కూచిపూడి, న్యూస్‌లైన్ : అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి (కూచిపూడి) పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమీ (చెన్నై) సంయుక్త ఆధ్వర్యంలో 27వ తేదీనుంచి 29వ తేదీవరకు ‘తానీషా యువ నాట్యోత్సవ్ - 2013 నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్లుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ తానీషాకు నాట్య నివాళి అర్పిస్తున్నామన్నారు.
తొలిరోజు వెంపటి చినసత్యం, రెండవరోజు పీవీజీ కృష్ణశర్మ, ముగింపురోజును వేదాంతం సత్యనారాయణశర్మల పేరిట స్మారక నాట్యోత్సవాలుగా నామకరణం చేసి నిర్వహిస్తున్నామని చెప్పారు. వేడుకలను దేవాదాయ ధర్మాదాయ కమిషనర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి నందివెలుగు ముక్తేశ్వరరావు ప్రారంభిస్తారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పామర్రు శాసనసభ్యులు డీవై దాస్ జ్యోతి ప్రజ్వలన చేస్తారని తెలిపారు. నృత్యవాఛస్పతి వేదాంతం పార్వతీశం స్మారక పురస్కారాన్ని నాట్యాచార్య చింతా సీతారామాంజనేయులు, వెంపటి చినసత్యం స్మారక పురస్కారాన్ని కళారత్న ఏబీ బాలకొండలరావుకు బహూకరిస్తున్నామని చెప్పారు.
రాజమండ్రికి చెందిన లలితా సింధూరి కూచిపూడి నాట్యం, హాంకాంగ్‌కు చెందిన రూపా కిరన్ భరతనాట్యం, యుఎస్‌ఏకు చెందిన ఉప్పల హేమశిల్పి కూచిపూడి నాట్యం, పండిట్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారగ్రహీత యేలేశ్వరపు శ్రీనివాసు బృందం భక్తప్రహ్లాద యక్షగాన ప్రదర్శనలు జరుగుతాయని వివరించారు.
రెండవ రోజు ముఖ్యఅతిధిగా జూనియర్ సివిల్ జడ్జి కే ప్రభాకరరావు పాల్గొని నాట్యాచార్య వేదాంతం రాధేశ్యాంను పురస్కరిస్తారని తెలిపారు. కూచిపూడికి చెందిన యేలేశ్వరపు సోదరీ మణులు సంగీత సభ, బెంగళూరుకు చెందిన పసుమర్తి వెంకటరమణ కూచిపూడి నాట్యం, వందన ఒడిస్సీ నాట్యం, హైదరాబాద్‌కు చెందిన ఎం.సురేంద్రనాధ్ బృందం కూచిపూడి నాట్యం, పండిట్ బిస్మిల్లాకాన్ యువ పురస్కారగ్రహీత చింతా రవిబాలకృష్ణ శిష్యబృందం కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇస్తారని చెప్పారు.
ముగింపురోజున ముఖ్యఅతిథిగా ఎంపీ కొనకళ్ల నారాయణరావు పాల్గొని కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత నాట్యాచార్య పసుమర్తి రత్తయ్యశర్మను సత్కరిస్తారని తెలిపారు. అనంతరం చెన్నైకు చెందిన మురుగ శాంకరి భరతనాట్యం, కలకత్తాకు చెందిన సుధీర్ ఘోష్ మణిపురి, బెంగళూరుకు చెందిన మోహినీ ఆట్టం, పండిట్ బిస్మిల్లాకాన్ యువపురస్కార గ్రహీత కురవి సుబ్రహ్మణ్య ప్రసాద్ కూచిపూడి నాట్యం ప్రదర్శిస్తారని తెలిపారు.
27నుంచి తానీషా యువ నాట్యోత్సవ్
Published Sun, Dec 15 2013 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement