మద్దూరు జరిగిన సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్, పక్కన ఎంపీలు, మంత్రి తదితరులు
సాక్షి, మద్దూరు (కొడంగల్):‘పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 1.26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ భావించారు.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ పథకాన్ని అడ్డుకోవడానికి కేంద్రానికి లేఖలు రాస్తున్నాడు. ఇక కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసుల ద్వారా అడ్డుతగుతున్నారు.. ఇప్పుడు వీరిద్దరూ ఏకమై ఓట్ల అడగడానికి వస్తున్నారు.. జాగ్రత్తా! మన బతుకలను ఆగం చేసే కాంగ్రెస్, టీడీపీ నాయకులను తరిమి కొట్టండి..’ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బుధవారం రాత్రి ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. 14 ఏళ్ల సుదీర్ఘపోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల కోసం సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వకపోయినా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కళ్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ తదితర పథకాలను పెట్టారని వివరించారు.
గతంలో ఏం చేశారు?
చంద్రబాబు నాయుడు గతంలో పాలమూరును దత్తత తీసుకుని ఏం అభివృద్ధి చేశాడో ప్రజలకు తెలుసునని కేటీఆర్ అన్నారు. అయినా మళ్లీ మాయమాటలతో ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని జిల్లాలోని రెండు స్థానాల్లో బరిలోకి దిగారని విమర్శించారు. ఇక్కడి ప్రజల బతుకులను ఆగం చేసిన చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్‌ను ఓడించడానికి మహాకుటమిని ఏర్పాటుచేసుకున్న వారి సీట్ల కుంపటే ఇంకా ముగియలేదని ఎద్దేవా చేశారు. నామినేషన్ల పూర్తయినా వారి పంచాయతీ మాత్రం తెగడం లేదని.. ఆ పంచాయతీ తెగేలోగా టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి స్వీట్లు పంచుకోవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, తాము అధికారంలోకి ఉన్న నాలుగేళ్లలో 87వేల ప్రభుత్వా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 38 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది వాస్తవం కాదా, రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 700 గురుకులాలు ఏర్పాటుచేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ఇక తొమ్మిదేళ్ల పాటు రేవంత్‌రెడ్డికి అధికారం ఇచ్చిన కొడంగల్ ప్రజలు.. ఒక్కసారి పట్నం నరేందర్‌రెడ్డి గెలిపించి కారులో అసెంబ్లీకి పంపించాలని కోరారు. అలా చేస్తే కొడంగల్‌ను దత్తత తీసుకుని ఐదేళ్లలో సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఇక్కడి ప్రజలతో పాటు నరేందర్‌రెడ్డి అండగా ఉండి ఇన్నేళ్లు వివక్షకు గురైన కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు మేలు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాదికి సంక్షేమానికి రూ.42 వేల కోట్లు ఖర్చు చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటేనని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. 14 ఏళ్లు ఉద్యమించితెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ ప్రజల కష్టాలను తెలుసుకొని ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశవపెట్టిన రైతుబంధు, రైతు భీమా పథకానికి ఐక్యరాజ్యసమితి గుర్తించిన విషయం తెలిసిందే అన్నారు.
దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా కేసీఆర్ పథకాలపై చర్చ జరుగుతుందన్నారు. డిసెంబర్ 7న కారు గుర్తుకు ఓట్లు వేసి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఈ ప్రాంతానికి జూరాల ద్వారా నీళ్లు ఇవ్వాలని కోయిలకొండ రిజర్వాయర్‌ను ప్రతిపాదిస్తే ఇదే మండలంలోని బావాజీ ఆలయం దగ్గర సమావేశం నిర్వహించి రిజర్వాయర్‌ను రాకుండా చేసింది రేవంత్‌రెడి అని ఆరోపించారు.
కోయిలకొండలో రిజర్వాయర్ నిర్మాణం జరిగితే మద్దూరు మండలంలోని అన్ని బోర్లు రీచార్జ్ అయ్యేవన్నారు. ఇక్కడి ప్రజల కడుపు కొట్టి రూ.కోట్లు సంపాదించే రేవంత్‌రెడ్డిని ఓటు ద్వారా తరిమికొట్టాలని కోరారు. కొడంగల్ ఓటర్లు అమాయకులు కాదని.. తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేసి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి కేసీఆర్ ఆశీర్వాదంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ బండా ప్రకాష్, ఎంపీపీ సంగీతశివకుమార్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, నాయకులు సలీం, బాల్‌సింగ్‌నాయక్, జగదీశ్వర్‌రెడ్డి, వీరేష్‌గౌడ్, సతీష్‌ముదిరాజ్, పున్నంచంద్ లాహోటి, శివకుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment