‘అమరజ్యోతి’ ఆవిష్కరణ సభలో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్, ప్రజలు
ఇక్కడ నివాళి అర్పించాకే..
రక్తపు చుక్క కారకుండా తెలంగాణ సాధించుకోవాలని అనుకున్నా.. నా ఆమరణ దీక్ష సందర్భంగా చోటు చేసుకున్న విచిత్ర మలుపులో విద్యార్థుల బలిదానాలు కలచివేశాయి. కేంద్రం కళ్లు తెరిచి తెలంగాణ ఇస్తుందనే భావనతో ప్రాణత్యాగం చేసిన వారికి వెలకట్టలేం. అంతటి త్యాగాలు చిరస్థాయిగా నిలిచేలా, అమరుల పేర్లు అందరి మదిలో నిలిచేలా ‘అమర జ్యోతి’ని నిర్మించాం. ఇకపై ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు అమరుల జ్యోతి వద్ద నివాళులు అర్పించాకే ఇతర కార్యక్రమాలు జరిగేలా ఆచారాన్ని పెట్టుకుంటాం.
– సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా నిలిచిపోయేలా, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల పేర్లు ఎల్లకాలం అందరి మదిలో నిలిచేలా ‘తెలంగాణ అమరుల స్మారకం’ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల ఫొటోలతో గ్యాలరీని ఏర్పాటు చేస్తామని, ఉద్యమ ప్రస్థాన చరిత్రను సమగ్రంగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మించిన ‘అమరజ్యోతి’ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధన ఉద్యమ ప్రస్థానాన్ని, తాను ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలను ప్రస్తావించారు. కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా దీపాలు చేతబూని అద్భుత రీతిలో అమరులకు నివాళి అర్పించాం. ఈ సందర్భంలో సంతోషం ఒకపాలు, విషాదం రెండు పాళ్లుగా ఉంది. రక్తపు చుక్క కారకుండా తెలంగాణ సాధించుకోవాలని అనుకున్నా.. నా ఆమరణ దీక్ష సందర్భంగా చోటు చేసుకున్న విచిత్ర మలుపులో విద్యార్థుల బలిదానాలు కలచివేశాయి. కేంద్రం కళ్లు తెరిచి తెలంగాణ ఇస్తుందనే భావనతో ప్రాణత్యాగం చేసిన వారికి వెలకట్టలేం. అందిన సమాచారం మేరకు ఆరేడు వందల మంది కుటుంబాలకు ఉద్యోగాలు, ఒక్కో ఇంటికి రూ.10లక్షలు, కొందరికి ఇళ్లు ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి మనం ఉదారంగా సాయం చేసుకోవచ్చు.
వెలుగులీనుతున్న అమరుల స్మారకం
కుట్రకోణాలతోనే అనేక బలిదానాలు
హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో విలీనం చేసే సమయంలో అనేక కుట్ర కోణాలు దాగి ఉండటంతో అనేక మంది బలయ్యారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో 1965, 66 సమయంలో ఖమ్మం జిల్లాలో మొదలైన పొలికేక 1967 నాటికి యూనివర్సిటీకి చేరింది. కేసులు, వేధింపులు, ఉద్యోగుల నుంచి తొలగింపు వంటివి జరిగినా.. 58 ఏండ్ల పాటు సమైక్య రాష్ట్రంలోనూ తమ అస్తిత్వం కోల్పోకుండా టీఎన్జీఓలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఉద్యమాన్ని కొనసాగించారు. జీవితాంతం తెలంగాణవాదిగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు వంటి వారు ఉద్యమ సోయిని బతికించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కొన్ని లెఫ్ట్ పార్టీలు తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ వంటి పేర్లతో వారి పంథాలో ఉద్యమానికి జీవం పోశాయి.
పిడికెడు మందితో మొదలైన మలిదశ..
తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రారంభంలో మధుసూదనాచారి, వి.ప్రకాశ్ వంటి పిడికెడు మందితో కలసి ఆరేడు నెలలు, ఐదారు వేల గంటలు మేధోమథనం చేసి ఒక వ్యూహం రచించుకుని బయలుదేరాం. భావోద్వేగాలతో ఉండే విద్యార్థులతోపాటు ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉద్యమాన్ని మొదలుపెట్టాం.
తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు వివరించే క్రమంలో హింసాత్మక ఆందోళన మార్గాన్ని అనేక మంది సూచించినా.. గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో అహింసా పద్ధతిలో ముందుకు సాగాం. రాజీనామాలను అ్రస్తాలుగా మార్చి హింస రాకుండా చూశాం.
కానీ నా మీద సమైక్యవాదులు, తెలంగాణలో ఉండే వారి తొత్తులు ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో దాడి చేశారు. ఆ తిట్లనే దీవెనలుగా భావిస్తూ ముందుకు సాగుతూనే టీఎన్జీఓ నేతలు స్వామిగౌడ్, దేవీప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సిద్దిపేట ఉద్యోగ గర్జన వేదికగా ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ ఆమరణ దీక్షను ప్రకటించా.
నిమ్స్ వైద్యుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ జరిగిన దీక్షకు పార్లమెంటులో అన్ని పారీ్టల సహచర ఎంపీల మద్దతు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితో తెలంగాణ ప్రకటన వచ్చింది. కుట్రలు, కుహకాలతో తెలంగాణను అడ్డుకునేందుకు వలసవాదులు చివరికి పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడి చేసే స్థాయికి దిగజారారు.
ఇతర రాష్ట్రాలు, విదేశాల ప్రతినిధులు నివాళి అర్పించాకే..
అమరుల బలిదానాల నేపథ్యంలో అమరుల స్మారకాన్ని ప్రత్యేకంగా నిర్మించాలనే ఉద్దేశంతో అనేక దేశాల్లో నమూనాలను పరిశీలించాం. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నివసించిన జలదృశ్యం ప్రదేశంలోనే స్మారకం నిర్మించాం. కళాకారుడు రమణారెడ్డి సాయంతో దీపకళిక (వెలుగుతున్న దీపం) నమూనాను ఖరారు చేసి ఖర్చుకు వెనుకాడకుండా ఎక్కువ సమయం తీసుకుని నిర్మించాం.
ఇకపై ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు అమరుల జ్యోతి వద్ద నివాళులు అర్పించాకే ఇతర కార్యక్రమాలు జరిగేలా ఆచారాన్ని పెట్టుకుంటాం. ఇప్పటికే సచివాలయం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, బుద్ద విగ్రహం, అమరుల స్మారకంతో హుస్సేన్‌సాగర్ తీరం ల్యాండ్‌మార్క్‌లా తయారైంది. త్వరలో సచివాలయం, అమరుల స్మారకం నడుమ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం.
అమరుల స్మారకంలో 1969తో పాటు ప్రస్తుత ఉద్యమ ఘట్టాలు ఉండేలా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. అమరుల స్ఫూర్తి, ఉద్యమ సాధనలో పడిన శ్రమను కసిగా తీసుకుని అన్నివర్గాలకు అవసరమైన సాయం అందిస్తూ తెలంగాణ పురోగమిస్తున్నది. ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment