- రైతుల వాటా భూములు విక్రయిస్తే క్యాపిటల్ గెయిన్ టాక్స్
- రియల్ లావాదేవీలుగా పరిగణిస్తే ఆదాయ పన్ను తప్పనిసరి
- భూమి విలువలో 20.6 శాతం టాక్స్ చెల్లించాలి
సాక్షి, విజయవాడ : రాజధాని పేరుతో కల్లబొల్లి కబుర్లు చెప్పి పచ్చని పొలాలు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న పాలకులు... ఆ తర్వాత రైతులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాత్రం ఎక్కడా చర్చించడంలేదు. ల్యాండ్ పూలింగ్ పేరుతో సమీకరించిన భూమిని అభివృద్ధి చేసి కొంతభాగం ఇస్తామని.. ఆ భూమి విలువ కోట్లకు చేరుతుందని రైతులకు ఆశలు కల్పిస్తున్నారు. కానీ, లాండ్ పూలింగ్ ద్వారా తమకు లభించిన భూమిని విక్రయించే సమయంలో రైతులకు వచ్చే చిక్కుల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు.
నమ్మి భూములిచ్చే రైతన్నలకు పన్ను పోటు తప్పదనే చేదునిజాన్ని మాత్రం దాచేస్తున్నారు. ఆదాయపన్ను చట్టం సెక్షన్ (10) ప్రకారం రాజధానికి భూములు ఇచ్చే రైతులకు వచ్చిన ఆదాయంలో ఏకంగా 20.6 శాతం పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. భూ సేకరణ అనంతరం రైతులకు వచ్చే ప్రతి వెయ్యి గజాల భూమి విలువ ఆధారంగా పన్ను (దానిని విక్రయించే సమయంలో) చెల్లించాల్సి ఉంటుంది.
అంతా పూలింగ్ మాయ...
ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి తమ భూమి ఇచ్చి.. దాని బదులు అభివృద్ధి చేసిన కొంత భూమి పొందనున్న రైతులు పరోక్షంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు నిర్వహించినట్టే. ఆ తర్వాత ఆ భూమిని రైతులు ఎవరికైనా విక్రయించినా.. లేదా వారసుల పేరుతో బదలాయించినా పన్ను చెల్లించాల్సిందే. ఈ విషయాన్ని ఆదాయ పన్ను చట్టం సెక్షన్(10) స్పష్టంగా చెబుతోంది.
నూతన రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తుళ్లూరు మండలంలోని 14 గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామాల్లో కలిపి 30వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించి మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
రెండోదశలో మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని ప్రాంతంలోని భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ పరిహార ప్యాకేజీ కూడా ప్రకటించింది.
ల్యాండ్ పూలింగ్‌లో సేకరించే ప్రతి ఎకరా భూమికి బదులు సంబంధిత భూ యజమానికి 1,000 చదరపు గజాల స్థలంతోపాటు మొదటి సంవత్సరం పంట నష్టపరిహారం కింద రూ.25వేలు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం రూ.1,250 పెంచుతూ పరిహారం ఇస్తామని ప్రకటించారు. కానీ, సేకరించే భూమికి ఎంత నష్టపరిహారం ఇస్తారనేది ప్రకటించలేదు. ఇప్పటికే తుళ్లూరు మండలంలో భూసేకరణ కోసం అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. భూమిని తీసుకుని ఇచ్చిన పరిహారం ఆ భూమి విలువను బట్టి రైతులు టాక్స్ చెల్లించాలని ఆదాయ పన్ను చట్టం చెబుతోంది. అంటే ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే భూమి విలువలు మళ్లీ ప్రత్యక్షంగా ప్రభుత్వానికి ఆదాయ రూపంలో 20.6 శాతం డబ్బు రానుంది.
క్యాపిటల్ గెయిన్‌గా పరిగణింపు
క్యాపిటల్ గెయిన్ అంటే పెట్టుబడిపై వచ్చే ఆదాయం. దీనికి తప్పనిసరిగా టాక్స్ చెల్లించాలి. రైతులకు ప్రభుత్వం ఇచ్చే వెయ్యి గజాల భూమిని రైతులు వేరొకరికి విక్రయిస్తే ఆదాయపన్ను చట్టం సెక్షన్ (10) ప్రకారం 20.6 శాతం పన్ను చెల్లించాలి. అది కూడా రైతే చెల్లించాలి. ఈ లావాదేవీలన్నీ వైట్ మనీతో జరిగేవి కాబట్టి లెక్క పక్కాగా ఉండాలి. ధర ఎలా నిర్ణయిస్తారంటే రైతు మొదట ఆ భూమిని ఎంత ధరకు కొనుగోలు చేశాడు. కొనుగోలు విలువకు ఏడాదికి 5 నుంచి 9 శాతం వరకు విలువను పెంచుతారు. అలాగే, విక్రయించే నాటికి, లేదా ప్రభుత్వానికి అప్పగించే నాటికి దాని ధర పరిగణిస్తారు. దానిద్వారా అంటే పెట్టుబడిగా ఉన్న భూమి ద్వారా వచ్చిన భూమిని ఆదాయంగా పరిగణిస్తారు. దానిపై 20.6 వాతం పన్ను ఉంటుంది.
ఉదాహరణకు గజం విలువ రూ.20వేలుగా డ్యాకుమెంట్‌లో చూపితే దానికి రూ.4వేల పైచిలుకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొనుగోలు చేసిన భూమి అయితే పై పద్ధతిలో చెల్లించాలి. పూర్వీకుల ఆస్తి అయితే ప్రభుత్వ ధరకు అనుగుణంగా పన్ను చెల్లించాలి. ఏదిఏమైనా పన్ను చెల్లింపు మాత్రం తప్పనిసరి. వచ్చే ఆరు నెలల వ్యవధిలో గుంటూరు ఐటీ కార్యాలయానికి రాజధాని భూముల టాక్స్ విక్రయాల ద్వారా భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అది కూడా వందల కోట్లలోనే ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి..