సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ఒక మహోన్నతమైన కల గన్న గొప్ప స్వాప్నికులు వాళ్లు. ఆ కలను సాకారం చేసుకొనేందుకు వీరోచితమైన పోరాటాలు చేశారు. తెలంగాణ సాధన కోసం తెగించి కొట్లాడారు. త్యాగాల బాటలో నడిచారు. తెలంగాణ కోసం మరణానికి ఎదురెళ్లారు. తమ జీవిత కాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని చూడలేకపోయినా ఆ అమరుల కల సాకారమైంది.
అమరుల త్యాగాలకు సమున్నత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరుల స్మారకం ఈ నెల 22న ఆవిష్కరణకు సిద్ధమైంది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన వందలాది మంది అమర వీరులను స్ఫురణకు తెచ్చేలా స్మారక జ్యోతి వెలుగులు విరజిమ్ముతోంది.
అపురూపమైన కళాఖండం...
హుస్సేన్‌సాగర్ తీరాన లుంబిని పార్కును ఆనుకొని సుమారు 3.2 ఎకరాల స్థలంలో చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే ఒక అపురూపమైన కళాఖండంగా నిలిచింది. ఎలాంటి అతుకులు లేని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో దీని నిర్మాణం చేపట్టారు. సాధారణంగా పాలు, వంటనూనెలు సరఫరా చేసే ట్యాంకర్ల కోసం 304 స్టెయిన్‌లెస్ స్టీల్‌ను వినియోగిస్తారు. కానీ దీని కోసం 316ఎల్ స్టీల్‌ను వినియోగించారు.
దుబాయ్‌లో ఎంతో పేరొందిన ఫ్యూచర్ మ్యూజియంకు వినియోగించిన స్టీల్‌కు అతుకులు ఉన్నాయి. కానీ ఈ స్మారకానికి మాత్రం ఎలాంటి అతుకులు లేకపోవడం విశేషం. 85,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్మారకంలో ప్రతి ఫ్లోర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. పైన ఉన్న జ్యోతి వరకు సందర్శకులు వెళ్లవచ్చు. అక్కడ ఉన్న విశాలమైన ప్రాంగణంలో సేదదీరేందుకు అవకాశం ఉంది. త్వరలో ఒక రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
త్యాగాలను స్మరించుకునేలా..
తెలంగాణ అమరవీరుల త్యాగాలను, వీరోచిత పోరాట గాథలను స్మరించుకొనేవిధంగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో చిత్రపటాలు, చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రేక్షకులు వీక్షించేందుకు లేదా విని తెలుసుకొనేందుకు వీలుగా ఆడియో, వీడియో హాళ్లు, గ్యాలరీలు ఉంటాయి.వీటి ద్వారా తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ ఘట్టాలను తెలుసుకోవచ్చు.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో వివిధ ప్రాంతాలకు చెందిన అమరవీరులు సాగించిన పోరాటాల తీరుతెన్నులు, ఉద్యమం సాగిన తీరు, తదితర స్ఫూర్తిదాయకమైన తెలంగాణ ఉద్యమ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే మ్యూజియంలోనే అక్కడక్కడా కియోస్క్‌లు, టచ్ స్క్రీన్‌లు ఉంటాయి. వీటి ద్వారా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర విశేషాలను తెలుసుకొనే అవకాశం ఉంది.
చదవండి: నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం.. తల్లిదండ్రుల్లో ఆందోళన
టెర్రస్‌పై ‘దియా’...
టెర్రస్ పైన అమరవీరులకు నివాళులర్పిస్తూ.. జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇదే తెలంగాణ స్మారకం ప్రత్యేకత. సచివాలయానికి ఎదురుగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందజేస్తూ ఏర్పాటు చేసిన ఈ జ్యోతి (దియా) విశేషంగా ఆకట్టుకుంటోంది. టెర్రస్ పైన కూర్చుని 180 డిగ్రీల కోణంలో చుట్టూ ఉన్న పరిసరాలను వీక్షించవచ్చు. సెక్రెటేరియట్, అంబేడ్కర్ విగ్రహం, ఐమాక్స్, బిర్లా మందిరం స్పష్టంగా కనిపిస్తాయి. రూ.179 కోట్లతో తెలంగాణ స్మారకం నిర్మించారు.
సందర్శకులు అత్యవసర పరిస్థితుల్లో పైనుంచి నేరుగా కిందకు చేరుకొనేందుకు రెండు వైపులా మెట్లు ఏర్పాటు చేశారు. రెండు లిఫ్టులు,ఎస్కలేటర్లు అందుబాటులో ఉంటాయి. అన్ని ఫ్లోర్‌లలో వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. భవనానికి ప్రధాన ద్వారంతో పాటు మరో నాలుగు చోట్ల చిన్న చిన్న నిష్క్రమణ ద్వారాలను ఏర్పాటు చేశారు.
సాహిత్య సదస్సులు, కళాప్రదర్శనలు...
పై అంతస్తులో 600 మంది కూర్చునేందుకు అనువైన కన్వెన్షన్ హాల్‌ను నిర్మించారు. రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్సులు, సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, అమరవీరుల
సంస్మరణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ఈ హాల్ ఎంతో అనుకూలంగా ఉంది. ఈ హాల్‌లో ఏర్పాటు చేసే కుర్చీలను సభా కార్యక్రమాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు.
ల్యాండ్‌స్కేప్‌ల ఏర్పాటు...
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో తెలంగాణ అమరుల స్మారకం చుట్టూ అందమైన ల్యాండ్‌స్కేప్‌లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సెక్రెటేరియట్ ఎదురుగా ఉన్న విశాలమైన
ప్రాంగణంలో కూడా ఆకుపచ్చ ల్యాండ్‌స్కేప్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు కొనసాగుతున్నారు. ట్రాఫిక్ ఐలాండ్స్‌లో, లుంబిని పార్కులోనూ పచ్చదనం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ అరి్వంద్‌కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment