గోదారి తీరాన ‘ఆదిమ’ జాడలు | Three thousand-year-old traces of human history in Bhupalapalli | Sakshi
Sakshi News home page

గోదారి తీరాన ‘ఆదిమ’ జాడలు

Published Mon, Dec 19 2016 2:37 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

గోదారి తీరాన ‘ఆదిమ’ జాడలు

గోదారి తీరాన ‘ఆదిమ’ జాడలు

- గోదావరి తీరం వెంట మూడు వేల ఏళ్లనాటి మానవ చరిత్ర జాడలు
- ఖమ్మం, భూపాలపల్లి అడవుల్లో అద్భుత నిర్మాణాలు
- ఒకేచోట వేల సంఖ్యలో సమాధులు
- గుట్టువిప్పేందుకు ముందుకొచ్చిన అమెరికా వర్సిటీ


 సాక్షి, హైదరాబాద్‌/ భూపాలపల్లి 
పది అడుగుల ఎత్తున్న రాతి పలకాలతో చుట్టూ గోడ.. పదిహేను నుంచి ఇరవై అడుగుల వెడల్పు, అడుగు మందంతో రాతి పైకప్పు.. దానికి చిన్న ద్వారం.. లోపల పదడుగుల వెడల్పు, అంతే పొడవుండే గండ శిలతో చెక్కిన తొట్టిలాంటి ఆకృతి. దానికి రాతి మూత.. దాని బయట అస్పష్టమైన మానవాకృతితో గండశిలలు.. ఆ ప్రాంగణం చుట్టూ భారీ శిలలు..! అలాంటివి ఒకటి కాదు రెండు కాదు.. వందలు... వేలు... దట్టమైన అడవిలో ఆశ్చర్యం కలిగించే నిర్మాణాలు! ఇంతకూ ఏంటవి..?? ఎవరు నిర్మించారు.. ఎక్కడున్నాయి?

రాతి తొట్టిలో ఎముకలు కనిపించటంతో అవి సమాధులని, ఆదిమానవుల కాలానివని దాదా పు వందేళ్ల క్రితమే తేల్చారు. కానీ అవి ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న నిర్మాణాలని అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగో విశ్వవిద్యాలయం గుర్తించింది. వీటిపై అధ్యయనానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందానికి ఆసక్తిగా ఉంది. ఇంతకూ ఆ నిర్మాణాలు ఎక్కడున్నాయో తెలుసా? భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల పరిధిలోని గోదావరి నదీతీరం వెంట!

వారంతా వలస వచ్చినవారా?
గోదావరి తీరం వెంట భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లోని తాడ్వాయి, దామరవాయి, జానంపేట, దొంగలతోవు, సింగారం, గంగారం, కాచనపల్లి, గలబ, గుండాల... అటవీప్రాంతాల్లో వేల సంఖ్యలో సమాధులున్నాయి. వీటిని ఎవరు నిర్మించారన్నది ఇప్పటివరకు మిస్టరీగా ఉంది. తాజాగా సీసీఎంబీ నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో వారు వలస జీవులని తేలింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ ఆచార్యులు కేపీరావు ఆధ్వర్యంలో సర్వే జరిగిన సమయంలో సీసీఎంబీ.. ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఈ సమాధుల్లోని ఎముకల డీఎన్‌ఏను పరీక్షించిం ది. అది స్థానికుల డీఎన్‌ఏతో సరిపోలలేదు. దీంతో వలస వచ్చినవారు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటారని భావించారు.

దీన్ని రూఢీ చేసుకోవాలంటే ఈ సమాధులు విస్తరించిన ఇతర ప్రాంతాల్లో కూడా డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి తేల్చాలని సీసీఎంబీ భావిస్తోంది. దానికంటే ముందు వీటి గుట్టు విప్పేందుకు  కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగో విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ప్రపంచంలో మరెక్కడా లేని సంఖ్య లో.. ఆకృతిలో భిన్నంగా ఉన్న ఈ నిర్మాణాల వెనక బలమైన చరిత్ర ఉందని ఆ వర్సిటీ భావిస్తోంది. తాజాగా ఆ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ థామస్‌ లెవీ వాటిని  పరిశీలించారు. వీటి గుట్టు విప్పేందుకు తెలంగాణ పురావస్తు శాఖ ముందు ప్రతిపాదన ఉంచారు.

పశువుల కొట్టాల్లోకి తొట్లు: సమాధుల్లో రాతి తొట్లను స్థానికులు కొందరు అక్రమంగా ఇళ్లకు తరలించి పశువుల కొట్టాల్లో తొట్లుగా వాడుతున్నారు. వాటిపై అవగాహన లేకపోవటంతో అత్యంత అరుదైన సంపద ధ్వంసంఅవుతోంది.

ఆ నిర్మాణాల్లో ఎన్నో ప్రత్యేకతలు
సాధారణంగా సమాధులు భూమి లోపల నిక్షిప్తమై ఉంటాయి. వాటికి గుర్తుగా పైన గండ శిలలను వృత్తాకారంలో పాతటం నాటి అలవాటు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా భూమి ఉపరితలంలోనే రాతి పలకలతో గుడారం తరహా నిర్మాణం ఉంది. సమాధుల ముందు అస్పష్టమైన మానవాకృతి రాళ్లు పాతి ఉన్నాయి. మగవారి ఆకృతి ఉన్న రాళ్లు క్రెస్తవ శిలువ ఆకృతిని పోలి ఉన్నాయి. కానీ అది క్రెస్తవంతో సంబంధం లేదని సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పుల్లారావు తెలిపారు. మహిళా రూపం అయితే శిలలపై స్థనభాగం రూపొందించి ఉంది. ఇలాంటి ఆకృతులు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి.

గతంలో ఈ నిర్మాణాలపై పలుమార్లు పరిశోధన జరిగినా 1982లో పురావస్తు అధికారి రామకృష్ణ వీటిని పరిశీలించి రిపోర్టు రూపొందించారు. 1991లో పురావస్తు అధికారులు రంగాచారి, గోవిందరెడ్డిలు పరిశీలించి వీటిలోని తొట్టి తదితర వివరాలను బహిర్గతం చేశారు. స్వాతంత్య్రానంతరం తొలి మెరుగైన అధ్యయనం ఇదే. 2000లో ప్రొఫెసర్‌ పుల్లారావు బృందం మరికాస్త పరిశోధించి వీటి ప్రాధాన్యాన్ని ప్రపంచానికి వెల్లడించింది. వీరి ఆధ్వర్యం లోనే ఇటీవల డీఎన్‌ఏ పరీక్షలు జరిగాయి.

యునెస్కో గుర్తింపు అర్హత ఉంది: పురావస్తుశాఖ డైరెక్టర్‌
ఈ సమాధులు అరుదైనవి, అద్భు తమైనవి. శాన్‌ డియాగో విశ్వవిద్యాల యం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి పరిశోధనలు చేయాలనే విష యంలో మేం ప్రణాళిక రూపొందిస్తాం. ఇన్ని వేల సంఖ్యలో మరెక్కడా సమా ధులు లేవు. వాటి గుట్టువిప్పి ప్రపంచం ముందు పెడితే తెలంగాణకు తొలి యునెస్కో గుర్తింపు రావటం ఖాయం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement