సొగసు చూడ తరమా..!
కళ
అది కూచిపూడి నృత్యాలు జరిగే వేదిక. వ్యాఖ్యాత వచ్చి ‘‘ఇప్పుడు ఓ చిన్నారి భామాకలాపం ప్రదర్శిస్తుంది’’ అని చెప్పారు. ఓ పదమూడేళ్ల చిన్నారి వచ్చి సత్యభామలా సొగసులు పోతూ... తన నృత్యాభినయంతో ప్రేక్షకుల మదిని దోచింది. ప్రేక్షకులు పులకించిపోయారు. వ్యాఖ్యాత తిరిగి వేదికపైకి వచ్చి... ఇప్పటి వరకు మీ ముందు నృత్యం చేసిన చిన్నారి బాలిక కాదు బాలుడని చెప్పారు. అంతే... సభాసదులందరూ నిశ్చేష్టులయ్యారు. నాటి నుంచి నేటి వరకూ అలా ఎందరినో అబ్బురపరుస్తూనే ఉన్నాడు... నెల్లూరు, రంగనాయకులపేటకు చెందిన విక్రమ్.
విక్రమ్ పసితనంలోనే బుల్లితెరలో వచ్చే పాటలకు తగ్గట్లుగా పాదాలు కదపడాన్ని గమనించిన తల్లిదండ్రులు ముత్యాల మధురజని, రవికుమార్... అతనికి నృత్యంలో శిక్షణ ఇప్పించారు. శిక్షణాలయంలో చేరిన ఆరు నెలలకే వేదికలపై ప్రదర్శన ప్రారంభించిన విక్రమ్... ఇప్పటి వరకు వందల ప్రదర్శనలిచ్చాడు.
చీరచుట్టి, గజ్జెకట్టి విక్రమ్ అచ్చమైన స్త్రీమూర్తిలా వేదిక మీద ఆడుతుంటే... చూసినవాళ్లంతా సొగసు చూడతరమా అంటూ మైమరచిపోతారు. ఓసారి అలా ప్రదర్శన ఇస్తున్నప్పుడు చూసిన అతడి అమ్మమ్మ, తాతయ్యలు... తమకు మనవరాలు లేని లోటును విక్రమ్‌తోనే ఎందుకు తీర్చుకోకూడదు అనుకున్నారు. అందుకే పనిగట్టుకుని స్త్రీ వేషంలో వివిధ పాత్రల కోసం శిక్షణ ఇప్పించారు. నాటి నుంచి నేటి వరకూ విక్రమ్ స్త్రీ పాత్రల్లో అలరిస్తూనే ఉన్నాడు. తారంగం, భామనే సత్యభామనే, భామాకలాపం, జతీస్వరం, బ్రహ్మాంజలి, సప్తపది, కృష్ణశబ్దం, శివపాదం, మంజీరనాదం తదితర నృత్యాలను ఇతర రాష్ట్రాల్లోనూ ప్రదర్శించి మన్ననలందుకున్నాడు విక్రమ్.
‘కాంచన’ సినిమాలోని ఓ పాటలో కూడా నర్తించాడు. అయితే కేవలం స్త్రీవేషంలో మాత్రమే నర్తించడు విక్రమ్. అబ్బాయి వేషంలో కూడా అదరగొట్టేస్తాడు. ఇతని ప్రతిభ చూసి ‘షిరిడీ జైసాయిరాం’ చిత్రంలో ఓ నృత్యప్రదర్శనకు చాన్స్ ఇచ్చారు. అదే విధంగా పలు చిత్రాలలోనూ నటించే అవకాశాలు దగ్గరకు వచ్చాయి.