అప్పులు... అవస్థలు | Trump adviser Stephen Miller itself the Mastermind of fake university | Sakshi
Sakshi News home page

అప్పులు... అవస్థలు

Published Sun, Feb 10 2019 3:20 AM | Last Updated on Sun, Feb 10 2019 5:15 AM

Trump adviser Stephen Miller itself the Mastermind of fake university - Sakshi

ప్రతీకాత్మక చిత్రం..

అమెరికాలోని కాలిఫోర్నియా రాజధాని శాక్రిమెంటోలో అదొక పేయింగ్‌ గెస్ట్‌ అకామిడేషన్‌. వీసా దుర్వినియోగం కేసులో అరెస్టయిన సరిత (పేరు మార్చాం) అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఆమెపై నమోదైన కేసు విచారణ మార్చి 14 వరకు వాయిదా పడటంతో ఆ నాలుగ్గోడల మధ్యే కాలం గడపాల్సిన పరిస్థితి. కాళ్లకు రేడియో ట్రాకర్‌లతో ఎటూ వెళ్లలేక, భవిష్యత్‌ అంధకారంగా మారడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. చేతిలో ఉన్న డాలర్లతోనే ఆమె ఈ నెలన్నర గడపాలి. చుట్టుపక్క లున్న భారతీయ కుటుంబాలు దయ చూపితే కడుపు నిండుతుంది. లేదంటే లేదు.

భవిష్యత్‌పై కోటి కలలతో అమెరికా వచ్చిన సరిత హోంల్యాండ్‌ సెక్యూరిటీ పన్నిన వలలో చిక్కుకొని ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీలో చేరింది. ‘‘హఠాత్తుగా ఒకరోజు ఉదయం 6.30కే పోలీసులు వచ్చి నన్ను లేపారు. రెండు గంటలసేపు ప్రశ్నించారు. నా కాళ్లకు రేడియో ట్యాగ్‌ వేసి ఎటూ కదలొద్దని ఆదేశించారు. ప్రతి గురువారం కాలిఫోర్నియా పోలీసు స్టేషన్‌కు హాజరుకావాలంటూ హుకుం జారీ చేశారు. నాకు ఇక్కడ స్నేహితులు, బంధువులెవరూ లేరు. ఏం చేయాలో అర్థంకాని స్థితి’’అంటూ కన్నీరుమున్నీరైంది. అమెరికాలో ఉన్నత విద్య కోసం సరిత తండ్రి రూ. 20 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కోర్టు కేసులు, లాయర్ల ఫీజులకు మరో రూ. 20 లక్షల వరకు ఖర్చు కానుంది. ఒక మధ్య తరగతి కుటుంబంపై మోయలేని 40 లక్షల అప్పు భారం పడింది.

అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి ట్రంప్‌ సర్కార్‌ పన్నిన ‘ఉచ్చు’లో చిక్కుకున్న సరిత లాంటి భారతీయ విద్యార్థులు ప్రత్యేకించి తెలుగువారు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చేతిలో పెద్దగా డబ్బు లేక, అధికారుల నిర్బంధం నుంచి బయటపడే మార్గం తెలియక లబోదిబోమం టున్నారు. అమెరికా హోంల్యాండ్‌ అధికారులు మొత్తం 130 మంది విద్యార్థుల్ని అరెస్ట్‌ చేయగా వారిలో 129 మంది విద్యార్థులు భారతీయులే. అందులోనూ తెలుగువారే 80 శాతం మంది ఉన్నారు. ఈ విద్యార్థుల్లో ఇప్పటికే 10 మందికి బెయిల్‌ వచ్చి భారత్‌కు తిరిగి వచ్చారు. మరో ఆరుగురికి కూడా బెయిల్‌ వచ్చింది. ఏ క్షణమైనా వారు భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి. కానీ సరితలాంటి అమాయకులు ఇంకా చాలా మంది కాళ్లకు ట్రాకర్లతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు.

న్యాయమూర్తుల కొరతతో విచారణలో ఆలస్యం...
షికాగో, న్యూజెర్సీ, న్యూయార్క్, డెట్రాయిట్, డాలస్‌లలోని డిటెన్షన్‌ సెంటర్‌లలో ప్రస్తుతం విద్యార్థులు ఉన్నారు. భారతీయ దౌత్య కార్యాలయం, వివిధ తెలుగు సంఘాలు విద్యార్థుల్ని ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆచరణలో న్యాయపరమైన చిక్కులెన్నో ఎదురవుతున్నాయి. అమెరికా లాంటి అతిపెద్ద దేశంలో ఒక రాష్ట్రానికి మరో రాష్టానికి న్యాయపరమైన నిబంధనలు మారిపోతాయి. దీంతో వారి విడుదల కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం సాధ్యం కావడం లేదు. అదీకాక అమెరికావ్యాప్తంగా న్యాయవ్యవస్థ సంక్షోభంలో ఉంది. న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉంది. అందుకే విద్యార్థులకు బెయిల్‌ మంజూరు చేయడం ఆలస్యమవుతోంది. దీంతో విద్యార్థులు పదేళ్లపాటు అమెరికాలో అడుగు పెట్టకుండా ఆదేశాలు జారీ అవుతున్నాయి.

