అన్నారం టు అమెరికా
లక్ష డాలర్ల వార్షిక వేతనంతో కొలువుదీరిన
తెలుగు యువకుడు సృజన్ రెడ్డి సక్సెస్ అబ్రాడ్
అమెరికాలో ఉన్నత విద్య అవకాశం లభించడం ఎంతో కష్టం. సుదీర్ఘ నిరీక్షణ.. అనేక నిబంధనలు.. టెస్టుల్లో స్కోర్స్. ఆ యువకుడు వాటన్నింటినీ అధిగమించాడు. అమెరికా యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌తో అడ్మిషన్ సొంతం చేసుకున్నాడు. ఎంఎస్ పూర్తి చేశాక అక్కడే ప్రముఖ రిటైల్ సంస్థ ‘టార్గెట్’లో లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించుకున్నాడు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి యూఎస్‌లో ఉన్నత విద్య కోసం అడుగుపెట్టి.. అక్కడే సొంతగా ఉద్యోగాన్వేషణ సాగించి.. విజయం సాధించిన తెలుగు యువకుడు సృజన్ రెడ్డి సక్సెస్ స్టోరీ.
మా స్వస్థలం కామారెడ్డి జిల్లాలోని అన్నారం. మాకున్న కొద్దిపాటి భూమిలో నాన్న దేవేందర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ జ్యోత్స్న గృహిణి. పదో తరగతి వరకు సిద్దిపేటలోనే చదువుకున్నా. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ఎంసెట్ ర్యాంకుతో హైదరాబాద్‌లోనే ఓ సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేశా. నా చదువు పరంగా అమ్మానాన్న ఎంతో సహకరించారు.
బీటెక్ నుంచే యూఎస్ కల
బీటెక్‌లో చేరినప్పటి నుంచే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని కలలు కన్నా. బాగా చదువుకొని అక్కడే స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఆ దిశగా ముందస్తుగానే జీఆర్‌ఈకి ప్రిపరేషన్ ప్రారంభించా. దాంతో మంచి స్కోర్ లభించింది. అమెరికాలోని యూనివర్సిటీలకు ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు దరఖాస్తు చేశా. యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్, నార్త్‌వెస్ట్ మిస్సోరి స్టేట్ యూనివర్సిటీ, క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారైంది.
స్కాలర్‌షిప్‌తో అడుగు
యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ 60 శాతం స్కాలర్‌షిప్‌తో ఆఫర్ ఇవ్వడంతో అందులో చేరాను. ఈ విశ్వవిద్యాలయం అకడమిక్ ట్రాక్ రికార్డ్ బాగున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను మంజూరు చేస్తుంది. నా స్కోర్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఫీజులో 60 శాతం స్కాలర్‌షిప్ అందించింది. 2013 ఫాల్ సెషన్‌లో ఎంఎస్–కంప్యూటర్ సైన్స్‌లో చేరాను.
ఇబ్బందులు సహజం
అమెరికాలోని ఏ యూనివర్సిటీ క్యాంపస్‌ను చూసినా.. ప్రపంచంలోని భిన్న దేశాలకు, విభిన్న సంస్కృతులకు చెందిన విద్యార్థులు కనిపిస్తారు. కాబట్టి ప్రారంభంలో ఎవరికైనా అక్కడి పరిస్థితుల్లో ఇమిడిపోయే విషయంలో కొంత ఇబ్బంది ఎదురవడం సహజమే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. కొత్త ప్రదేశం.. మనవాళ్లతో కలిసి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇండియన్ స్టూడెంట్స్‌తోనే ఇంటరాక్షన్‌కు ఎక్కువ మంది ప్రయత్నిస్తారు. ఇది సరికాదు. ఇతర దేశాలకు చెందిన వారితోనూ మాట్లాడాలి. అలాగే క్యాంపస్‌కే పరిమితం కాకుండా వీలైన సమయంలో బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టి స్థానిక సంస్కృతి, జీవనశైలిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా భవిష్యత్‌లోæజాబ్ మార్కెట్ కోణంలో వాస్తవంగా పరిస్థితులపై అవగాహన వస్తుంది.
ఉద్యోగాన్వేషణ.. స్వయంగానే
ఎంఎస్ పూర్తవుతూనే ఉద్యోగాన్వేషణలో పడ్డాను. వాస్తవానికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ జరుగుతాయి. కానీ అక్కడికి వచ్చే కంపెనీలు స్థానికుల (అమెరికన్ల)కే ప్రాధాన్యమిస్తాయి. ఇతర దేశాల విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ లభించడం చాలా అరుదు. దీంతో నేను కోర్సు చివరి సెమిస్టర్ నుంచే ఉద్యోగం కోసం స్వీయ అన్వేషణ సాగించాను. ఇందుకోసం ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డిన్, స్థానిక కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేశాను.
‘టార్గెట్’లో కొలువు.. లక్ష డాలర్ల వేతనం
కన్సల్టింగ్ సంస్థల ద్వారా అమెరికాలోని ప్రముఖ కామర్స్ అండ్ రిటైల్ సంస్థ టార్గెట్ కార్పొరేషన్‌లో సీనియర్ డేటా ఇంజనీర్‌గా 2016 జనవరిలో ఉద్యోగం లభించింది. ప్రస్తుతం లక్ష డాలర్ల వార్షిక వేతనంతోపాటు పెయిడ్ లీవ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అదనపు భత్యాలు అందుతున్నాయి.. హడూప్, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్‌కు సంబంధించిన విధులు నిర్వహిస్తున్నాను. తెలంగాణలోని ఓ చిన్న గ్రామం నుంచి అమెరికాలో అడుగుపెట్టడం.. అంతేకాకుండా ఫార్చూన్–500 జాబితాలోని కంపెనీలో కొలువు సొంతం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిన సంఘటనలు.
డేటాసైన్స్‌లో ఎంబీఏ
ప్రస్తుతం సీనియర్ డేటా ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. ఈ విభాగంలోనే ఉన్నత హోదాలు అందుకునేందుకు మార్గం కల్పించే డేటా సైన్స్‌లో ఎంబీఏ చదవాలనేది నా తదుపరి లక్ష్యం. ఇప్పుడు కంపెనీ లన్నీ డేటా అనలిటిక్స్ ఆధారంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉద్యోగులకు కూడా ఆ నైపుణ్యాలు ఉండాలని కోరుకుంటున్నాయి.
ముందస్తు ప్రణాళికతో
ఉన్నత విద్య పరంగా అమెరికాను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు.. ముందస్తు ప్రణాళికతో జాగ్రత్తగా వ్యవహరించాలి. యూనివర్సిటీల అన్వేషణ పరంగా కేవలం కన్సల్టెన్సీలపైనే ఆధారపడకుండా.. స్వయంగా తాము లక్ష్యంగా నిర్దేశించుకున్న కోర్సు, యూనివర్సిటీల గురించి అన్వేషణ సాగించాలి. వాటి అర్హత ప్రమాణాలను తెలుసుకుని వాటిని అందుకునేలా బీటెక్ నుంచే కృషి చేయాలి.
అప్‌డేట్ అయితేనే
అమెరికాలో విద్యా విధానం బాగుంటుందని, కరిక్యులం పరంగా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతాయని చాలామంది విద్యార్థులు భావిస్తారు. అయితే అమెరికాలోనూ కెరీర్ పరంగా రాణించేందుకు సెల్ఫ్ అప్‌డేట్ ఎంతో అవసరం. అంతేకాకుండా ప్రొఫెసర్లు, సీనియర్లతో నిరంతరం సంప్రదిస్తుండాలి. ఫలితంగా స్థానికంగా ఉన్న ఉద్యోగావకాశాల గురించి, వాటిని అందుకోవడానికి గల మార్గాల గురించి తెలుస్తుంది. అడుగుపెట్టినప్పటి నుంచి వ్యక్తిగతంగా, అకడమిక్‌గా, సామాజికంగా వినూత్న దృక్పథంతో వ్యవహరిస్తే కోర్సు పూర్తయ్యాక ఇక్కడే కొలువుదీరే అవకాశాలు ఎన్నో!!