Vempati chinasatyam
-
కూచిపూడి నాట్యాన్ని.. విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు - 'పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం'
సాక్షి, పత్రికా ప్రకటన: మచిలీపట్నం అక్టోబర్ 15: పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కూచిపూడి నాట్య సాంప్రదాయ పరిరక్షణకి, పునరుద్ధరణకి, ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారని మంత్రి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యుదయ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఆర్కే రోజా కొనియాడారు. ఆదివారం కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్, కూచిపూడి అకాడమీ చెన్నై, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జయహో భారతీయం సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ముఖ్యంగా అక్షర, ఇమాంసి, అన్షికలు టెంపుల్ నృత్యం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ వెంపటి చినసత్యం మనవరాలు కామేశ్వరి బృందం చెన్నై వారి ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని నృత్యం ఎంతో అద్భుతంగా కమనీయంగా ప్రదర్శించారు. అలాగే నాలుగవ ప్రపంచ కూచిపూడి దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది విద్యార్థులు డాక్టర్ వెంపటి చిన సత్యం రూపొందించిన బ్రహ్మాంజలి మహా బృంద నృత్యం ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. తొలుత ఇంచార్జి మంత్రివర్యులు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రకాశనం చేసి డాక్టర్ వెంపటి చినసత్యం వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సీఈవో ఆర్ మల్లికార్జున రావు రూపొందించిన డాక్టర్ వెంపటి చినసత్యం చిత్రపటాన్ని మంత్రులు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆర్కే రోజా మాట్లాడుతూ మన సంస్కృతి, కళలను సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులని అన్నారు. ఈ వేడుకలతో కూచిపూడి ప్రాంతమంతా అంగరంగ వైభవంతో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి ఆ గ్రామానికి పరిమితం కాకుండా కూచిపూడి నృత్యాన్ని ప్రపంచంలో మారుమోగేలా కృషి చేశారన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ కార్యక్రమంలోనైనా మొదట తెలుగు నేలను తెలుగు ఖ్యాతిని ప్రతిబింబించే విధంగా కూచిపూడి నృత్యంతో ప్రారంభిస్తారన్నారు. డాక్టర్ వెంపటి చిన సత్యం మరణించి 13 సంవత్సరాల అయినప్పటికీ వారి శిష్యులు ప్రదర్శించే హావభావాలు,, నృత్యంలో సజీవమై కనిపిస్తున్నారన్నారు. సినిమా పరిశ్రమలో కూడా వైజయంతి మాల, హేమమాలిని, జయలలిత, ప్రభ ,చంద్రకళ, మంజు భార్గవి వంటి ఎందరో నటీమణులు వారి వద్ద శిష్యరికం చేశారన్నారు. 2011లో 1800 మంది చిన్నారులతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయిందన్నారు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని తద్వారా వారికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు అన్నారు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులని ప్రశంసించారు. గతంలో విజయవాడ చెన్నై లో జరిగే వారి జయంతి వేడుకలను మంత్రి ఆర్కే రోజా చొరవతో ఈరోజు వారు జన్మించిన కూచిపూడి గ్రామంలోనే జరుపుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కూచిపూడి నృత్యం వంటి కళారూపాలను మరిచిపోతున్న తరుణంలో డాక్టర్ వెంపటి చినసత్యం వారి శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఆరాధిస్తుండడం వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక కళారూపం ముఖ్యంగా చెప్పుకుంటున్నామని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూచిపూడి నృత్యం, ఒరిస్సాకు ఒడిస్సి, ఉత్తరప్రదేశ్ కు కథాకళి, కేరళ కు మోహిని అట్టం వంటి కళారూపాలు ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. మరుగున పడిపోతున్న కూచిపూడి నృత్యానికి డాక్టర్ వెంపటి చిన సత్యం జీవం పోసి విశ్వవ్యాప్త ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారన్నారు. వివిధ ప్రాంతాల్లోని నాట్యాచారులను, విద్యార్థులను ఒక చోట చేర్చి ఇలాంటి పెద్దయెత్తున వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలో మహానుభావులు డాక్టర్ వెంపటి చినసత్యం జన్మించిన కూచిపూడి గ్రామం ఉండటం వారి ద్వారా కూచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే మన జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు జన్మించిన ప్రాంతం బాట్ల పెనుమర్రు కూడా తన పరిధిలోనే ఉండటం సంతోషకర విషయం అన్నారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని, మంత్రిని కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో రెండు కళాశాలలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కూచిపూడి లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజు భార్గవికి డాక్టర్ వెంపటి చినసత్యం జయంతి పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మంత్రులు అతిథులు అందజేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రులు అతిథులు ఆవిష్కరించారు. అలాగే శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం కూచిపూడి ప్రధానాచార్యులు కేంద్ర సంగీత నృత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి సిద్ధేంద్ర యోగి పురస్కారం, నాట్యాచార్యులు మాధవ పెద్ది మూర్తికి వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం, వేదాంతం రాదే శ్యామ్‌కు డాక్టర్ పద్మశ్రీ శోభా నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, పార్వతీ రామచంద్రన్ కుమారి లంక అన్నపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం, పటాన్ మొహిద్దిన్ ఖాన్ కు వెంపటి వెంకట్ సేవా పురస్కారాలను మంత్రులు అతిధులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్పీ భారతి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష, అధికార బాషా సంఘం సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్ మల్లికార్జున రావు, డిఆర్ఓ పి. వెంకటరమణ, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, డిఆర్డిఎడ్ డ్వామా పీడీలు పిఎస్ఆర్ ప్రసాదు, సూర్యనారాయణ, విద్యుత్ అధికారి భాస్కరరావు, తహసిల్దార్ ఆంజనేయ ప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు, వారి తల్లిదండ్రులు, కళాభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది. -
