బెజవాడకే జై | Vijayawada set to regain pre-eminence as Andhra Pradesh's capital | Sakshi
Sakshi News home page

బెజవాడకే జై

Published Fri, Sep 5 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

బెజవాడకే జై

బెజవాడకే జై

  •    రాజధానితో జిల్లాకు మహర్ధశ
  •     అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం
  •   బందరు పోర్టు అభివృద్ధి
  •   పరిసరాల్లోనే సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు
  •   మెగాసిటీ ఉడా పరిధి లాజిస్టిక్ హబ్‌గా జిల్లా
  •   కూచిపూడిలో నాట్య అకాడమీ
  •  దివిసీమలో మిస్సైల్ పార్కు
  • సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక కళలకు పుట్టినిల్లుగా పేరొందిన ‘విజయవాడ’ సిగలో రాజధాని అనే మరో కలికితురాయి వచ్చి చేరడంతో ఈ ప్రాంతానికి  ‘రాజ’యోగం పట్టనుంది. మేధావులు, రాజకీయ విశ్లేషకులు, వ్యాపారులు తదితర ప్రముఖులు భావించినట్లుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం శాసనసభలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని అని ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

    ప్రధానంగా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరిలను కలుపుతూ ఏర్పడిన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి కూడా మహర్దశ పట్టనుంది. సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో పెద్ద మెగాసిటీ రూపుదిద్దుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే.. నగరం చుట్టుపక్కలే సెక్రటేరియట్, అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.
     
    తమ్ముళ్లు, రియల్టర్లలో ఉత్సాహం
     
    అసెంబ్లీలో విజయవాడ పరిసరాలను రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన వెంటనే నగరంలో తమ్ముళ్లు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అలాగే, పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘పార్టీ’లు చేసుకున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసేందుకు సిద్ధమయ్యారు. నగర పరిసరాల్లోనే రాజధాని ఉంటుందని చెప్పడంతో వారిలో చెప్పలేని ఆనందం కనిపించింది. ఇప్పటివరకు అమ్ముడుపోని కొన్ని ప్లాట్లు ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయనే ఆనందంలో వారున్నారు. మరోవైపు.. మధ్యతరగతి వారు, సామాన్యులు మాత్రం ఇకపై మా బతుకు భారమేనంటున్నారు.
     
     జిల్లాకు ఇచ్చిన హామీలు
     గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా మార్చడం
     
     బందరు పోర్టును మరింత అభివృద్ధి చేసి వ్యాపారాభివృద్ధి కేంద్రంగా తయారుచేయడం, ఆక్వా కల్చర్ అభివృద్ధి, ప్రాసెసింగ్ యూనిట్, ఆయిల్ రీఫైనరీ, క్రాకర్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం
     
     వీజీటీఎం ఉడా ప్రాంతాన్ని మెగా సిటీగా రూపొందించడం
     
     విజయవాడలో టెక్స్‌టైల్ పార్క్, టూరిజం సర్క్యూట్, భవానీ ద్వీపం అభివృద్ధి, స్మార్ట్ సిటీల ఏర్పాటు, ఆటోమొబైల్ హబ్.. ఫుడ్ పార్క్ యూనిట్, ఐటీ హబ్ ఏర్పాటు
     
     అవనిగడ్డలో మిస్సైల్ పార్క్..
     
     జిల్లాను లాజిస్టిక్ హబ్‌గా రూపొందించడం
     
     కూచిపూడిలో కూచిపూడి అకాడమీ ఏర్పాటు
     
     ఇదిలా ఉంటే... విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారే కానీ ఖచ్చితమైన ఏరియాను ప్రకటించకపోవడంతో స్థానికుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. అలాగే,  సీఎం చేసిన ప్రకటనలు ఎంతవరకు, ఎప్పటిలోపు అమలవుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ సకాలంలో అమలుచేస్తే మంచి అభివృద్ధిని సాధించినట్లుగా భావించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement