- సీఆర్‌డీఏ బిల్లు ముసాయిదాలో వెల్లడించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించే భూముల్లో 50 శాతం మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్టు ఏపీ కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) బిల్లు-2014 ముసాయిదాలో ప్రభుత్వం పేర్కొంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అయిన ఖర్చు నిమిత్తం మిగతా భూమిలో కొంత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవన్నీ పోను మిగిలిన భూమిని రైతులకు ప్లాట్లు లేదా భూమి రూపంలో ఇవ్వనున్నట్లు బిల్లులోని 29వ సెక్షన్లో పేర్కొన్నారు.
అథారిటీ సొంతంగా లేదా భూమి యజమానులు దరఖాస్తు ద్వారా లేదా అభివృద్ధి చేసే ఏజెన్సీ ద్వారా ల్యాండ్ పూలింగ్ ప్రాంతాన్ని గుర్తిస్తారు. ల్యాండ్ పూలింగ్ ప్రాంతాన్ని అథారిటీ ప్రకటించిన తరువాత పదిహేను రోజుల్లో భూమి యజమానుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానిస్తారు. ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలి. అనంతరం ల్యాండ్ పూలింగ్ పథకాన్ని ప్రజలకు, భూ యజమానులకు సమాచారం ఉండే తరహాలో అథారిటీ నోటిఫై చేయాలి.
ల్యాండ్ పూలింగ్ పథకం తుది నోటిఫికేషన్ ప్రకటించిన తరువాత నిర్ధారించిన సమయంలోగా ప్రతి భూమి యజమానికి ల్యాండ్ పూలింగ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌ను అథారిటీ జారీ చేయాల్సి ఉంటుందని ఆ ముసాయిదాలో పేర్కొన్నారు.
ఈ సర్టిఫికెట్‌లో వాస్తవంగా భూమి ఎక్కడ ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్‌లో ఇస్తున్న ప్లాటు లేదా భూమి ఎక్కడ అనేది స్కెచ్‌తో సహా పేర్కొంటారు. ఆ ప్లాటు లేదా భూమిని ఆ యజమానులు రిజస్ట్రేషన్ చట్టం 1980 ప్రకారం మరొకరికి బదిలీ చేసే హక్కును కల్పించారు. ల్యాండ్ పూలింగ్ విధానం అథారిటీకి, భూమి యజమానులకు ఆమోదయోగ్యంగా ఉంటుందని బిల్లులో తెలిపారు.