సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరవీరుల స్మృతి వనం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలిగా అమరుడైన శ్రీకాంత్ చారి తల్లికీ ఆహ్వానం.. ఆ ఆహ్వానం వెనుక ఆమెకు శాసనమండలి సభ్యురాలిగా అవకాశం ఇచ్చే ప్రతిపాదనపైనా రాజకీయ చర్చ మొదలైంది.
యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు శంకరమ్మకు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ చేసి కార్యక్రమానికి ఆహ్వానించారట. ఈ విషయాన్ని స్వయంగా శంకరమ్మ సాక్షికి తెలిపారు. అయితే ఎమ్మెల్సీ పదవి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారామె. గతంలో ఎన్నడూ సీఎం కేసీఆర్‌ను కలవలేదని.. అలాగని ఆయన మీద వ్యతిరేకత ఏం లేదని చెప్పారామె. స్మృతి వనం రూపంలో తన కొడుకు లాంటి ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేసినవాళ్లు సజీవంగా బతికే ఉన్నట్లు భావిస్తానని సంతోషం వ్యక్తం చేశారామె.
కేసీఆర్ ప్రకటన?
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్ శ్రేణుల్లో, ఆయా సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో గత కొంతకాలంగా శంకరమ్మ ఎమ్మెల్సీ పదవి గురించే జోరుగా చర్చ నడుస్తోంది. ఆమెకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు గన్‌మన్‌ను ఓ పీఏను, ప్రభుత్వ వాహనాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. గురువారం ఉదయం నుంచి ఆమెకు ఈ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని కూడా ప్రచారం నడుస్తోంది.
అలాగే.. అమరవీరుల స్మృతి వనం ప్రారంభోత్సవ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్వయంగా శంకరమ్మ ఎమ్మెల్సీ ప్రకటన చేయొచ్చనే ప్రచారమూ నడుస్తోంది. గతంలో రాజకీయ ఎంట్రీ కోసం శంకరమ్మ తీవ్ర యత్నాలే చేసి భంగపడిన సంగతి విదితమే. మరోవైపు అమరవీరుల కుటుంబాల నుంచి పలు అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తం అవుతుండడంతో.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో శంకరమ్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఇదీ చదవండి: గద్దర్.. కేసీఆర్‌ను నిలదీయు
Comments
Please login to add a commentAdd a comment