ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం.. అదే సమైక్యాంధ్ర.. అంటూ సమైక్యవాదులు ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచుకోవడం కోసం ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. జిల్లాలో 58వ రోజు కూడా వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ మున్సిపాలిటీలో ఇంజనీర్లు 72 గంటల సెలవులోకి వెళ్లారు.
సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం జిల్లాలో వినూత్న నిరసనలతో హోరెత్తుతోంది. 58వ రోజైన గురువారం పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. విజయవాడలోని అన్ని రైతుబజార్ల సిబ్బంది, రైతులు కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. కూరగాయల దండలు ధరించి ప్రదర్శన జరిపారు. మైలవరంలోని విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు ప్రధాన రహదారిలో మూడోరోజు ధర్నా నిర్వహించారు. కలిదిండిలో సర్పంచ్ నజీమా ఆధ్వర్యంలో ముస్లింలు రిలే దీక్షలు చేశారు. ఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. మండవల్లిలో ఆర్‌ఎంపీ వైద్యులు రిలేదీక్షలు చేశారు. ఉపాధ్యాయులు జలదీక్ష నిర్వహించారు.
తెలంగాణ ఆడపడుచులకు వాయినాలు..
పెనుగంచిప్రోలులో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై బతుకమ్మ ఆటలు, తెలంగాణ ఆడపడుచులకు వాయినాలు అందించారు. గుడివాడ స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షల్లో గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. చేపల మార్కెట్లో పనిచేసేవారు రోడ్డుపైనే చేపలు తోమి తమ నిరసన తెలిపారు. పామర్రులో జేఏసీ నాయకులు రహదారుల వెంట భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. అవనిగడ్డలో కొత్తపేట, రామకోటిపురం రైతులు దీక్ష చేపట్టారు. నాగాయలంకలో రైతులు దీక్ష చేపట్టి, ఎడ్లబళ్లతో నిరసన తెలిపారు. పామర్రు నాలుగురోడ్ల కూడలిలో ఆ మండలంలోని రైతులు ట్రాక్టర్లను నిలిపి రహదారులను దిగ్బంధించారు.
2న హనుమాన్‌జంక్షన్‌లో రైతు మహాగర్జన..
రైతుల సమస్యలను వివరించేందుకు హనుమాన్‌జంక్షన్‌లో అక్టోబర్ రెండున రైతు మహాగర్జన నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ నేత విద్యాసాగర్ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో పెడనలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో 18వ వార్డు మహిళలు కూర్చున్నారు. తోట్లవల్లూరులో పొలిటికల్ జేఏసీ నాయకులు మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు. కూచిపూడిలో హోలీ స్పిరిట్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ఉపాధ్యాయులు జేఏసీ నేతలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. మంగళవాయిద్యాలతో భిక్షాటన చేశారు.
నూజివీడు మండలం మర్రిబంధంలో ఉపాధ్యాయులు వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. మచిలీపట్నంలో జేఏసీ నాయకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 31వ రోజుకు చేరాయి. కంచికచర్లలో ఎన్జీవోలు, ఉపాధ్యాయ సంఘాలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు స్థానిక జాతీయ రహదారిపై ప్రదర్శన, మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు స్థానిక నెహ్రూ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు.
నందిగామ శివారు అనాసాగరం సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. పలువురు ఉద్యోగులు రోడ్డుపై పడుకుని సమైక్య నినాదాలతో నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై వచ్చే ప్రైవేట్ బస్సులను అడ్డుకుని నిరసన చేపట్టారు. కోత మిషన్‌ల యజమానుల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కనకతప్పెట్ల మేళాలతో ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లో కొనసాగింది. గాంధీ సెంటర్‌లో మానవహారం ఏర్పాటుచేశారు. జార్జి అనే వృత్తిదారుడు సమైక్యాంధ్రకు మద్దతుగా గుండు గీయించుకుని నిరసన తెలిపాడు.
30 నుంచి సమ్మెలోకి ఇంజనీర్లు..
ఈ నెల 30 అర్ధరాత్రి నుంచి పులిచింతల ప్రాజెక్టు, ఎన్‌ఎస్పీల ఇంజనీర్లు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. జగ్గయ్యపేటలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగ సంఘాల మహిళా జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై పలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మున్సిపల్ కూడలి వద్ద ప్రధాన రహదారిపై మ్యూజికల్ చైర్స్ తదితర క్రీడలతో నిరసన తెలిపారు. పలువురికి చేతులపై గోరింటాకుతో జై సమైక్యాంధ్ర అని చిత్రీకరించి మహిళలు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలులో తెలుగు ప్రజల సంృ్కతిలో భాగమైన బతుకమ్మను ఏర్పాటుచేసి, దానికి సమైక్యాంధ్ర జెండాను ఉంచి స్థానిక పాత సినిమా హాల్ సెంటర్‌లో పాటలు పాడారు. వత్సవాయి జేఏసీ నాయకులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు.
మక్కపేట గ్రామంలో విద్యార్థులు, గ్రామస్తులు కలిసి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మోపిదేవిలో జాతీయ రహదారిపై కార్పెంటర్లు వడ్రంగి పనులు చేపట్టి నిరసన తెలిపారు. వెంకటాపురంలో ప్రధాన రహదారిపై మహిళలు, పిల్లలు గురువారం రాస్తారోకో నిర్వహించారు. వెంకటాపురం 11వ నంబర్ కాలువలో జలదీక్ష చేపట్టి రైతులు నిరసన తెలిపారు. ఇంజనీర్ల రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో మున్సిపల్ ఇంజనీర్లు 72 గంటల సెలవులోకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్నారు.
ఒకటే లక్ష్యం...ఒకటే గమ్యం
Published Fri, Sep 27 2013 12:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement
Advertisement