సూత్రధారి స్టీఫెన్‌ మిల్లర్‌? 
వీసాలు దుర్వినియోగం చేస్తున్న విదేశీ విద్యార్థుల్ని వల వేసి పట్టుకోవాలని తెరవెనుక నుంచి ఆదేశాలు ఇచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు స్టీఫెన్‌ మిల్లరేనని వార్తలు వస్తున్నాయి. 33 ఏళ్ల వయసున్న మిల్లర్‌ది కరకు గుండె. ఎంతటి కఠిన నిర్ణయాలనైనా అమలు చేయగలరు. తీరూతెన్ను లేని వలస విధానాన్ని ఆయన రూపొందించారు. వలసదారులందరూ క్రిమినల్స్‌ అనేది ఆయన అభిప్రాయం. వారి నుంచి అమెరికన్లను కాపాడతానంటూ పదేపదే ప్రకటనలు కూడా ఇచ్చారు. శరణార్థులెవరూ అమెరికా గడ్డపై అడుగు పెట్టకుండా చేస్తానంటూ శపథం చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారినందరినీ హుటాహుటిన నిర్బంధించి దేశం నుంచి పంపించేయాలంటూ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల్ని, హెచ్‌1బీ వీసా దారుల్ని నిర్బంధించడానికి ఆయన ఏకంగా 22 తప్పుడు మార్గాలకు వ్యూహరచన చేశారంటేనే మిల్లర్‌ వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది.

మరిన్ని ఆపరేషన్లకు ట్రంప్‌ సర్కార్‌ సన్నాహాలు?
అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మరిన్ని రహస్య ఆపరేషన్లకు సిద్ధమవుతోందని ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) ఉపాధ్యక్షుడు రవి వేమూరి వెల్లడించారు. ఏదైనా యూనివర్సిటీలో చేరే ముందు వర్సిటీ మంచి చెడులపై పూర్తి వివరాలు కనుక్కున్నాక చేరాలని విద్యార్థులకు హితవు పలికారు. మరోవైపు అమెరికా హోంల్యాండ్‌ అధికారులు నకిలీ యూనివర్సిటీని స్థాపించి భారతీయ విద్యార్థుల్ని తప్పుదోవ పట్టించడం ముమ్మూటికీ ప్రభుత్వం తప్పిదమేనని భారత సంతతికి చెందిన న్యాయవాది అను పెషవారియా విమర్శించారు. అమెరికా ప్రభుత్వం చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌ వల్ల వందలాది మంది యువతీ యువకుల భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులతో యూనివర్సిటీల ఆటలు...
అమెరికాలో ఎన్నో అసలైన యూనివర్సిటీలు కూడా విదేశీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుం టున్నాయి. అమెరికాలో ఉద్యోగం చేయడానికి వీలు కల్పించే హెచ్‌1బీ వీసా మంజూరు లాటరీ విధానంలో జరుగుతుంది. కాబట్టి అది వస్తుందో రాదో ఎవరూ చెప్పలేని స్థితి. అందుకే చాలా యూనివర్సిటీలు తమ విద్యార్థులుగా ఉంటూ విద్యార్థి వీసాతో ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటి) ద్వారా వారానికి 40 గంటలు పనిచేయడానికి వీలు కల్పిస్తున్నాయి. అలా ఉద్యోగం చేసే విద్యార్థుల జీతంలో కొంత భాగం ఇవ్వాలంటూ బేరాలు సాగిస్తాయి. అమెరికాలో నివసించాలంటే పే చేయాలంటూ షర తులు విధిస్తాయి. మెరుగైన జీవితం వస్తుందన్న ఆశ, అమెరికాలో చదువు అంటే భారత్‌లో వచ్చే హోదా కోసం మన విద్యార్థులు కూడా ఆ యూనివర్సిటీల వలలో చిక్కుకుంటున్నారు. హెచ్‌1బీ రాని విద్యార్థులను ఈ తరహా యూనివర్సిటీల్లో చేరాలంటూ ఇమ్మిగ్రేషన్‌ లాయర్లు కూడా సలహాలివ్వడం గమనార్హం.

మన విద్యార్థుల నుంచి వర్సిటీలకు భారీ ఆదాయం
అమెరికా యూనివర్సిటీలకు వచ్చే ఆదా యంలో సింహభాగం భారతీయ విద్యార్థుల నుంచే వస్తుంది. అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో 2018లో 1.86 లక్షల మంది భారతీయ విద్యార్థులు చేరారు. అమెరి కాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత స్థానం మనదే. విదేశీ విద్యార్థుల నుంచి అమెరికా యూనివర్సిటీలు ఏటా అత్యధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తాయి. వారి నుంచి ఫీజుల రూపంలో 3,900 కోట్ల డాలర్ల (రూ. 2.77 లక్షల కోట్లు) వరకు ఆదాయం వస్తోంది. కానీ ట్రంప్‌ సర్కారే స్వయంగా విదేశీ విద్యార్థులను వల వేసి పట్టుకోవడం వంటి చర్యలతో ఎందరో విద్యార్థులు భయాందోళనకు లోనవుతు న్నారు. కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లిపోతు న్నారు. దీనివల్ల ఆర్థికంగా అమెరికాకు నష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement