పర్యాటక శోభ | Tourism Charm | Sakshi
Sakshi News home page

పర్యాటక శోభ

Published Thu, Sep 18 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

పర్యాటక శోభ

పర్యాటక శోభ

  • ఆదాయం పెంపునకు మార్గాల అన్వేషణ
  •  కొత్త ప్రాజెక్టులకు ఆలోచన
  •  టూర్ ప్యాకేజీల రూపకల్పన
  • సాక్షి, విజయవాడ :  కొత్త రాష్ట్రానికి విజయవాడ రాజధాని కావడంతో ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు తరలివస్తే వాటిలో పనిచేసే ఉద్యోగులూ ఇక్కడకు వచ్చేస్తారని, దీంతో వివిధ పనుల కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని, తద్వారా పర్యాటక రంగానికి డిమాండ్ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక టించడంతో ప్రణాళికల తయారీ మరింత వేగవంతమైంది.

    జిల్లా చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను కలిపి ఒక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొండపల్లి ఖిల్లా, కూచిపూడి నృత్య ప్రదర్శనశాల, మంగినపూడి బీచ్, పెడన చేనేత వస్త్రాలు తదితర సందర్శనీయ ప్రదేశాలను కలిపి సర్క్యూట్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులు నగరంలో ఒక్కరోజు ఉండాల్సి వస్తే వారు జిల్లాలో ముఖ్యమైన కేంద్రాలను చూసే విధంగా టూర్ ప్యాకేజీ సిద్ధం చేస్తున్నారు.
     
    కొండపల్లి బొమ్మ... కూచిపూడి నృత్యం...

    కొండపల్లి బొమ్మల తయారీపై పర్యాటకులకు చక్కటి అవగాహన కల్పించడంతో పాటు వారు షాపింగ్ చేసుకునే విధంగా షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీనికిగాను మంజూరైన రూ.1.25 కోట్ల నిధులతో కొండపల్లి ఖిల్లాపై మౌలిక సదుపాయాలు కూడా కల్పించనున్నారు. కూచిపూడి గ్రామంలోనూ మౌలిక సదుపాయాలు పెంచి అక్కడ కళాకారులతో నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ అధికారులు యోచిస్తున్నారు.
     
    కొత్త బస్సుల కోసం ప్రతిపాదనలు

    టూర్ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులను తీసుకెళ్లేందుకు ప్రస్తుతం విజయవాడలో ఒక్క బస్సు మాత్రమే ఉంది. అదనంగా మరో నాలుగు బస్సులు కావాలంటూ పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అవి వస్తే విజయవాడ కేంద్రంగా సూర్యలంక, తిరుపతి, అరకు, మంత్రాలయం, కర్నూలు, కడప తదితర ప్రాంతాలకు ప్యాకేజీలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. వారాంతంలో రెండేసి రోజుల  చొప్పున ప్యాకేజీ టూర్‌లు ఏర్పాటు చేస్తే డిమాండ్ బాగుంటుందని అంచనాలు వేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా ఈ ప్రాజెక్టులను సిద్ధం చేస్తే చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఉపయోగించుకుంటారని యోచిస్తున్నారు.
     
    స్పందన నామమాత్రమే..

    ప్రస్తుతం ఉన్న బస్సు జూలైలో వచ్చింది. ఇది విజయవాడ-గుంటూరు మధ్య ముఖ్యమైన ప్రదేశాలను చూపిస్తోంది. 18 సీట్లు ఉన్న ఈ బస్సులో వారాంతంలో పది పన్నెండుమంది, సాధారణ రోజుల్లో ఐదుగురు చొప్పున మాత్రమే ప్రయాణిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రదేశాల కంటే సూర్యలంక బీచ్ చూపిస్తే బాగుంటుందని పలువురు ప్రయాణికులు సూచించినట్లు తెలిసింది. ఈ బస్సుకు డిమాండ్ పెంచేందుకు బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులను కలిసి.. వారిని వినియోగించుకోవాలంటూ ఏపీటీడీసీ అధికారులు కోరుతున్నారు.  ఇప్పటి వరకు రూ.66 వేల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
     
    27 నుంచి పర్యాటక దినోత్సవాలు

    రాష్ట్రం విడిపోయిన తరువాత తొలిసారిగా పర్యాటక దినోత్సవం ఈ నెల 27న జరగనుంది. 27 నుంచి 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా భవానీ ద్వీపం, బెర్హం పార్కులలో వివిధ రకాల చేనేత కళాకారులతో దుకాణాలు, వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా కొత్త ప్యాకేజీలను ప్రకటించాలని ఏపీటీడీసీ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.  

    విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రయాణికులను తీసుకువెళ్లి స్వామి దర్శనంతో పాటు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూపించి తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇదే తరహాలో మరికొన్ని ప్యాకేజీలు కూడా రానున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement