- విజయవాడకు రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు ఉడా కసరత్తు
- రహదారులకు అనుసంధానంగా లింకు రోడ్లకు ప్రతిపాదనలు
సాక్షి, విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని విజయవాడకు రోడ్ కనెక్టివిటీని మరింత పెంచేందుకు, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు వీజీటీఎం ఉడా కసరత్తు చేస్తోంది. నగరానికి అనుసంధానంగా ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులను విస్తరిం చేందుకు, కొన్ని నూతన రోడ్లను నిర్మించేందుకు సమగ్ర అధ్యయనం చేసింది. ఈ మేరకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉడా పరిధిలోని 12 రోడ్లును అభివృద్ధి చేసేందుకు రూ.180 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి పంపారు. కృష్ణా జిల్లాలో ఆరు రహదారులకు అనుసంధానంగా లింకు రోడ్లు, గుంటూరు జిల్లాలో ఆరు రహదారులకు అనుసంధానంగా మరో ఆరు లింకు రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
జిల్లా పరిధిలో లింకు రోడ్ల ప్రతిపాదనలు
కృష్ణా నది కరకట్ట ప్రాంతం నుంచి పెదపులిపాక మీదుగా తాడిగడప వద్ద ఉన్న బందరు రోడ్డు వరకు 3.5 కిలో మీటర్ల పొడవునా 100 అడుగుల లింకు రోడ్డు నిర్మించాలి. దీనికి రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే బెంజ్‌సర్కిల్ నుంచి తాడిగడప వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గిపోతుంది. వంద అడుగుల రోడ్డు కావడంతో జాతీయ రహదారి మీదుగా నగరంలోకి వచ్చే వాహనాలను లింకు రోడ్డు మీదుగా మళ్లించవచ్చు.
ఏలూరురోడ్డులోని ఏనికేపాడు నుంచి కృష్ణా పశ్చిమ బైపాస్‌ను ముస్తాబాద మీదుగా సూరంపల్లి వరకు 9 కిలోమీటర్ల మేర 100 అడుగుల రహదారి నిర్మించాలి. ఇందుకోసం రూ.65 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ రోడ్డు నిర్మిస్తే నూజివీడుకు రాకపోకలు మరింత సులభతరమవుతాయి. నూజివీడు రోడ్డులో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.
తొమ్మిదో నంబరు జాతీయ రహదారి సమీపంలోని గొల్లపూడి నుంచి జక్కంపూడి క్రాసింగ్ సమీపంలోని కేటీ రోడ్డు వరకు 80 అడుగుల విస్తీర్ణంతో 7.5 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మించాలి. దీనికి రూ.31 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ రోడ్డు నిర్మిస్తే తొమ్మిదో నంబరు జాతీయ రహదారిపై ప్రతిపాదనల్లో ఉన్న కృష్ణా పశ్చిమ బైపాస్‌లో కలుస్తుంది. అందువల్ల ట్రాఫిక్ సమస్య బాగా తగ్గుతుంది.
బందరురోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆటోనగర్ వరకు ఉన్న పంటకాలువ రోడ్డును పీబీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల వెనుక వెపు నుంచి పోరంకి వరకు 60 అడుగుల రోడ్డుగా 4 కిలోమీటర్ల మేర పొడిగించాలి. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇది బందరు రోడ్డుకు ప్రత్నామ్నాయంగా ఉపయోగపడుతుంది.
కొత్తూరు తాడేపల్లి నుంచి కౌలూరు మీదుగా కొండపల్లి వరకు 7.5 కిలో మీటర్లు పొడవునా 80 అడుగుల రోడ్డు నిర్మించాలి. దీనికి రూ.30 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ రోడ్డు నిర్మిస్తే అనేక గ్రామాల మధ్య రాకపోకలు సులభతరమవుతాయి.
గుడివాడ పరిధిలో బైపాస్ రోడ్డును ఐదు కిలో మీటర్ల మేర 60 అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలి. రూ.20కోట్లు ఖర్చు అంచానా.