Vempati Chinna Satyam: కూచిపూడి విదుషీ ధీమణి
శాస్త్రీయ నృత్య రూపకాల్లో విశేషమైన ఆదరణ కలిగిన వాటిలో కూచిపూడి ఒకటి. ఇది తెలుగు నేల నుంచి ప్రస్థానం ప్రారంభించి యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది. ఆంధ్ర రాష్ట్ర అధికారిక నృత్యం కూచిపూడి. అందులో అత్యద్భుతమైన నాట్యాచార్యులు ‘పద్మభూషణ్’ వెంపటి చిన సత్యం. 1929 అక్టోబర్ 15న కృష్ణా జిల్లా కూచిపూడిలో వెంపటి జన్మించారు. తమిళనాడులో భరతనాట్యం విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని అక్కడి కళాభిమానులకు పరిచయం చేసి, దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు. కూచిపూడి నాట్యంలో సరికొత్త ప్రయోగాలు చేయడానికి తన జీవితమంతా అంకితం చేసిన విదుషీ ధీమణి వెంపటి. రకరకాల జతులనీ, నాట్య ప్రక్రియలనీ విస్పష్టంగా వర్గీకరించి, సనాతన నాట్యశాస్త్ర సమగ్ర విధివిధానాలతో మేళవించి, ఎన్నెన్నో జతి స్వరాలూ, తిల్లానాలూ, వర్ణాలూ సృజించిన నాట్య పరమేష్టి ఆయన. కూచిపూడి నృత్య నాటికలను ఎన్నింటినో రూపొందించి వాటికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేశారు. శ్రీకృష్ణ పారిజాతం, చండాలిక, మేనకా విశ్వామిత్ర, రుక్మిణీ కల్యాణం, కిరాతార్జునీయం, క్షీరసాగర మథనం, పద్మావతీ శ్రీనివాసం, హరవిలాసం లాంటివి పేరెన్నిక గన్నవి. 1947లో మద్రాసుకు చేరుకున్న చిన సత్యం తన సోదరుడు వెంపటి పెద సత్యం వద్ద సినిమాలకు నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. 1984లో అమెరికా పిట్స్‌బర్గ్‌లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన కూచిపూడి నృత్యానికి గిన్నిస్ రికార్డు వచ్చింది. 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాపించారు. దీని ద్వారా వైజయంతిమాల, ప్రభ, పద్మామీనన్, వాణిశ్రీ, శోభానాయుడు లాంటివారికి కూచిపూడి నేర్పించారు. హేమమాలిని, మంజుభార్గవి, చంద్రకళ, రత్నపాప వంటి వారంతా ఆయన శిష్యులే. 2012 జూలై 29న మరణించిన వెంపటి జన్మదినమైన అక్టోబర్ 15న ప్రపంచ కూచిపూడి దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఆయన పేరిట 5 లక్షల రూపాయల స్మారక పురస్కారాన్ని ‘యక్షగాన సార్వభౌమ’ చింత సీతారామాంజనేయులుకు ప్రకటించింది. పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు ఆర్కే రోజా దీన్ని ప్రదానం చేస్తారు. – రేగుళ్ళ మల్లికార్జునరావు, సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ (అక్టోబర్ 15న వెంపటి చిన సత్యం జయంతి) -
నాట్యకారిణి శోభా నాయుడు కన్నుమూత
-
శోభా నాయుడు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలో అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించిన శోభా నాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం శోభా నాయుడు మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. శోభా నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
చికాగో తెలుగు సంఘాల సమర్పణలో ‘అర్ధనారీశ్వరం’
చికాగో : అమెరికా చికాగోలోని తెలుగు సంఘాలు సంయుక్తంగా సెప్టెంబర్ 7వ తేదీన నేపర్విల్లోని నార్త్ సెంట్రల్ కాలేజ్ ఫైఫర్ హాలులో సమర్పించిన కూచిపూడి సంగీత నృత్యరూపకం ‘అర్ధనారీశ్వరం’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. పద్మభూషణ్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమికి చెందిన 21 మంది కళాకారులు ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. అనేక తెలుగు సంఘాలు సమైక్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘాల్లో అమెరికన్ తెలుగు అసోషియేషన్, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా, ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్, చికాగో తెలుగు అసోషియేషన్, చికాగో ఆంధ్ర అసోషియేషన్ ఉన్నాయి. చికాగోలోని 8 డ్యాన్స్ స్కూళ్ల గురువులు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు. సహకారం అందించిన వారిలో ఆనంద డ్యాన్స్ థియేటర్ గురువు జానకి ఆనందవల్లి నాయర్, ఆచార్య పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమి గురు ఆశా అడిగ ఆచార్య, ఆనంద డ్యాన్స్ గురువు సంగీత రంగాల, కూచిపూడి నాట్య విహార గురువు శోభ తమ్మన, నృత్య తరంగ డాన్స్ అకాడమి గురువు అపర్ణ ప్రశాంత్, ప్రేరణ అకాడమి ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురువు అరుణ చంద్ర, సంస్కృతీ ఫౌండేషన్ గురువు శోభ నటరాజన్, డా వినీల చక్కులపల్లి కాకర్లలు ఉన్నారు. కార్యక్రమం ప్రారంభ సమయంలో ‘అర్ధనారీశ్వరం’ ప్రదర్శన దృశ్యాలను నిర్వహకులు ప్రేక్షకులకు వివరించారు. రెండు గంటల పాటు సాగిన ఈ సంగీత నృత్యరూపకంలో ఆరణ్యంలో గంగ కోసమై భగీరథుని తపస్సుతో ప్రారంభమై, బ్రహ్మాదిదేవతల ప్రవేశము, గంగ ప్రవేశము, కైలాసంలో ప్రమధగణాలతో శివుని తాండవం, పరమేశ్వరుడు భగీరథ ప్రార్థనను మన్నించడం, ఉత్తుంగ తరంగ గంగాప్రవాహినియైన గంగావతరణం, గౌరి అసూయ శివుని అనునయం, గౌరి కైలాసం నుంచి నిష్ర్కమించడం, గౌతమమహర్షి ఆదేశంతో గౌరి కేదారేశ్వర పూజ చేయడం, శివుడు ప్రత్యక్షంగా గౌరీశంకరులు ఏకమవ్వడం, అర్ధనారీశ్వరుని లాస్య తాండవ నృత్యం, ప్రమధాది భక్త గణముల నృత్యముతో రసవత్తరంగా కథ ముగుస్తుంది. నృత్య ప్రదర్శనలోని సన్నివేశాలను ప్రతిబింబించేలా స్టేజీ అలంకరణ ప్రేక్షకులను కట్టిపడేసింది. కూచిపూడి నాట్యకళాకారుల, గాయనీగాయకుల, వాద్యబృందం అద్భుత ప్రదర్శన ప్రేక్షకులను అకట్టుకుంది. 19 ఏళ్ల తర్వాత చికాగో విచ్చేసిన వెంపటి బృందం వారి నృత్య ప్రదర్శనను ఘనంగా ఏర్పాటు చేయడంలో కార్యనిర్వహక ముఖ్య సభ్యులు రామరాజ బి యలవర్తి, జగదీశ్ కానూరి, సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని విశేష కృషి చేశారు. -
నిలిచిపోయిన ‘నర్తనం’
నివాళి ఒక మువ్వ రాలిపోయింది... నిన్నటి దాకా నేలపై నర్తించిన పాదం... శివునితో నాట్యం చేయడానికి కైలాసం చేరుకుంది...కూచిపూడి వెంపటి వారసత్వం లయమై పోయింది... ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు పద్మవిభూషణ్ వెంపటి చినసత్యం రెండవ కుమారుడు నాట్యాచార్యులు వెంపటి రవి శంకర్ ఈ ఉదయం గుండె పోటుతో చెన్నైలో కన్నుమూశారు. ‘‘1969 అక్టోబర్‌లో జన్మించిన రవి శంకర్ తండ్రి దగ్గర నాట్యాభ్యాసం చేయలేదు. వెంపటి చినసత్యంగారి ప్రథమ శిష్యురాలు బాల కొండలరావు దగ్గర వెంపటి నాట్యం ఆరంభించారు. ‘శ్రీనివాస కల్యాణం’లో కల్పతరువుగా నటించి, తండ్రి దృష్టిలో పడ్డారు. కుమారుడిని చూసి తండ్రి మురిసి పోయారు. ‘ఇంతింతై వటుడింతౖయె’ అన్నట్లుగా తండ్రికి దీటుగా నాట్యకారుడిగా అవ తరించాడు. చినసత్యం రూపొందించిన అంశాలను 1994 – 2004 మధ్యకాలంలో ప్రదర్శించారు. అర్ధనారీశ్వరుడిగా నటించి అందరినీ అలరించారు. ‘హరవిలాసం’లో శివుడు, ‘శకుంతలదుష్యంతులు’లో దుష్యంతుడు, ‘కిరాతార్జునీయం’లో అర్జునుడిగా నటించారు. బాల్యంలోనే ‘క్షీరసాగర మథనం’లో అప్సరసగా కూచిపూడి సంప్రదాయ రీతుల్లో ఆడ వేషం వేశారు. 1994లో ‘వందే ఉమాసుతం’ అనే స్వీయరచన చేసి 2007లో నృత్య రూపకల్పన చేశారు. ఈ రూపకాన్ని ఐదు గతుల్లో నడిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎవ్వరూ స్పృశించని అనేక అన్నమయ్య కీర్తనలకు నృత్యాభినయం సమకూర్చి పిల్లల చేత ప్రదర్శనలు ఇప్పించారు. ‘అతడిని మించినవాడు లేడు’ అనిపించుకున్నాడు’’ అంటున్నారు ప్రముఖ నాట్యాచార్యులు కూచిపూడి గ్రామానికి చెందిన పశుమర్తి కేశవప్రసాద్. ‘‘మాస్టారుగారి అబ్బాయికి నేర్పడం నాకు గర్వంగా ఉంది. నా శిష్యుడు నన్ను అధి గమించాడు. తండ్రితో సమానంగా, తండ్రికి ధీటుగా ప్రతి విషయాన్ని చక్కగా కూచిపూడి శైలిలో మలిచాడు’’ అంటారు వెంపటి రవిశంకర్ నాట్యగురువులు శ్రీమతి బాల కొండలరావు. ‘‘పద్మభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ దగ్గర సంగీతం అభ్యసించి, కచేరీలు చేశాడు. ఆయన మంచి నాట్యాచార్యుడు, నర్తకుడు. ఆయనకు జ్ఞాత, అజ్ఞాత శిష్యులు దేశవిదేశాలలో ఉన్నారు. ఆయన అçస్తమయం కూచిపూడి కళారంగానికి తీరనిలోటు. అన్ని వాద్యాల మీద అపరిమితమైన పరిజ్ఞానం ఉంది. ఎవరిని ఎలా ఉపయోగించు కోవాలో, ఏ వాద్యాన్ని ఏ సందర్భానికి ఉపయోగించాలో బాగా తెలుసు. లఘువు బిగువులు తెలిసిన మహావ్యక్తి. కుర్రవాళ్లలో ఇటువంటి వ్యక్తిని చూడలేదు. తీర్చిదిద్దడం, అంశాన్ని డ్రమెటైజ్ చేయడం ఆయనకి బాగా తెలుసు. మాకు బాలా త్రిపుర సుందరి మీద కీర్తనలు పాడి ఇచ్చారు. అందరి మనసులలో స్థానం ఏర్పరుచుకున్నారు. సంగీతం, నృత్యం నేర్చుకోవడమే కాదు, అందులో నిష్ణాతులు. చినసత్యం అంతటి వారవ్వగలిగిన జ్ఞాని ఆయన. కాని అనారోగ్యం కారణంగా కాలేకపోయారు. దక్ష యజ్ఞంలో శివుడు వేషం వేసి మెప్పించారు. విద్వత్సభలలో సంగీత కచేరీలు చేశారు. నట్టువాంగం రావాలంటే సంగీతం వచ్చి తీరాలి. చినసత్యం గారు రూపకల్పన చేసిన వాటిని యథాతథం ప్రదర్శించేవారు. ఆనందతాండవం, జయముజయము... వంటివి. చినసత్యంగారి వారసుడుగా నిలబడలేకపోవడం కూచిపూడికి తీరనిలోటు.. అంటు న్నారు విజయవాడకు చెందిన ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు భాగవతుల వెంకట రామశర్మ. 2008లో మొట్టమొదటి కూచిపూడి నాట్య సమ్మేళనం అమెరికాలో జరిగినప్పుడు తండ్రితో పాటు సిలికానాంధ్రకు విచ్చేసి ‘కూచిపూడి వైజయంతిక’ అనే బ్యాలేలో సిద్ధేంద్ర యోగి పాత్ర ధరించారు. అప్పటి నుంచి సిలికానాంధ్ర చేస్తున్న అన్ని కార్యక్రమాలకు తోడ్పడుతూ వచ్చారు. 