447 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా
Published Wed, Oct 2 2013 2:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఏయూలో శాశ్వత ప్రాతిపదికన ఆచార్యుల నియామకానికి మార్గం సుగమమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ మేరకు సోమవారం జీఓను విడుదల చేసింది. గతంలో వర్సిటీ అధికారులు ఇక్కడి నియామకాలకు సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. దీనిని ఆమోదిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నియామకాలకు ఆమోదం లభించింది. చాలా కాలంగా వర్సిటీలో అధ్యాపక నియామకాలు జరగకపోవడంతో అత్యధిక శాతం విభాగాలు ఖాళీ అయ్యాయి. కేవలం ఒకరిద్దరు ఆచార్యులతో నడుపుతున్న విభాగాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంజూరు చేసిన 447 ఖాళీలు భర్తీ చేస్తే వర్సిటీకి ఆచార్యుల కొరత కొంత వరకు తీరుతుంది. కానీ నియామకాలు ఎంత మేరకు పారదర్శకంగా జరుగుతాయో చూడాలి.
రూ.100 కోట్లు కావాలి
కొత్తగా మంజూరైన ఉద్యోగాలు భర్తీ చేయాలంటే వర్సిటీకి అదనంగా రూ. వంద కోట్లు అవసరం. ఇంతటి భారాన్ని ప్రస్తుతం వర్సిటీ భరించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఉద్యోగాల భర్తీ జరుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మంజూరు చేసిన 119 ప్రొఫెసర్, 200 అసిస్టెంట్ ప్రొఫెసర్, 128 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తే వేతనాలకు ఏడాదికి సరాసరి రూ.90 కోట్లు నుంచి రూ.100 కోట్లు వరకు ఖర్చవుతుంది. దీనిని ఎవరు భరించాలన్నది ప్రస్తుతం అధికారుల ముందున్న సవాలు. ఈ భారాన్ని వర్సిటీ భరించే అవకాశం లేనందున ప్రభుత్వానికి విన్నవించాలని అధికారులు భావిస్తున్నారు. వర్సిటీకి అదనంగా మరో రూ.100 కోట్లు బ్లాక్‌గ్రాంట్ రూపంలో అడగాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం ఏ మేరకు సానుకూలంగా స్పందిస్తుందనే విషయంపైనే నియామక ప్రక్రియ ఆధారపడి ఉంటుంది.
లోటుతో నడిచేదెలా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వర్సిటీ బడ్జెట్ రూ.269 కోట్లుగా నిర్ణయించారు. దీనిలో రూ.130 కోట్లు ఇప్పటికే ప్రభుత్వ బ్లాక్ గ్రాంట్ రూపంలో ఇస్తోంది. వర్సిటీ అంతర్గత ఆదాయంగా రూ.90 కోట్లు వరకు సమకూరుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిలో మరో రూ.15 కోట్లు ఆదాయం తగ్గనుంది. ఉభయగోదావరి జిల్లాల్లోని కళాశాలలు నన్నయ వర్సిటీకి తరలడంతో ఆదాయం తగ్గిపోనుంది. ప్రస్తుతం వర్సిటీ రూ.40 కోట్లు లోటు బడ్జెట్‌లో నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త పోస్టులు భర్తీ చేస్తే జీతాలు చెల్లించే పరిస్థితి వర్సిటీలో లేదు. దీంతో కేవలం ప్రభుత్వం బ్లాక్‌గ్రాంట్ రూపంలో మరో రూ.100 కోట్లు అందిస్తేనే ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం రావడంతో నిరుద్యోగులు, ఆశావహులు ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు.
నిధులు కావాలని ముఖ్యమంత్రిని కోరతాం
నియామకాలు చేయడానికి వర్సిటీ సిద్ధంగా ఉంది. వేతనాలు చెల్లించడానికి వర్సిటీ వద్ద నిధులు లేవు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తాం. బ్లాక్ గ్రాంట్ మరో రూ.100 కోట్లు మంజూరు చేయాలని కోరతాం. త్వరలో అన్ని సమస్యలు పరిష్కరించుకుని నియామకాలు జరుపుతాం.
- ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ఏయూ వీసీ
Advertisement
Advertisement