మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
మూడు విడతల్లో 11 మంది అభ్యర్థుల ఖరారు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు అవకాశం లభించింది. దీంతో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను 11 సీట్లకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ఖరారైంది.
నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాన్ని పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉండటంతో, మరో ఐదు స్థానా లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థు లను ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో హైదరాబాద్, సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి, మెదక్ ఉన్నాయి. కాంగ్రెస్ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 23న బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన చోట బహిరంగ సభలు, ప్రచార షెడ్యూల్‌పై స్థానికంగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
ఆదిలాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ
ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలతో నందినగర్ నివాసంలో గురువారం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కు పార్టీ అభ్యర్థన మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.
అయితే ఈ భేటీకి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి గైర్హాజరుపై కేసీఆర్ ప్రశ్నించగా, వ్యక్తిగత పనులతో రాలేకపోయినట్లు నిర్మల్ జిల్లా నేతలు వెల్లడించారు. అయితే ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి గైర్హాజరు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment