Hookah
-
డ్రైవింగ్ చేస్తూ.. అదేం పని..!
న్యూఢిల్లీ: హర్యానా రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ డ్రైవర్ కులాసాగా హుక్కా తాగుతూ.. పక్కాగా దొరికిపోయాడు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో ఢిల్లీ ప్రభుత్వం హర్యానా రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ డ్రైవర్ ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. ఆ వివరాలిలా... హర్యానా రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సు (నెంబర్ హెచ్ఆర్ డబ్ల్యూ 9038) ఢిల్లీకి బయలుదేరింది. ఆ బస్సు డ్రైవర్ ఉల్లాసంగా హుక్కా పీలుస్తూ బస్సు నడిపాడు. కారులో వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఒకరు డ్రైవర్ నిర్వాకాన్ని వీడియో తీసి ఢిల్లీ చేరుకున్నాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా, అదే బస్సులోని టీవీలో పటాకా బీడీ అనుబంధంగా ఉన్న పటాకా టీ ప్రకటన కూడా ప్రసారమయింది. ఈ రెండు ఘటనలు పొగతాగేలా చిన్నారులు, మహిళలను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ ఢిల్లీ అధికారులు ఫిర్యాదు చేశారు. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన ఆ డ్రైవర్‌పైనా, పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రకటనలు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. -
స్థితప్రజ్ఞానందం!
కథానీతి ఒకసారి శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులలో ఒకరైన శారదానందస్వామి, కోల్‌కతా నివాసి అయిన డాక్టర్ కంజిలాల్తో కలసి పడవలో మఠానికి వెళ్తున్నారు. గంగానది మధ్యలో ఉండగా పెనుతుఫాన్ గాలులు వీచి, పడవ తీవ్రంగా అటూ ఇటూ ఊగసాగింది. దాంతో డాక్టర్ కంజిలాల్ విపరీతంగా భయభ్రాంతుడయ్యాడు. అటువంటి క్లిష్టపరిస్థితులలో కూడా ప్రశాంతంగా హుక్కా తాగుతున్న శారదానందస్వామిపై ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంతో స్వామి తాగుతున్న హుక్కాను లాక్కున్నాడు. చటుక్కున దాన్ని నదిలోకి విసిరేసి, ‘‘అరె, మీరెంతటి వింతమనిషి! పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటే, మీరేమో ఆనందంగా పొగ తాగుతున్నారా?’’ అన్నాడు తీక్షణంగా. అతడి మాటలకు చిన్నగా నవ్వుతూ, ‘‘పడవ మునిగిపోయే ముందరే నీటిలోకి దూకడం తెలివైన పనేనంటావా డాక్టర్?’’ అన్నారు శారదానంద స్వామి. ప్రాణభయంతో తల్లడిల్లుతున్న కంజిలాల్ మాట్లాడలేదు. గంగానదిలో తనకు మృత్యువు రాసిపెట్టి ఉందనుకున్నాడు. అతడికి దుఃఖం ముంచుకు రాసాగింది. ఇంతలో వారు ఊహించని విధంగా స్వల్పసమయంలోనే తుఫాను గాలుల వేగం తగ్గిపోయింది. పడవ క్షేమంగా బేలూరు పట్టణానికి చేరింది. డాక్టర్ కంజిలాల్ పడవ దిగుతూనే, ‘‘స్వామీ! దుఃఖములందు కలతనొందని మనస్సు గలవాడు, సుఖములందు ఆసక్తిలేనివాడు, అనురాగం, భయం, క్రోధం తొలగినవాడు ‘స్థితప్రజ్ఞుడు’ అని పేరొందుతాడని కృష్ణపరమాత్మ ఎందుకు చెప్పాడో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. స్థితప్రజ్ఞులైన మీకు నా జోహార్లు!’’ అంటూ శారదానందస్వామికి శిరస్సు వంచి నమస్కరించాడు. – చోడిశెట్టి శ్రీనివాసరావు -
హీరోయిన్ సోదరుడిపై కేసు
పూణె: అక్రమంగా హుక్కాను సరఫరా చేస్తున్నందుకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్ధ్ చోప్రాపై కేసు నమోదయింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ అయిన సిద్ధార్ధ్ చోప్రా పూణేలోని కారేగావ్ పార్క్ సెంటర్ లో 'ద మగ్ షాట్ లాంజ్' పేరుతో ఓ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. నో స్మోకింగ్ జోన్లో పొగాకు విరివిగా వాడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో బుధవారం రాత్రి సదరు రెస్టారెంట్‌పై పోలీసులు దాడి చేయగా.. అనుమతి లేకుండా హుక్కాను వినియోగిస్తున్నట్లు బయటపడింది. దీనిపై డీసీపీ పీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. 'ద మగ్ షాట్ లాంజ్' యజమాని అయిన సిద్ధార్ధ్ చోప్రా(26)పై, అలాగే రెస్టారెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రకాష్ చౌదరి(24)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. హుక్కా పరికరాలను, పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఇదే రెస్టారెంట్లో మే నెలలో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు పాల్పడినందుకుగాను 10మందిని పూణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అమెరికా యువతకూ హుక్కా జబ్బు!
అమెరికాలో సిగరెట్ల వాడకం ఇటీవలి కాలంలో బాగా తగ్గింది. అయితే.. అందుకు సంతోషించాలో, హుక్కా వాడకం పెరుగుతున్నందుకు ఏడవాలో అర్థం కావట్లేదు. ఆ దేశంలో ఇప్పుడు చాలామంది హైస్కూలు పిల్లలు హుక్కా, చుట్టలు, పొగరాని పొగాకు ఉత్పత్తుల వాడకం విపరీతంగా పెంచేశారట. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవల దీనిపై ఓ నివేదిక వెల్లడించింది. హైస్కూళ్లలో ఉన్న సీనియర్ పిల్లల్లో ప్రతి ఐదుగురిలో కనీసం ఒకరు హుక్కా పీలుస్తున్నారని అందులో తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా కాస్త ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్లు మరింత ఎక్కువగా వీటిబారిన పడుతున్నారని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జోసెఫ్ జె. పలమార్ తెలిపారు. అలాగే, బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నవాళ్లు కూడా హుక్కాలు తెగ పీలుస్తున్నారట. నగరాలు.. అందునా పెద్ద నగరాల్లో హుక్కా కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. మొత్తం అమెరికాలోని 48 రాష్ట్రాల్లో గల 130 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హుక్కా అలవాటుపై సర్వే చేశారు. గతంతో పోలిస్తే, దీని వాడకం అమెరికాలో 123 శాతం పెరిగిందట!!