్నారు.

జులై 2 రెండో రోజు
ఉదయం నుంచే ఆటా పరేడ్‌ ప్రారంభం అవుతుంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ఇదే రోజు ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, యోగా గురు పద్మ విభూషణ్‌ సద్గురు జగ్గీ వాసుదేవన్‌ అతిథులతో మాట్లాడనున్నారు. అలాగే ఆటా కన్వెన్షన్‌లో భాగంగా హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ రామచంద్రమిషన్‌ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న రామచంద్రమిషన్‌ డైమండ్‌ జూబ్లీ సెలబ్రెషన్స్‌ నిర్వహిస్తారు. రెండో రోజు సాయంత్రం సంగీత దర్శకులు ఎస్‌.థమన్‌ నేతృత్వంలో విభావరి ఏర్పాటు చేశారు.

జులై 3 మూడో రోజు
ఉదయం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి కళ్యాణం నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి అమెరికా చేరుకున్నారు. శ్రీనివాసుడి కళ్యాణంలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు పద్మశ్రీ శోభారాజు, నిహాల్‌ కొండూరి ఆధ్యాత్మిక సంగీతంతో ఆహూతులను భక్తి పరవశ్యంలోకి తీసుకెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం గ్రాండ్‌ ఫినాలేలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇళయరాజా తన 32 మంది ట్రూప్‌తో అతిథులను అలరించనున్నారు.

దీంతో పాటు ఆహుతుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆటా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన అతిథులు.. ఎప్పటికీ మరిచిపోలేని విధంగా వేడుకలను డిజైన్‌ చేశారు. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, వివాహా వేదికలు, మాటా ముచ్చట్లు.. చెప్పుకుంటూ పోతే.. మూడు రోజులు వాషింగ్టన్‌ డిసిలో పండగ వాతావరణం ఏర్పాటు కానుంది.

ఆటా వేదికగా ఆట-పాట
భారతీయులకు క్రికెట్‌ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. అందుకే ఆటా నిర్వాహకులు ఇద్దరు లెజెండ్‌ క్రికెట్‌ క్రీడాకారులను ఈ కన్వెన్షన్‌కు తీసుకొస్తున్నారు. టాప్‌ క్లాస్‌తో సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడిన సునీల్‌ గవాస్కర్‌, సిక్సర్ల మెరుపులతో అలరించే వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌.. యూత్‌ క్రికెట్‌ సరదాగా ఆడబోతున్నారు. అలాగే మరో లెజెండరీ ఆటగాడు కపిల్‌ దేవ్‌ కూడా కనువిందు చేయబోతున్నాడు. ఆటా సెలబ్రిటీ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో భాగంగా కపిల్‌ దేవ్‌, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అమెరికన్‌ ప్రొఫెషనల్‌ గోల్ఫర్‌ సాహిత్‌ రెడ్డి తీగల ఆటా వేడుకల్లో సందడి చేయనున్నారు.

ఈ వేడుకలకు టాలీవుడ్‌ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేస్తున్నారు. హీరోలు అడవి శేషు, డైరెక్టర్లు శేఖర్‌ కమ్ముల, అర్జున్‌రెడ్డి ఫేం సందీప్‌ వంగా, హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నివేదా థామస్‌, డాన్స్‌ డైరెక్టర్‌ శేఖర్‌ మాస్టర్‌, వీజే సన్నీ, సింగర్‌ రాం మిరియాల, సింగర్‌ మంగ్లీ.. ఇంకా పలువురు ప్రముఖులు వేడుకలకు వస్తున్నారు. సాహితీ వేత్తలు జొన్నవిత్తుల రాంజోగయ్య శాస్త్రి, సీనియర్‌ నటులు తనికెళ్ల భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ అష్టవధానంతో అలరించబోతున్నారు. 

- వాషింగ్టన్‌ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement