15న విశాఖలో ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవం
- మంత్రి గంటా వెల్లడి
- మంజుభార్గవి పర్యవేక్షణలో కూచిపూడి నాట్య ప్రదర్శనలు
విశాఖపట్నం-కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్‌లో అక్టోబర్ 15న భారీస్థాయిలో రాష్ట్రస్థాయి ఉత్సవాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ (ఎన్‌ఎండీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాల ‘ఏపీ బ్రాండ్ కూచిపూడి-2014’ పోస్టర్‌ను మంత్రి తన కార్యాలయంలో గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవ సందర్భంగా 15న సాయంత్రం ఏపీ పర్యాటక రంగానికి తలమానికంగా భాసిల్లే రామకృష్ణా బీచ్‌లో 30 అడుగుల ఎత్తై కూచిపూడి నాట్య చిహ్నం (సత్యభామ జడ) సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పా రు. కాళీమాత ఆలయం ఎదుట ఏర్పాటు చేసే వేదికపై సుప్రసిద్ధ కూచిపూడి నర్తకీమణి ‘శంకరాభరణం’ఫేం మంజుభార్గవి పర్యవేక్షణలో 2 గంటలపాటు నాట్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు గంటా వెల్లడించారు.
11,12 తేదీల్లో పోటీలు
భారతీయ సంప్రదాయ కళలపై విద్యార్థులకు అవగాహన పెం పొందించేందుకు పలు రంగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఏపీ బ్రాండ్ కూచిపూడి అనే ఇతివృత్తంపై చిత్రలేఖనం, వక్తృత్వం, వ్యాసరచన, జామ్ పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ ఛాయా చిత్రనిపుణుడు దివాకర్ శ్రీనివాస్ కాళీమాత ఆలయ ప్రాంగణంలో పలు భారతీయ నృత్య రీతుల ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.
కార్యక్రమంలో జాలాది చారిట బుల్ ట్రస్టు వ్యవస్థాపక కార్యదర్శి జాలాది విజయ, ఆడిటర్ వెలుగుల శ్రీధర్ డాక్టర్ శ్రీధర్ బిత్ర, వైశాఖిజల ఉద్యానవన డైరక్టర్ చింతపూడి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.