సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర అవతరణను సాకారం చేసిన తెలంగాణ అమరవీరుల స్మారకార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం గురువారం ప్రారంభం కానుంది. హుస్సేన్‌సాగర్ తీరంలో గతంలో ఉన్న లుంబినీపార్కు స్థలంలో సచివాలయ భవనానికి ఎదురుగా నిర్మించిన ఈ స్మారకాన్ని గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
అతుకుల్లేని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించిన ఈ కట్టడం నగరంలో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. అద్దంతో నిర్మించినట్టుండే ఈ కట్టడం ప్రపంచంలోనే నాలుగోది కావటం విశేషం. జర్మనీ తయారీ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను దుబాయ్‌లో నిపుణులు ప్రీఫ్యాబ్రికేటెడ్ చేసి నగరానికి తరలించి అతికించి రూపొందించారు.
కేవలం జర్మనీ తయారీ స్టెయిన్‌లెస్ స్టీల్‌కే దాదాపు రూ.50కోట్లు వ్యయం చేశారు. రూ.177 కోట్ల వ్యయంతో ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం 26,800చ.మీ.ల విస్తీర్ణంలో రూపొందింది. 45 మీటర్ల ఎత్తుతో దీపం జ్వలిస్తున్నట్టు ప్రమిద ఆకారంలో నిర్మించిన ఈ భవనం ఆకట్టుకుంటోంది.
క్లౌడ్ గేట్: ఇది అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన చికాగోలో ఉంది. అక్కడి సముద్రం ఒడ్డున భారీ ఆకాశహర్మ్యాల ప్రతిబింబాలతో అత్యంత సుందరంగా ఉంటుంది. ఎత్తయిన భవనాలు మేఘాలను తాకేలా ఉంటాయని ‘క్లౌడ్ గేట్’పేరుతో దీన్ని మిలీనియం పార్కులో ఏర్పాటు చేశారు. భారత్‌లో పుట్టి బ్రిటిష్ ఆర్కిటెక్ట్‌గా స్ధిరపడ్డ అనీశ్‌కపూర్ దీన్ని డిజైన్ చేశారు.
లిక్విడ్ మెర్క్యురీ ఇతి వృత్తంగా రూపకల్పన చేసినప్పటికీ అది చిక్కుడు గింజ ఆకారంలో ఉండటంతో ‘ది బీన్’గా ఖ్యాతి పొందింది. ఇందుకు 168 భారీ స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లేట్లను వినియోగించారు. ఇది 66 అడుగుల పొడవు 33 అడుగుల ఎత్తు ఉంది. 2004లో నిర్మాణం మొదలై 2006లో ప్రారంభమైంది.
ప్రపంచంలో ఈ తరహా నిర్మాణాలివి..
బిగ్ ఆయిల్ బబూల్: ఇది చైనాలోని కార్మే నగరంలో కొలువు దీరింది. ఆధునిక చైనా రూపకల్పనలో అక్కడి ప్రభుత్వం 1955 ప్రాంతంలో కార్మేలో చమురు బావుల తవ్వకం చేపట్టింది. తొలి బావి 1956లోఅందు బాటులోకి వచ్చింది. ఆ నగరం చమురు కేంద్రం అన్న భావన వచ్చేలా ‘బిగ్ ఆయిల్ బబూల్’పేరుతో స్థానికంగా దీన్ని నిర్మించారు. చికాగోలోని క్లౌడ్ గేట్‌కు నకలుగా ఉన్నా.. చైనా మాత్రం కాదంటోంది. దాదాపు 250 స్టెయిన్‌లెస్ స్టీల్ షీట్లతో దీన్ని 2013లో రూపొందించారు. కానీ ఇది చికాగో నిర్మాణం తరహాలో లేదన్న విమర్శలు మాత్రం వినిపించాయి.
దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం: భారీ స్టెయిన్‌లెస్ స్టీల్ షీట్లతో నిర్మించిన మూడో కట్టడం ఇది. ఆధునిక నిర్మాణాలకు కేంద్రంగా దుబాయ్ నిలుస్తోందని చెప్పే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం నిర్మించింది. నాలుగు అంతస్తులుగా ఉండేలా 225 అడుగుల ఎత్తు, 17600 చదరపు మీటర్ల వైశాల్యంతో దీన్ని నిర్మించారు.
ఇందులో ఎగ్జిబిషన్లు, ఇతర ప్రదర్శనలు, సదస్సులు నిర్వహిస్తారు. ఆధునిక దుబాయ్ లక్ష్యాన్ని అరబ్బీ అక్షరాల్లో తీర్చిదిద్దారు. మనం వందల ఏళ్లు బతకలేకపోయినా, మన ఆధునిక ఆవిష్కరణలు వందల ఏళ్లు మనుగడ సాగిస్తాయన్న ప్రారంభంతో ఆ పద్యం ఉంటుంది. దీన్ని 2016లోనే నిర్మించినా, 2022లో పూర్తి చేసి అధికారికంగా ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment