అమెరికా యువతకూ హుక్కా జబ్బు!
అమెరికాలో సిగరెట్ల వాడకం ఇటీవలి కాలంలో బాగా తగ్గింది. అయితే.. అందుకు సంతోషించాలో, హుక్కా వాడకం పెరుగుతున్నందుకు ఏడవాలో అర్థం కావట్లేదు. ఆ దేశంలో ఇప్పుడు చాలామంది హైస్కూలు పిల్లలు హుక్కా, చుట్టలు, పొగరాని పొగాకు ఉత్పత్తుల వాడకం విపరీతంగా పెంచేశారట. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవల దీనిపై ఓ నివేదిక వెల్లడించింది. హైస్కూళ్లలో ఉన్న సీనియర్ పిల్లల్లో ప్రతి ఐదుగురిలో కనీసం ఒకరు హుక్కా పీలుస్తున్నారని అందులో తెలిపారు.
ఆర్థికంగా, సామాజికంగా కాస్త ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్లు మరింత ఎక్కువగా వీటిబారిన పడుతున్నారని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జోసెఫ్ జె. పలమార్ తెలిపారు. అలాగే, బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నవాళ్లు కూడా హుక్కాలు తెగ పీలుస్తున్నారట. నగరాలు.. అందునా పెద్ద నగరాల్లో హుక్కా కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. మొత్తం అమెరికాలోని 48 రాష్ట్రాల్లో గల 130 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హుక్కా అలవాటుపై సర్వే చేశారు. గతంతో పోలిస్తే, దీని వాడకం అమెరికాలో 123 శాతం పెరిగిందట!!