
ప్రతి ఇంటినుంచి ఓ కళాకారుడు రావాలి
అందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
6,117 మంది కూచిపూడి నృత్యకళాకారులతో ఘనంగా మహాబృంద నాట్యం
విజయవాడ కల్చరల్: తెలుగునేల మీద ప్రతి ఇంటి నుంచి ఒక కూచిపూడి నృత్య కళాకారుడు రావాలని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం ఎన్.చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవా ల ముగింపు సభ, మహాబృంద నాట్య ప్రారంభ సభ ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్‌కు అప్పగించామని తెలిపారు. అందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
కళలు జాతికి జీవనాడులని ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మహాబృంద నృత్యానికి దేశ విదేశాల నుంచి 6,117 మంది కూచిపూడి నృత్యకళాకారులు హాజరయ్యారు. జయము జయము గీతానికి అనుగుణంగా వారు నృత్యం చేశారు. 15 నిమిషాలపాటు ఈ నృత్యం కొనసాగింది. ఈ నృత్యాన్ని గిన్నిస్‌బుక్ ప్రతినిధులు అరుదైన ఫీట్‌గా గుర్తించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులకు నాయకత్వం వహించిన రూపానాథ్ ఈ కార్యక్రమం ప్రపంచంలో రికార్డు సృష్టించిందంటూ.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులకు గిన్నిస్ బుక్ ధ్రువపత్రం అందజేశారు.