2016లో విజయవాడలో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నాట్యసమ్మేళనానికి ‘సాధన వీడియో’ స్వయంగా తయారుచేసి అందించారు. అద్భుత మైన కళాకారుడు. మృదుస్వభావి. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 2015లో కళారత్న పురస్కారం అందచేశాం. ఎన్నో సాధించవలసిన వ్యక్తి, చినసత్యంగారి వార సుడు ఆయన. వారి కుటుంబానికి తగిన సహాయం సిలికానాంధ్ర తరఫు నుంచి అంద చేయాలని సంకల్పించాం... అన్నారు సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్. – డాక్టర్ పురాణపండ వైజయంతి -
27నుంచి తానీషా యువ నాట్యోత్సవ్
కూచిపూడి, న్యూస్‌లైన్ : అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి (కూచిపూడి) పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమీ (చెన్నై) సంయుక్త ఆధ్వర్యంలో 27వ తేదీనుంచి 29వ తేదీవరకు ‘తానీషా యువ నాట్యోత్సవ్ - 2013 నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్లుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ తానీషాకు నాట్య నివాళి అర్పిస్తున్నామన్నారు. తొలిరోజు వెంపటి చినసత్యం, రెండవరోజు పీవీజీ కృష్ణశర్మ, ముగింపురోజును వేదాంతం సత్యనారాయణశర్మల పేరిట స్మారక నాట్యోత్సవాలుగా నామకరణం చేసి నిర్వహిస్తున్నామని చెప్పారు. వేడుకలను దేవాదాయ ధర్మాదాయ కమిషనర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి నందివెలుగు ముక్తేశ్వరరావు ప్రారంభిస్తారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పామర్రు శాసనసభ్యులు డీవై దాస్ జ్యోతి ప్రజ్వలన చేస్తారని తెలిపారు. నృత్యవాఛస్పతి వేదాంతం పార్వతీశం స్మారక పురస్కారాన్ని నాట్యాచార్య చింతా సీతారామాంజనేయులు, వెంపటి చినసత్యం స్మారక పురస్కారాన్ని కళారత్న ఏబీ బాలకొండలరావుకు బహూకరిస్తున్నామని చెప్పారు. రాజమండ్రికి చెందిన లలితా సింధూరి కూచిపూడి నాట్యం, హాంకాంగ్‌కు చెందిన రూపా కిరన్ భరతనాట్యం, యుఎస్ఏకు చెందిన ఉప్పల హేమశిల్పి కూచిపూడి నాట్యం, పండిట్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారగ్రహీత యేలేశ్వరపు శ్రీనివాసు బృందం భక్తప్రహ్లాద యక్షగాన ప్రదర్శనలు జరుగుతాయని వివరించారు. రెండవ రోజు ముఖ్యఅతిధిగా జూనియర్ సివిల్ జడ్జి కే ప్రభాకరరావు పాల్గొని నాట్యాచార్య వేదాంతం రాధేశ్యాంను పురస్కరిస్తారని తెలిపారు. కూచిపూడికి చెందిన యేలేశ్వరపు సోదరీ మణులు సంగీత సభ, బెంగళూరుకు చెందిన పసుమర్తి వెంకటరమణ కూచిపూడి నాట్యం, వందన ఒడిస్సీ నాట్యం, హైదరాబాద్‌కు చెందిన ఎం.సురేంద్రనాధ్ బృందం కూచిపూడి నాట్యం, పండిట్ బిస్మిల్లాకాన్ యువ పురస్కారగ్రహీత చింతా రవిబాలకృష్ణ శిష్యబృందం కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇస్తారని చెప్పారు. ముగింపురోజున ముఖ్యఅతిథిగా ఎంపీ కొనకళ్ల నారాయణరావు పాల్గొని కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత నాట్యాచార్య పసుమర్తి రత్తయ్యశర్మను సత్కరిస్తారని తెలిపారు. అనంతరం చెన్నైకు చెందిన మురుగ శాంకరి భరతనాట్యం, కలకత్తాకు చెందిన సుధీర్ ఘోష్ మణిపురి, బెంగళూరుకు చెందిన మోహినీ ఆట్టం, పండిట్ బిస్మిల్లాకాన్ యువపురస్కార గ్రహీత కురవి సుబ్రహ్మణ్య ప్రసాద్ కూచిపూడి నాట్యం ప్రదర్శిస్తారని తెలిపారు.