- విద్యుత్ కోతలు
- సాగునీటి సంక్షోభం
- ఎండిపోతున్న పంట
హనుమాన్‌జంక్షన్ : ఓవైపు విద్యుత్ కోతలు, మరోవైపు సాగునీటి సంక్షోభం వెరసి చెరుకు రైతును ఆందోళనకు గురిచేస్తున్నాయి.బాపులపాడు మండలంలో విద్యుత్ బోరు బావులు, వర్షాధారంపైనా ఆధారపడి చెరకు సాగు చేస్తున్నారు. వర్షాలు కురుస్తాయని, ఈ లోగా విద్యుత్ బోరు బావులతో నీరు అందించవచ్చన్న ఆశతో రైతులు చెరుకు నాట్లు వేశారు.
కానీ సకాలంలో తొలకరి వర్షాలు కురవకపోవడం, తీవ్రమైన విద్యుత్ కోతలవల్ల బోరుబావులనుంచి నీరందించలేకపోవడంతో పాటు విపరీతమైన వేసవి ఉష్ణోగ్రతలతో మొక్క, గెడలు కట్టే దశలో ఉన్న చెరుకు తోటలు ఎండిపోతున్నాయి.
హనుమాన్‌జంక్షన్ శివారులో ఉన్న డెల్టా చక్కెర కార్మాగారం పరిధిలో సుమారు 8600 ఎకరాల్లో చెరుకు పంట సాగులో ఉంది. ఇప్పటికే 5100 ఎకరాల్లో పిలక తోటలు సాగులో ఉండగా, ఈ ఏడాది మరో 3500 ఎకరాల్లో మొక్క తోటలు వేశారు. బాపులపాడు మండలంలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో చెరుకు సాగులో ఉంది.
మునుపెన్నడూ లేని విధంగా వేసవి ఉష్ణోగ్రతలు పెరగటంతో మొక్కతోటలు ఎండిపోతున్నాయి. మరో పక్క గెడలు కట్టే దశలో ఉన్న పిలక తోటలకు సైతం సకాలంలో సరిపడినంత నీరందక ఎండిపోతుండడం రైతన్నకు అందోళన కలిగిస్తుంది. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరాలో కోత విధిస్తుండటంతో నీరందక చెరకు తోటలు ఎండిపోతున్నాయి. రోజుకు కనీసం మూడు, నాలుగు గంటలు కుడా విద్యుత్ సరఫరా లేకపోవటంతో మెట్టప్రాంత భూముల్లో సాగునీటి ఎద్దడి నెలకొంది.
దిగుబడిపై ప్రభావం...
అధిక ఉష్ణోగ్రతలు, సాగునీరు ఎద్దడి, వాతావరణ పరిస్థితులు చెరుకు పంట దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు, చక్కెర కార్మగారం యాజమాన్యం అభిప్రాయపడుతుంది. సాధారణంగా చెరుకు పంట సగటు దిగుబడి ఎకరాకు 30 టన్నులు కాగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎకరాకు 22- 25 టన్నులకు మించి దిగుబడి రావటం కష్టమని చెబుతున్నారు.
ప్రస్తుత సీజన్‌లో డెల్టా చక్కెర కార్మాగారం సుమారు 2.50 లక్షల టన్నుల చెరుకు దిగుబడిని ఆశిస్తుండగా, అది కాస్త 2 లక్షల టన్నులకు మించకపోవచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఓ పక్క చెరుకు పంటకు సరైన గిట్టుబాటు ధరలు లభించక నష్టాలను ఎదుర్కొంటున్న రైతాంగానికి ఈ పరిస్థితులు ములిగే నక్కపై తాటికాయ పడిన చందంగా తయారైంది. తొలకరి వర్షాలు కురుస్తాయన్న గంపెడాశతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు.