నడిమంత్రపు వెలుగులు!
* కోతల్లేని విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పాలకుల కోతలు
* సాగుకు వినియోగం సగానికి పడిపోవడంతో నెట్టుకొస్తున్న సర్కారు
* విచ్చలవిడి కోతలతో గత ఖరీఫ్‌లో ఎండిన పంటలు
* కోతల భయంతో రబీలో పంటలు వేయని అన్నదాతలు
* వ్యవసాయానికి భారీగా పడిపోయిన విద్యుత్ డిమాండ్
* వచ్చే ఖరీఫ్‌లో పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభం
రాష్ర్టంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిరంతర విద్యుత్ సరఫరాతో గృహ, వాణిజ్య, పరిశ్రమ వర్గాలను సంతృప్తి పరుస్తోంది. ఇంతటితోనే రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించామని గర్వంగా ప్రకటించుకుంది. ముఖ్యమంత్రి కూడా అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు. మరి నిజంగానే విద్యుత్ సమస్య తీరిందా? నాలుగు నెలల కిందటి వరకు తీవ్ర కరెంటు కష్టాలున్నాయంటూ చెప్పుకొచ్చిన సర్కారు.. ఇప్పుడు ఆ సమస్యను అధిగమించినట్లు చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
- సాక్షి, హైదరాబాద్
తగ్గిన ఉత్పత్తి.. అధిక ధరలకు కొనుగోళ్లు..
విభజన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క మెగావాట్ విద్యుదుత్పత్తి సామర్థ్యం కూడా పెరగలేదు. సింగూరు (232 మెగావాట్లు), సాగర్ టెయిల్‌పాండ్ (90 మెగావాట్లు) , రామగుండం థర్మల్ ప్లాంట్ (60 మెగావాట్లు) లో గత ఆర్నెల్లుగా ఉత్పత్తి నిలిచిపోయింది. వీటి పునరుద్ధరణపై ఆసక్తి చూపని ప్రభుత్వం.. అధిక ధరలకు స్వల్పకాలికంగా విద్యుత్ కొనుగోళ్లు చేసింది. రాష్ట్రానికి బొగ్గు సరఫరా పెరగడంతో కొన్ని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెరిగింది. సుమారు 1,000 మిలియన్ యూనిట్ల కరెంటును అధికంగా ఉత్పత్తి చేశామని ప్రభుత్వం పేర్కొంటున్నా ఇందులో ఏపీ వాటా పోగా రాష్ట్రానికి దక్కింది సగమే.
డిమాండు తగ్గింపే సర్కారు ఘనత..
గత ఏడాది రబీలో రాష్ర్టంలో విద్యుత్ డిమాండ్ 160 నుంచి 170 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మధ్య ఉండేది. సాధారణంగా ఏటా 8-10 శాతం మేర డిమాండ్ పెరుగుదల ఉంటుంది. దీని ప్రకారం ప్రస్తుత రబీలో 170-180 ఎంయూ మధ్య డిమాండ్ ఉండాలి. కానీ ఈ వేసవిలో ఏ రోజూ డిమాండ్ 152 ఎంయూకు మించలేదు. అకాల వర్షాలతో డిమాండ్ ఓ దశలో 108 ఎంయూ కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుత డిమాండ్ 130-140 ఎంయూ మధ్య నిలకడగా ఉంది. ఇలా డిమాండ్ తగ్గిపోవడమే వేసవిలో విద్యుత్ కోతలు లేకపోవడానికి ప్రధాన కారణం. గత ఖరీఫ్‌లో వ్యవసాయానికి 3 నుంచి 5 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా చేశారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే విద్యుత్ సరఫరా లేక 1,43, 675 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. రబీలో కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని గ్రహించిన సర్కారు ఆరుతడి పంటలు వేయాలని ప్రచారం చేసింది. దీనికి తోడు ఖరీఫ్ అనుభవాలతో రైతులు బెదిరిపోయారు. వరి పంటకు విరామం ప్రకటించారు. గత రబీలో 8.25 లక్షల హెక్టార్లలో వరి సాగు జరిగితే ప్రస్తుత రబీలో అది 4.37 లక్షల హెక్టార్లకు పడిపోయింది. దీంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా సగానికి పడిపోయింది. దీంతో ఈ విద్యుత్‌ను ఇతర అవసరాలకు వినియోగించారు.
ఖరీఫ్‌లో మళ్లీ సంక్షోభమే!
వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు రాష్ర్టంలో మళ్లీ విద్యుత్ సంక్షోభం ఏర్పడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఏడాది కాల వ్యవధితో చేసుకున్న స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కాల పరిమితి వచ్చే జూన్‌తో ముగిసిపోనుంది. ఈ ఒప్పందాల ద్వారా ప్రస్తుతం తెలంగాణకు 950 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరుగుతోంది. అయితే జూన్ తర్వాత 650 మెగావాట్ల కొనుగోళ్లకు మాత్రమే ఒప్పందాలను ప్రభుత్వం పొడిగించుకోగలిగింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల భూపాలపల్లి, 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్లు పూర్తయి ఉత్పత్తి ప్రారంభం కావడానికి కనీసం 9 నుంచి 12 నెలల సమయం పట్టనుంది. ఆ తర్వాతే విద్యుత్ సమస్య కొంతమేర తీరే అవకాశముంది.