ప్రవాస లాస్యం
నేడు NRI డే
భారతీయులు ఇప్పుడు విశ్వమానవులు.
అనితరసాధ్య విజయాల చిరునామాలు. కలల
సాకారంలో భాగంగా దేశం మారినా తమదైన
‘కళల’ ప్రాకారాన్ని మాత్రం నిర్మిస్తూనే ఉన్నారు.
ఈ గడ్డమీద నివసిస్తున్న మనవారెందరో...
పొరుగింటి పుల్లకూర రుచికి మైమరచిపోతుంటే..
పొట్ట చేత్తో పట్టుకుని వెళ్లినవారు పొరుగింటికి మనింటి రుచుల కమ్మదనాన్ని చవిచూపుతున్నారు. మేరా భారత్ మహాన్ అని విదేశీయులతోనూ అనిపిస్తున్నారు. అలాంటి ఎన్నదగ్గ ఎన్నారైలకు ఉదాహరణ.. వీళ్లు.
..:: ఓ మధు
భరతభూమిలో గజ్జెకట్టిన ఎందరో.. ప్రవాసులైన తర్వాత కూడా సంప్రదాయ నృత్యాన్ని కొనసాగిస్తున్నారు. విదేశీయులకు భారతీయ లాస్య విన్యాసాన్ని చూపుతున్నారు. అంతేనా కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేకంగా మాతృభూమికి తరలి వచ్చి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇటీవల నగరంలో ఈ ఎన్నారై కుటుంబాలు తమ నృత్యప్రదర్శనతో సిటీవాసులను అలరించారు. ఈ ‘కళ్చ’రల్ అంబాసిడర్స్‌తో ముచ్చటించినప్పుడు...
పడమర వేదికపై..
‘మాది చెన్నై. చిన్నప్పుడు అడియార్ కె.లక్ష్మణ్, ప్రొఫెసర్ చిత్రా విశ్వేశ్వరణ్‌ల దగ్గర నృత్యం నేర్చుకున్నాను. మంచి డ్యాన్సర్‌ని అవుదామనుకున్నాను. పెళ్లయ్యాక మన అభిరుచిని కంటిన్యూ చేయడం కష్టమే. అయినా ఆసక్తి పరిస్థితులను మనకు అనుకూలంగా మారుస్తుంది. పెళ్లి తర్వాత న్యూజెర్సీకి వెళ్లాక ఇక నా చిన్ననాటి ‘కళ’కు నీళ్లొదలాల్సిందే అనుకున్నా. కాని అనుకోకుండా అక్కడ కొంతమందిలో భారతీయ నృత్యాలపై చాలా ఆసక్తి ఉందని గమనించాను. వాళ్లకి నేర్పడం ద్వారా నేను కోల్పోతున్నదేదో భర్తీ అవుతుందనిపించింది. అలా మొదలై పాతికేళ్లుగా... 300కి పైగా స్టూడెంట్స్‌కు నేర్పించాను.
మంచి శిక్షకురాలిగా పేరు తెచ్చుకున్నాను. నిజం చెప్పాలంటే.. అక్కడ మన కళలకు లభిస్తున్న గౌరవం చూస్తే.. ఇంత గొప్ప వారసత్వాన్ని అందించిన భారతమాతకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. అందుకే ఏటా ఇక్కడికి వచ్చి తప్పకుండా ప్రదర్శనలిస్తాను. డ్యాన్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాను. నా స్టూడెంట్స్‌తో ఇక్కడ అరంగేట్రం చేయిస్తుంటాను.
మా అబ్బాయికి కూడా నృత్యం నేర్పించా. 2012లో తను చెన్నైలో అరంగేట్రం చేశాడు. నేను నేర్పిన వారితో కలసి వేదిక మీద నృత్యం చేయడం కొత్త అనుభూతి. నా కొడుకుతో కలిసి చేయడం మరింత విచిత్రమైన అనుభూతి’ అని వివరించారు రమ్య రామ్‌నారాయణ్.
నృత్యమే భవిష్యత్తు...
చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ నృత్యం చూస్తూ పెరిగాను. అమ్మ ఎందరికో నేర్పిస్తుండటం చూసి నాకు నేర్చుకోవాలనిపించింది. భావం, భాషా అన్నీ అమ్మ వివరంగా చెప్పేది. కళ అంటే కేవలం కాళ్లు చేతుల కదలిక మాత్రమే కాదనీ అందులో ఎన్నో అద్భుతమైన అర్థాలున్నాయని తెలిసింది. దాంతో మనదైన కళ మీద మరింత ఇష్టం పెరిగింది. అందుకే నేర్చుకునేటప్పుడు ఎక్కువగా కష్టం అనిపించలేదు. కేవలం నృత్యమే కాకుండా ట్రంపెట్ వాయించడం కూడా నేర్చుకున్నాను.
ఇక్కడైనా, ఎక్కడైనా మనం ఏదైనా నేర్చుకోవాలంటే టైం సరిపోదు, టైం లేదు అని ఏం ఉండదు. పొద్దున్నే స్కూల్‌కి వెళ్తాను. వచ్చాక నాకు నచ్చిన ఆసక్తి ఉన్న పని చేస్తాను. కొంచెం క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే ఎవరైనా వారికి ఆసక్తి వున్న కళను ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నేర్చుకోవచ్చు. అదృష్టవశాత్తూ నేను మా అమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకుంటాను. భవిష్యత్తులోనూ డాన్స్ టీచర్‌గానే కొనసాగాలని అనుకుంటున్నాను’ అని చెబుతారు రంగరాజ్ తిరుమలై.
నృత్యమే పండుగ..
మాది సికింద్రాబాద్. పెళ్లి కాకముందు శోభనాయుడు గారి దగ్గర కూచిపూడి శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నుంచి నాట్యవిశారద కోర్స్ పూర్తి చేశాను. పెళ్లయిన తర్వాత 1991లో యూఎస్‌కి వెళ్లాను. కళాకారిణిగానే ఉండాలనుకున్నాను. ఆ సమయంలో అక్కడ ప్రదర్శనలకు అవకాశాలు తక్కువ. నాట్యాన్ని కొనసాగించడానికి వీకెండ్ స్కూల్స్‌లో కూచిపూడి టీచర్‌గా ఐదేళ్లు పనిచేశాను. పిల్లలు పుట్టాక కూడా ఎప్పుడూ బ్రేక్ ఇవ్వలేదు. భర్త ప్రోద్బలంతో 1996లో కూచిపూడి డాన్స్ అకాడమీని మేం ఉండే మేరీల్యాండ్‌లో ప్రారంభించాం. ఇప్పుడు 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇతర నృత్య శైలులకు చెందిన టీచర్స్ అందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడి చాలా డాన్స్ ఫెస్టివల్స్ నిర్వహించాం. ఇండియాలో ఆసక్తి ఉన్న వారు మాత్రమే కళలు నేర్చుకుంటారు. కానీ యుఎస్‌లో కల్చర్‌ని కాపాడటం అనేది ఒక అవసరం. పిల్లలు భారతీయుల్లా పెరగాలంటే కల్చర్ గురించి, కళల గురించి తెలియాల్సిందే.
- లక్ష్మీబాబు, మేరీల్యాండ్, యూఎస్
నాకు స్ఫూర్తి మా అమ్మ
పిట్స్‌బర్గ్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను. మా కాలేజీల్లో ఇండియన్ డ్యాన్స్ టీమ్స్ ఉంటాయి. క్లాసికల్, ఫ్యూజన్, బాంద్రా, దాండియా గ్రూప్స్ ఉంటాయి. వాటికి కాంపిటీషన్స్ చాలా టఫ్‌గా నిర్వహిస్తారు. కాలేజ్‌లో ఆడిషన్స్ ద్వారా 10 మందిని సెలెక్ట్ చేస్తారు. మా కాలేజ్ క్లాసికల్ డ్యాన్స్ టీమ్‌కి నేనే కెప్టెన్. విదేశాల్లో మనదైన కళలకు ఆదరణ పెంచడం అనేది ఒక బాధ్యతగా అనిపిస్తుంది. అమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్నాను.
- శ్రీయ బాబు, లక్ష్మీబాబు కూతురు
నాట్యం ఒక భాగం..
నాట్యం మా జీవనశైలిలో ఒక భాగం. ఊహ తెలిసిన దగ్గర్నుంచి మా చుట్టూ డ్యాన్స్, స్టూడెంట్స్, క్లాసెస్, డ్యాన్స్‌షోలే ఉండేవి. అంత గొప్ప సంస్కృతి, సందడిని చూశాక, డ్యాన్స్ తప్ప వేరే ఎంచుకోవాలనే ఆలోచన కూడా లేదు. నృత్య సాధన ఇండియాలోనే చేయాలని ఆశిస్తున్నాను
- స్నేహ బాబు, లక్ష్మీబాబు కూతురు