బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ భేటీలు
లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చ
స్థానిక నేతలతో ఫోన్‌లో మాట్లాడుతూ దిశా నిర్దేశం
హోలీ తర్వాత మిగతా 6 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధ్య క్షుడు, మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో ప్రజల స్పందన, ప్రభుత్వ వ్యతిరేకత, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పనితీరు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. పలువురు నేతలు పార్టీని వీడటం ఈ భేటీల్లో ప్రస్తావనకు వస్తుండగా, పార్టీని అంటిపెట్టుకుని ఉండే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అధినేత భరోసా ఇస్తున్నారు.
జిల్లాల వారీగా భేటీలు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలతో పాటు జిల్లాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కేసీఆర్‌ను కలుస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో మిగతా ఆరు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. మెదక్, భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు.
నాగర్‌కర్నూలు నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేరు ఖరారు కాగా హైదరాబాద్ నుంచి కూడా బలమైన అభ్యర్థి బరిలోకి దిగుతారని బీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. మెదక్ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. భువనగిరి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, పైళ్ల శేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరు తెరమీదకు రాగా, దాసోజు శ్రవణ్ పేరు కూడా వినిపిస్తోంది. సోమవారం హోలీ పండుగ తర్వాత బీఆర్‌ఎస్ తుది జాబితా వెలువడే అవకాశముంది.
మంచి ఫలితాలు ఖాయం!
మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడిన చోట ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిర్పూరులో ఎమ్మెల్సీ దండె విఠల్, ముధోల్‌లో వేణుగోపాలచారి, హుజూర్‌నగర్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు ఎన్నికల సన్నాహాలను సమన్వయం చేస్తున్నారు. కింది స్థాయిలో స్థానికంగా చురుగ్గా ఉన్న కేడర్‌కు బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఆదేశించారు.
మరోవైపు జిల్లాల వారీగా ఫోన్ల ద్వారా కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ సర్వే ఏజెన్సీల నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందనే ధీమా కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్లు ఆయనను కలిసిన నేతలు చెప్తున్నారు.
మెదక్‌లో హరీశ్ పోటీ చేస్తారనే ప్రచారం
మాజీ మంత్రి హరీశ్‌రావు మెదక్ లోకక్‌భ బరిలో ఉంటారని సామాజిక మాధ్యమాల్లో గురువారం విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని, అలాంటి చర్చ పార్టీలో జరగడం లేదని హరీశ్ స్పష్టత ఇచ్చారు. మెదక్ ఎంపీ అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ రెండు మూడు రోజుల్లో పూర్తి స్పష్టత ఇస్తారంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.
కేసీఆర్‌తో సుదీర్ఘ భేటీ
ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో ఈ నెల 16న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న హరీశ్ గురువారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కవిత విచారణ సహా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను వివరించడంతో పాటు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీలోనే ఉన్న కేటీఆర్ శనివారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment