సాక్షి, ముంబై: వడాలాలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ‘తెలుగు సాంస్కృతిక దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. గేయాలతోపాటు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు, నాటికలు, బుర్రకథను ప్రదర్శించడమేగాకుండా భాగవతంలోని పద్యాలను రాగయుక్తంగా పాడి ఆహూతులను కట్టిపడేశారు. నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పాశ్చాత్య సంస్కృతివైపు ఆకర్షితులవుతున్న నేటి తరానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మాతృభాష పట్ల మమకారం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు
. ఈ భాషలోని మాధుర్యాన్ని తరతరాలకు అందజేయాలన్న సంకల్పంతో తెలుగు సాహిత్యం లోని అనేక ప్రక్రియలను, బుర్రకథలను, పురాణ గాథలను వినిపిస్తున్నామన్నారు. కాగా విద్యార్థుల ప్రదర్శనలకు ముగ్ధులైన ఆంధ్రా ఎడ్యుకేషన్ అధ్యక్షులు స్వరూపరావు, కార్యదర్శి పీఎం రావు విద్యార్థులకు బహుమతులను అందజేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, అతిథులు, విద్యార్థులతోపాటు స్థానికులు కూడా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా తెలుగు సాంస్కృతిక దినోత్సవం
Published Fri, Nov 1 2013 12:06 AM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM
Advertisement
Advertisement