ఆంధ్రుల సాంస్కృతిక వైభవానికి చిహ్నం కూచిపూడి నాట్యం. దీనిలో అభినయానికి, భావ ప్రకటనకు ప్రాధాన్యమిస్తారు. అటువంటి కూచిపూడి నృత్యమే శ్వాసగా.. నాలుగేళ్ల ప్రాయం నుంచే నాట్య కళకు అంకితమై ఘనాపాటిగా పేరొందారు పి.వనజాచంద్రశేఖర్. ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానంతోపాటు వందల వేదికపై సత్కారాలు పొంది ప్రశంసలు అందుకున్నారు. కూచిపూడి శిక్షణాలయాలు ఏర్పాటుచేసి నాట్యగురువుగా అనేక మంది విద్యార్థులకు నృత్యంపై ఆసక్తి పెంచుతున్నారు.
గన్నవరం రూరల్: ఏలూరులో జన్మించిన వనజ కూచిపూడి నాట్య ప్రదర్శనలతో దేశమంతా ప్రశంసలు పొందుతున్నారు. నాలుగేళ్ల వయసులోనే ప్రాయానికి మించి కూచిపూడి నాట్యంపై మక్కువ చూపారు. ఆమెకు నాలుగేళ్ల వయసులో వారి ఇంటికి సమీపంలో ఉండే నాట్యగురువు నాగమణి బుద్ధదేవ్ ప్రభావం ఆమైపె పడటంతో కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ మార్గదర్శకంలో 1990లోనే స్వాగత గీతంతో అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 1700కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అనేక సత్కారాలు పొందారు.
విద్యార్థులకు శిక్షణాలయాలు
2016లో వివాహం చేసుకున్న వనజ చంద్రశేఖర్ గన్నవరం నియోజకవర్గం పెద అవుటపల్లిలో అత్తవారింట స్థిరపడ్డారు. ఆ తర్వాత కూడా ఆమె కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. కూచిపూడి నృత్యాన్ని జనజీవనంలో మరింత ప్రాచుర్యం పొందడానికి నాట్య శిక్షణాలయాలు ఏర్పాటు చేశారు. గన్నవరం, పెద అవుటపల్లి, ఆత్కూరు గ్రామాల్లో 70మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అత్తవారింటి ప్రోత్సాహంతో కళను ఔత్సాహికులందరికీ నేర్పాలని ఆకాంక్షతో పలు పాఠశాలల్లో కూడా కూచిపూడి నృత్యాన్ని నేర్పుతున్నారు.
2012లో గిన్నిస్ బుక్‌లో స్థానం
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 2012లో ప్రదర్శించిన మహా బృంద నాట్యంతో ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. గురువు నాగమణి బుద్ధదేవ్ ఆధ్వర్యంలో దేశంలోని మహా నగరాల్లో, ప్రఖ్యాత ఆలయాల్లో, విదేశీయులు, సీఎంలు, ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు పాల్గొన్న వేదికలపై కూచిపూడి నృత్యం ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.
దేశంలోని వివిధ నగరాల్లో ప్రదర్శనలు
రాంచి, జంషెడ్‌పూర్, ఆగ్రా, ఢిల్లీ, ముంబయి, కర్ణాటక మంజునాథ టెంపుల్, తమిళనాడు, కేరళ, రాజస్తాన్‌లో ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీకృష్ణ లీలలు, దశావతార ఘట్టాలు, గోదాదేవి కల్యాణంలో గోదాదేవిగా, అర్ధనారీశ్వరునిగా, మన్మథుడిగా, నారదుడు, నరసింహుడు, ప్రహ్లాదుడు వేషధారణలు వేసి పండిత పామరులతో ఔరా అనిపించుకున్నారు. మహిషాసుర మర్ధనిగా, మోహినీగా ఆమె హావభావాలు ప్రేక్షకులకు కనులపండువగా నిలిచాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిగా ప్రదర్శించిన కళాఖండాలు ప్రశంసలు పొందాయి.
నాట్య కళాపరిషత్‌ల జేజేలు
ఆమె చేసిన ప్రదర్శనలకు మెచ్చిన కళాపరిషత్‌లు జేజేలు పలికాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సాంగ్ అండ్ డ్రామా డివిజన్‌లో గురువు నాగమణి బుద్ధదేవ్ ప్రతినెలా 15 ప్రదర్శనలను ఏర్పాటు చేసే వారని తెలిపారు. ముంబాయి అభినయ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్, విజయవాడ ధర్మ పరిషత్, అఖిల భారత కూచిపూడి నాట్య మండలి, సిలికాన్ ఆంధ్రా ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ కన్వెన్షన్, ప్రపంచ తెలుగు మహా సభలు–ఏలూరు, కుంభమేళా ప్రదర్శనలు ఆమె కీర్తి కిరీటంలో మచ్చు తునకలు. బ్రహ్మాంజలి నృత్యంలో పెట్టింది పేరు. బాలరత్న, కళారత్న, నాట్య కిరీటి బిరుదులతో ఆమె ప్రశంసలు సాధించారు.
కూచిపూడి నాట్యానికి పూర్వ వైభవం
కూచిపూడి నృత్యానికి పూర్వ వైభవం రావాలి. ప్రభుత్వం కూచిపూడి నృత్యానికి ఆదరణ కల్పించటం ఆనందదాయకం. పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలి. తగిన ఆదరణ కల్పించాలి. ప్రభుత్వం తమవంతు సహకారం అందిస్తే నాట్య గురువులకు గౌరవంతో పాటు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను రక్షించినవారవుతారు.
–వనజ చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment