Telangana martyrs memorial
-
మీ వెలుగులో ముందుకు
ఇక్కడ నివాళి అర్పించాకే.. రక్తపు చుక్క కారకుండా తెలంగాణ సాధించుకోవాలని అనుకున్నా.. నా ఆమరణ దీక్ష సందర్భంగా చోటు చేసుకున్న విచిత్ర మలుపులో విద్యార్థుల బలిదానాలు కలచివేశాయి. కేంద్రం కళ్లు తెరిచి తెలంగాణ ఇస్తుందనే భావనతో ప్రాణత్యాగం చేసిన వారికి వెలకట్టలేం. అంతటి త్యాగాలు చిరస్థాయిగా నిలిచేలా, అమరుల పేర్లు అందరి మదిలో నిలిచేలా ‘అమర జ్యోతి’ని నిర్మించాం. ఇకపై ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు అమరుల జ్యోతి వద్ద నివాళులు అర్పించాకే ఇతర కార్యక్రమాలు జరిగేలా ఆచారాన్ని పెట్టుకుంటాం. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా నిలిచిపోయేలా, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల పేర్లు ఎల్లకాలం అందరి మదిలో నిలిచేలా ‘తెలంగాణ అమరుల స్మారకం’ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల ఫొటోలతో గ్యాలరీని ఏర్పాటు చేస్తామని, ఉద్యమ ప్రస్థాన చరిత్రను సమగ్రంగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మించిన ‘అమరజ్యోతి’ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధన ఉద్యమ ప్రస్థానాన్ని, తాను ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలను ప్రస్తావించారు. కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా దీపాలు చేతబూని అద్భుత రీతిలో అమరులకు నివాళి అర్పించాం. ఈ సందర్భంలో సంతోషం ఒకపాలు, విషాదం రెండు పాళ్లుగా ఉంది. రక్తపు చుక్క కారకుండా తెలంగాణ సాధించుకోవాలని అనుకున్నా.. నా ఆమరణ దీక్ష సందర్భంగా చోటు చేసుకున్న విచిత్ర మలుపులో విద్యార్థుల బలిదానాలు కలచివేశాయి. కేంద్రం కళ్లు తెరిచి తెలంగాణ ఇస్తుందనే భావనతో ప్రాణత్యాగం చేసిన వారికి వెలకట్టలేం. అందిన సమాచారం మేరకు ఆరేడు వందల మంది కుటుంబాలకు ఉద్యోగాలు, ఒక్కో ఇంటికి రూ.10లక్షలు, కొందరికి ఇళ్లు ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి మనం ఉదారంగా సాయం చేసుకోవచ్చు. వెలుగులీనుతున్న అమరుల స్మారకం కుట్రకోణాలతోనే అనేక బలిదానాలు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో విలీనం చేసే సమయంలో అనేక కుట్ర కోణాలు దాగి ఉండటంతో అనేక మంది బలయ్యారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో 1965, 66 సమయంలో ఖమ్మం జిల్లాలో మొదలైన పొలికేక 1967 నాటికి యూనివర్సిటీకి చేరింది. కేసులు, వేధింపులు, ఉద్యోగుల నుంచి తొలగింపు వంటివి జరిగినా.. 58 ఏండ్ల పాటు సమైక్య రాష్ట్రంలోనూ తమ అస్తిత్వం కోల్పోకుండా టీఎన్జీఓలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఉద్యమాన్ని కొనసాగించారు. జీవితాంతం తెలంగాణవాదిగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు వంటి వారు ఉద్యమ సోయిని బతికించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కొన్ని లెఫ్ట్ పార్టీలు తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ వంటి పేర్లతో వారి పంథాలో ఉద్యమానికి జీవం పోశాయి. పిడికెడు మందితో మొదలైన మలిదశ.. తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రారంభంలో మధుసూదనాచారి, వి.ప్రకాశ్ వంటి పిడికెడు మందితో కలసి ఆరేడు నెలలు, ఐదారు వేల గంటలు మేధోమథనం చేసి ఒక వ్యూహం రచించుకుని బయలుదేరాం. భావోద్వేగాలతో ఉండే విద్యార్థులతోపాటు ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉద్యమాన్ని మొదలుపెట్టాం. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు వివరించే క్రమంలో హింసాత్మక ఆందోళన మార్గాన్ని అనేక మంది సూచించినా.. గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో అహింసా పద్ధతిలో ముందుకు సాగాం. రాజీనామాలను అ్రస్తాలుగా మార్చి హింస రాకుండా చూశాం. కానీ నా మీద సమైక్యవాదులు, తెలంగాణలో ఉండే వారి తొత్తులు ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో దాడి చేశారు. ఆ తిట్లనే దీవెనలుగా భావిస్తూ ముందుకు సాగుతూనే టీఎన్జీఓ నేతలు స్వామిగౌడ్, దేవీప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సిద్దిపేట ఉద్యోగ గర్జన వేదికగా ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ ఆమరణ దీక్షను ప్రకటించా. నిమ్స్ వైద్యుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ జరిగిన దీక్షకు పార్లమెంటులో అన్ని పారీ్టల సహచర ఎంపీల మద్దతు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితో తెలంగాణ ప్రకటన వచ్చింది. కుట్రలు, కుహకాలతో తెలంగాణను అడ్డుకునేందుకు వలసవాదులు చివరికి పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడి చేసే స్థాయికి దిగజారారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల ప్రతినిధులు నివాళి అర్పించాకే.. అమరుల బలిదానాల నేపథ్యంలో అమరుల స్మారకాన్ని ప్రత్యేకంగా నిర్మించాలనే ఉద్దేశంతో అనేక దేశాల్లో నమూనాలను పరిశీలించాం. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నివసించిన జలదృశ్యం ప్రదేశంలోనే స్మారకం నిర్మించాం. కళాకారుడు రమణారెడ్డి సాయంతో దీపకళిక (వెలుగుతున్న దీపం) నమూనాను ఖరారు చేసి ఖర్చుకు వెనుకాడకుండా ఎక్కువ సమయం తీసుకుని నిర్మించాం. ఇకపై ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు అమరుల జ్యోతి వద్ద నివాళులు అర్పించాకే ఇతర కార్యక్రమాలు జరిగేలా ఆచారాన్ని పెట్టుకుంటాం. ఇప్పటికే సచివాలయం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, బుద్ద విగ్రహం, అమరుల స్మారకంతో హుస్సేన్‌సాగర్ తీరం ల్యాండ్‌మార్క్‌లా తయారైంది. త్వరలో సచివాలయం, అమరుల స్మారకం నడుమ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. అమరుల స్మారకంలో 1969తో పాటు ప్రస్తుత ఉద్యమ ఘట్టాలు ఉండేలా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. అమరుల స్ఫూర్తి, ఉద్యమ సాధనలో పడిన శ్రమను కసిగా తీసుకుని అన్నివర్గాలకు అవసరమైన సాయం అందిస్తూ తెలంగాణ పురోగమిస్తున్నది. ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
‘అమరుల స్మారకం’లో అవినీతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరుల స్మారకం నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని, మంత్రి కేటీఆర్ తన అనుయాయులకు కాంట్రాక్టు ఇప్పించి ఇష్టానుసారంగా అంచనాలను పెంచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాందీభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ అమరుల స్మారకం నిర్మాణం కోసం 2017లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారిచ్చిన నివేదిక ఆధారంగా 2018 జూన్ 28న రూ. 63.75 కోట్లకు టెండర్ ప్రకటన ఇచ్చారని తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కేసీ పుల్లయ్య కంపెనీ ఈ టెండర్‌ను దక్కించుకుందన్నారు. కేటీఆర్ స్నేహితుడు తేలుకుంట్ల శ్రీధర్ వ్యూహాత్మకంగా అనిల్‌కుమార్ కామిశెట్టితో కేటీఆర్‌కు మేలు జరిగేలా చేశారని రేవంత్ ఆరోపించారు. రూ. 63 కోట్ల అగ్రిమెంట్‌ను దశలవారీగా రూ. 80 కోట్లకు, ఆ తరువాత రూ. 127.50 కోట్లకు , మళ్లీ రూ. 158.85 కోట్లకు పెంచి, చివరికి రూ. 179.05 కోట్లు చేశారని తెలిపారు. అంటే రూ. 63 కోట్ల ప్రాజెక్టు అంచనాను ఏకంగా మూడు రెట్లు పెంచి, లబ్ధి పొందారని, దీని వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. ఇంత ఖర్చు పెట్టి నిర్మించిన ఈ స్మారకం లోపభూయిష్టంగానే ఉందని, 8 ఎంఎం స్టీల్ వాడాల్సి ఉంటే 4 ఎంఎం మందంతో స్టీల్‌ను వాడారని, తద్వారా అప్పుడే స్టీల్ సొట్టలు పడుతోందని చెప్పారు. స్మారక భవనంలో అమరుల పేర్లేవీ? తెలంగాణ ఉద్యమం తొలి దశలో 369 మంది, మలిదశలో సుమారు 1,200 మంది అమరులయ్యారని, కానీ వారి పేర్లేవీ అమరుల స్మారకం కోసం నిర్మించిన భవనంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. తెలంగాణ అమరుల స్మారకం చూడగానే వారి పోరాటాలు, త్యాగాలను గుర్తుచేయాలి కానీ వారి త్యాగాలను కూడా కేసీఆర్ తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. మేమొచ్చాక విచారణ జరిపిస్తాం... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1,569 మంది అమరుల పేర్లను శిలాశాసనంలో పొందుపరుస్తామని, డిసెంబర్ 9న అమరవీరుల కుటుంబాలతో సోనియాగాంధీ సహపంక్తి భోజనం ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. దేవాలయం, మసీదు, చర్చి ఎంత పవిత్రమైనవో అమరుల స్మారకం అంత పవిత్రమైందని, అలాంటి స్మారకం నిర్మాణంలో కేటీఆర్ కమీషన్లు దండుకుంటున్నా కేసీఆర్‌కు కనిపించదా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారకం, సచివాలయ నిర్మాణాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్నారు. షర్మిలను ఏపీ కాంగ్రెస్ స్వాగతిస్తుంది తెలంగాణ కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం ఉందని, సీమాంధ్ర నాయకుల అవసరం ఇక్కడి పార్టీ కి అక్కర్లేదని రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం గాంధీ భవన్లో విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ వై.ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరాలని భావిస్తే ఏపీ కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ స్వాగతం చెబుతుందన్నారు. తెలంగాణ నుంచి 15 ఎంపీ సీట్లు, ఏపీ నుంచి 15 ఎంపీ సీట్లు కాంగ్రెస్‌కు లభిస్తే రాహుల్ గాందీని ప్రధానిని చేయవచ్చని, అందుకు అనుగుణంగా షర్మిల ఏపీలో పార్టీ కి ఉపయోగపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు ఏపీకి చెందిన వారు వస్తే అంగీకరించరని, 2018 ఎన్నికల్లో అది తేటతెల్లమైందన్నారు. 2018 ఎన్నికల్లో తమ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌తో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టారన్నారు. ఈసారి కూడా కేసీఆర్ వంటి వాళ్లు ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, ఈ పరిస్థితుల్లో షర్మిలను టీకాంగ్రెస్ అంగీకరించదని స్పష్టం చేశారు. షర్మిల వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టమని, ఆంధ్రలో తగిన అవకాశం ఉందని అన్నారు. -
నాకు ఒక పదవి కల్పించాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్న: శంకరమ్మ
-
ఎమ్మెల్సీ పదవి ప్రచారంపై శంకరమ్మ స్పందన
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరవీరుల స్మృతి వనం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలిగా అమరుడైన శ్రీకాంత్ చారి తల్లికీ ఆహ్వానం.. ఆ ఆహ్వానం వెనుక ఆమెకు శాసనమండలి సభ్యురాలిగా అవకాశం ఇచ్చే ప్రతిపాదనపైనా రాజకీయ చర్చ మొదలైంది. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు శంకరమ్మకు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ చేసి కార్యక్రమానికి ఆహ్వానించారట. ఈ విషయాన్ని స్వయంగా శంకరమ్మ సాక్షికి తెలిపారు. అయితే ఎమ్మెల్సీ పదవి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారామె. గతంలో ఎన్నడూ సీఎం కేసీఆర్‌ను కలవలేదని.. అలాగని ఆయన మీద వ్యతిరేకత ఏం లేదని చెప్పారామె. స్మృతి వనం రూపంలో తన కొడుకు లాంటి ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేసినవాళ్లు సజీవంగా బతికే ఉన్నట్లు భావిస్తానని సంతోషం వ్యక్తం చేశారామె. కేసీఆర్ ప్రకటన? ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ శ్రేణుల్లో, ఆయా సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో గత కొంతకాలంగా శంకరమ్మ ఎమ్మెల్సీ పదవి గురించే జోరుగా చర్చ నడుస్తోంది. ఆమెకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు గన్‌మన్‌ను ఓ పీఏను, ప్రభుత్వ వాహనాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. గురువారం ఉదయం నుంచి ఆమెకు ఈ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని కూడా ప్రచారం నడుస్తోంది. అలాగే.. అమరవీరుల స్మృతి వనం ప్రారంభోత్సవ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్వయంగా శంకరమ్మ ఎమ్మెల్సీ ప్రకటన చేయొచ్చనే ప్రచారమూ నడుస్తోంది. గతంలో రాజకీయ ఎంట్రీ కోసం శంకరమ్మ తీవ్ర యత్నాలే చేసి భంగపడిన సంగతి విదితమే. మరోవైపు అమరవీరుల కుటుంబాల నుంచి పలు అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తం అవుతుండడంతో.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో శంకరమ్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇదీ చదవండి: గద్దర్.. కేసీఆర్‌ను నిలదీయు -
మన స్మారకం.. ఘన నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర అవతరణను సాకారం చేసిన తెలంగాణ అమరవీరుల స్మారకార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం గురువారం ప్రారంభం కానుంది. హుస్సేన్‌సాగర్ తీరంలో గతంలో ఉన్న లుంబినీపార్కు స్థలంలో సచివాలయ భవనానికి ఎదురుగా నిర్మించిన ఈ స్మారకాన్ని గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అతుకుల్లేని స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మించిన ఈ కట్టడం నగరంలో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. అద్దంతో నిర్మించినట్టుండే ఈ కట్టడం ప్రపంచంలోనే నాలుగోది కావటం విశేషం. జర్మనీ తయారీ స్టెయిన్లెస్ స్టీల్‌ను దుబాయ్‌లో నిపుణులు ప్రీఫ్యాబ్రికేటెడ్ చేసి నగరానికి తరలించి అతికించి రూపొందించారు. కేవలం జర్మనీ తయారీ స్టెయిన్లెస్ స్టీల్‌కే దాదాపు రూ.50కోట్లు వ్యయం చేశారు. రూ.177 కోట్ల వ్యయంతో ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం 26,800చ.మీ.ల విస్తీర్ణంలో రూపొందింది. 45 మీటర్ల ఎత్తుతో దీపం జ్వలిస్తున్నట్టు ప్రమిద ఆకారంలో నిర్మించిన ఈ భవనం ఆకట్టుకుంటోంది. క్లౌడ్ గేట్: ఇది అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన చికాగోలో ఉంది. అక్కడి సముద్రం ఒడ్డున భారీ ఆకాశహర్మ్యాల ప్రతిబింబాలతో అత్యంత సుందరంగా ఉంటుంది. ఎత్తయిన భవనాలు మేఘాలను తాకేలా ఉంటాయని ‘క్లౌడ్ గేట్’పేరుతో దీన్ని మిలీనియం పార్కులో ఏర్పాటు చేశారు. భారత్‌లో పుట్టి బ్రిటిష్ ఆర్కిటెక్ట్‌గా స్ధిరపడ్డ అనీశ్కపూర్ దీన్ని డిజైన్ చేశారు. లిక్విడ్ మెర్క్యురీ ఇతి వృత్తంగా రూపకల్పన చేసినప్పటికీ అది చిక్కుడు గింజ ఆకారంలో ఉండటంతో ‘ది బీన్’గా ఖ్యాతి పొందింది. ఇందుకు 168 భారీ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లను వినియోగించారు. ఇది 66 అడుగుల పొడవు 33 అడుగుల ఎత్తు ఉంది. 2004లో నిర్మాణం మొదలై 2006లో ప్రారంభమైంది. ప్రపంచంలో ఈ తరహా నిర్మాణాలివి.. బిగ్ ఆయిల్ బబూల్: ఇది చైనాలోని కార్మే నగరంలో కొలువు దీరింది. ఆధునిక చైనా రూపకల్పనలో అక్కడి ప్రభుత్వం 1955 ప్రాంతంలో కార్మేలో చమురు బావుల తవ్వకం చేపట్టింది. తొలి బావి 1956లోఅందు బాటులోకి వచ్చింది. ఆ నగరం చమురు కేంద్రం అన్న భావన వచ్చేలా ‘బిగ్ ఆయిల్ బబూల్’పేరుతో స్థానికంగా దీన్ని నిర్మించారు. చికాగోలోని క్లౌడ్ గేట్‌కు నకలుగా ఉన్నా.. చైనా మాత్రం కాదంటోంది. దాదాపు 250 స్టెయిన్లెస్ స్టీల్ షీట్లతో దీన్ని 2013లో రూపొందించారు. కానీ ఇది చికాగో నిర్మాణం తరహాలో లేదన్న విమర్శలు మాత్రం వినిపించాయి. దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం: భారీ స్టెయిన్లెస్ స్టీల్ షీట్లతో నిర్మించిన మూడో కట్టడం ఇది. ఆధునిక నిర్మాణాలకు కేంద్రంగా దుబాయ్ నిలుస్తోందని చెప్పే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం నిర్మించింది. నాలుగు అంతస్తులుగా ఉండేలా 225 అడుగుల ఎత్తు, 17600 చదరపు మీటర్ల వైశాల్యంతో దీన్ని నిర్మించారు. ఇందులో ఎగ్జిబిషన్లు, ఇతర ప్రదర్శనలు, సదస్సులు నిర్వహిస్తారు. ఆధునిక దుబాయ్ లక్ష్యాన్ని అరబ్బీ అక్షరాల్లో తీర్చిదిద్దారు. మనం వందల ఏళ్లు బతకలేకపోయినా, మన ఆధునిక ఆవిష్కరణలు వందల ఏళ్లు మనుగడ సాగిస్తాయన్న ప్రారంభంతో ఆ పద్యం ఉంటుంది. దీన్ని 2016లోనే నిర్మించినా, 2022లో పూర్తి చేసి అధికారికంగా ప్రారంభించారు. -
అమరుల త్యాగాలకు అద్భుత ప్రతిబింబం.. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో ప్రత్యేకత
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ఒక మహోన్నతమైన కల గన్న గొప్ప స్వాప్నికులు వాళ్లు. ఆ కలను సాకారం చేసుకొనేందుకు వీరోచితమైన పోరాటాలు చేశారు. తెలంగాణ సాధన కోసం తెగించి కొట్లాడారు. త్యాగాల బాటలో నడిచారు. తెలంగాణ కోసం మరణానికి ఎదురెళ్లారు. తమ జీవిత కాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని చూడలేకపోయినా ఆ అమరుల కల సాకారమైంది. అమరుల త్యాగాలకు సమున్నత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరుల స్మారకం ఈ నెల 22న ఆవిష్కరణకు సిద్ధమైంది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన వందలాది మంది అమర వీరులను స్ఫురణకు తెచ్చేలా స్మారక జ్యోతి వెలుగులు విరజిమ్ముతోంది. అపురూపమైన కళాఖండం... హుస్సేన్‌సాగర్ తీరాన లుంబిని పార్కును ఆనుకొని సుమారు 3.2 ఎకరాల స్థలంలో చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే ఒక అపురూపమైన కళాఖండంగా నిలిచింది. ఎలాంటి అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్‌తో దీని నిర్మాణం చేపట్టారు. సాధారణంగా పాలు, వంటనూనెలు సరఫరా చేసే ట్యాంకర్ల కోసం 304 స్టెయిన్లెస్ స్టీల్‌ను వినియోగిస్తారు. కానీ దీని కోసం 316ఎల్ స్టీల్‌ను వినియోగించారు. దుబాయ్‌లో ఎంతో పేరొందిన ఫ్యూచర్ మ్యూజియంకు వినియోగించిన స్టీల్‌కు అతుకులు ఉన్నాయి. కానీ ఈ స్మారకానికి మాత్రం ఎలాంటి అతుకులు లేకపోవడం విశేషం. 85,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్మారకంలో ప్రతి ఫ్లోర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. పైన ఉన్న జ్యోతి వరకు సందర్శకులు వెళ్లవచ్చు. అక్కడ ఉన్న విశాలమైన ప్రాంగణంలో సేదదీరేందుకు అవకాశం ఉంది. త్వరలో ఒక రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. త్యాగాలను స్మరించుకునేలా.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, వీరోచిత పోరాట గాథలను స్మరించుకొనేవిధంగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో చిత్రపటాలు, చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రేక్షకులు వీక్షించేందుకు లేదా విని తెలుసుకొనేందుకు వీలుగా ఆడియో, వీడియో హాళ్లు, గ్యాలరీలు ఉంటాయి.వీటి ద్వారా తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ ఘట్టాలను తెలుసుకోవచ్చు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో వివిధ ప్రాంతాలకు చెందిన అమరవీరులు సాగించిన పోరాటాల తీరుతెన్నులు, ఉద్యమం సాగిన తీరు, తదితర స్ఫూర్తిదాయకమైన తెలంగాణ ఉద్యమ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే మ్యూజియంలోనే అక్కడక్కడా కియోస్క్‌లు, టచ్ స్క్రీన్లు ఉంటాయి. వీటి ద్వారా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర విశేషాలను తెలుసుకొనే అవకాశం ఉంది. చదవండి: నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం.. తల్లిదండ్రుల్లో ఆందోళన టెర్రస్‌పై ‘దియా’... టెర్రస్ పైన అమరవీరులకు నివాళులర్పిస్తూ.. జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇదే తెలంగాణ స్మారకం ప్రత్యేకత. సచివాలయానికి ఎదురుగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందజేస్తూ ఏర్పాటు చేసిన ఈ జ్యోతి (దియా) విశేషంగా ఆకట్టుకుంటోంది. టెర్రస్ పైన కూర్చుని 180 డిగ్రీల కోణంలో చుట్టూ ఉన్న పరిసరాలను వీక్షించవచ్చు. సెక్రెటేరియట్, అంబేడ్కర్ విగ్రహం, ఐమాక్స్, బిర్లా మందిరం స్పష్టంగా కనిపిస్తాయి. రూ.179 కోట్లతో తెలంగాణ స్మారకం నిర్మించారు. సందర్శకులు అత్యవసర పరిస్థితుల్లో పైనుంచి నేరుగా కిందకు చేరుకొనేందుకు రెండు వైపులా మెట్లు ఏర్పాటు చేశారు. రెండు లిఫ్టులు,ఎస్కలేటర్లు అందుబాటులో ఉంటాయి. అన్ని ఫ్లోర్లలో వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. భవనానికి ప్రధాన ద్వారంతో పాటు మరో నాలుగు చోట్ల చిన్న చిన్న నిష్క్రమణ ద్వారాలను ఏర్పాటు చేశారు. సాహిత్య సదస్సులు, కళాప్రదర్శనలు... పై అంతస్తులో 600 మంది కూర్చునేందుకు అనువైన కన్వెన్షన్ హాల్‌ను నిర్మించారు. రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్సులు, సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ఈ హాల్ ఎంతో అనుకూలంగా ఉంది. ఈ హాల్లో ఏర్పాటు చేసే కుర్చీలను సభా కార్యక్రమాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ల్యాండ్‌స్కేప్‌ల ఏర్పాటు... హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో తెలంగాణ అమరుల స్మారకం చుట్టూ అందమైన ల్యాండ్‌స్కేప్‌లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సెక్రెటేరియట్ ఎదురుగా ఉన్న విశాలమైన ప్రాంగణంలో కూడా ఆకుపచ్చ ల్యాండ్‌స్కేప్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు కొనసాగుతున్నారు. ట్రాఫిక్ ఐలాండ్స్‌లో, లుంబిని పార్కులోనూ పచ్చదనం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ అరి్వంద్‌కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. -
ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారకం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించే ముహూర్తాలను రాష్ట్ర ప్రభు త్వం ఖరారు చేసింది. కొత్త సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించాలని, ఆలోపు అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతకన్నా ముందే అంబేడ్కర్ జయంతి అ యిన ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేడ్కర్ వి గ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన జూన్ 2న అమరవీరుల స్మారక జ్యోతిని ప్రారంభించనున్నారు. ఈ 3 నిర్మాణాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం వాటిని పరిశీలించారు. అనుకున్నట్టే అద్భుతంగా.. తొలుత సచివాలయాన్ని సందర్శించిన కేసీఆర్.. ప్రధాన ద్వారం, దానికి భోపాల్ నుంచి తెచ్చి ఏర్పాటు చేసిన వుడ్ కార్వింగ్, ఫౌంటెయిన్లు, పచ్చిక బయళ్లు, గుమ్మటాల పనులను.. ప్రహరీ, దాని అవతల వెడల్పు చేస్తున్న రోడ్లు, పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంతకుముందు పర్యటించినప్పుడు ఆరో అంతస్తులోని సీఎం చాంబర్లో చేయాల్సిందిగా సూచించిన మార్పులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లిన సీఎం కేసీఆర్.. విగ్రహం దిగువన సిద్ధమవుతున్న విశాలమైన హాళ్లు, ఫౌంటెయిన్లు, పచ్చి క బయళ్లను పరిశీలించారు. పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని, నాణ్యతలో లోపం లేకుండా చూ డాలని ఆదేశించారు. తర్వాత తెలంగాణ అమరవీరుల స్మారక భవనం వద్దకు సీఎం చేరుకున్నారు. ఆడిటోరియం, ప్రదర్శనశాల, లేజర్‌షో ప్రాంగణం, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుమన్, జీవన్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు ఉన్నారు. వరుసగా వాయిదా పడుతూ.. తొలుత దసరాకు, ఆ తర్వాత సంక్రాంతికి కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు భావించింది. కానీ పనులు పూర్తి కాకపోవటంతో వాయిదా వేసుకుంది. తర్వాత సీఎం కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17ను ముహూర్తంగా ఖరారు చేసింది. పనులు పూర్తి కాకున్నా ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే సీఎం కార్యాలయం తప్ప మిగతావి పూర్తిస్థాయిలో సిద్ధం కావని అధికారులు పేర్కొనడంతో పునరాలోచించింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో మరోసారి వాయిదా వేసింది. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందున ఆయన జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ ఆ రోజు కాకుండా ఏప్రిల్ 30ని ముహూర్తంగా ఎంచుకుంది. మార్చి 23 తర్వాత శూన్యమాసం మొదలై ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని.. ఆ తర్వాతి రోజు (ఏప్రిల్ 30) వైశాఖ శుద్ధ దశమి నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయని పండితులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 30ను కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది. -
స్పీకర్‌కు రాజీనామా సమర్పణ.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ఉదయం స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి ముందు అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం ఆకలినైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టదని అన్నారు. కేసీఆర్ చేతిలో ఆత్మగౌరవం బంధీ అయ్యిందని కోమటిరెడ్డి విమర్శించారు. మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం కోసం తన పదవిని త్యాగం చేస్తున్నట్లు తెలిపారు. కుటంబ పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోరని, రాజీనామా అనంతరమే మునుగోడు ఉప ఎన్నికపై ప్రజలు మాట్లాడుకుంటున్నారని అన్నారు. రాజీనామా అనగానే కొత్తగా గట్టుప్పల్ మండలం వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ యుద్దం తన కోసం కాదని, మునుగోడు ప్రజల కోసం అని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కేసీఆర్‌కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతరులు కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నో ఆశలతో తెలంగాణ వచ్చిందని, తన రాజీనామాతోనైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని హితవు పలికారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చి.. కేసీఆర్ చేతిలో చిక్కిన తెలంగాణ తల్లికి విముక్తి కలిగించాలని కోరారు. చదవండి: చాయ్‌కీ డబ్బులు లేవు.. సీఎం స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నా -
'హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందుంది'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హామీ అమలులో ముందుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ ద్వారానే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఏ ఎన్నికలొచ్చినా మేమే విజయం సాధిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్తారని నాయిని నరసింహరెడ్డి పేర్కొన్నారు. -
కలిసి మెలిసి అభివృద్ధి చెందుదాం: రేణుక
న్యూఢిల్లీ: తెలుగువారందరం కలిసి మెలిసి అభివృద్ధి చెందుదామని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. అమరవీరుల వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, వారి కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలని అన్నారు. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అమరవీరులకు విశాలమైన పార్కులో స్థూపం ఏర్పాటు చేయాలని సూచించారు. విలక్షణ నాయకురాలిగా పేరు గాంచిన రేణుకా చౌదరి నిన్న రాజ్యసభలో ప్యానల్ చైర్మన్‌గా వ్యవహరించిన అందరి దృష్టిని ఆకర్షించారు. ప్యానల్ చైర్మన్ హోదాలో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.