సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరుల స్మారకం నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని, మంత్రి కేటీఆర్ తన అనుయాయులకు కాంట్రాక్టు ఇప్పించి ఇష్టానుసారంగా అంచనాలను పెంచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాందీభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ అమరుల స్మారకం నిర్మాణం కోసం 2017లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారిచ్చిన నివేదిక ఆధారంగా 2018 జూన్ 28న రూ. 63.75 కోట్లకు టెండర్ ప్రకటన ఇచ్చారని తెలిపారు.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కేసీ పుల్లయ్య కంపెనీ ఈ టెండర్‌ను దక్కించుకుందన్నారు. కేటీఆర్ స్నేహితుడు తేలుకుంట్ల శ్రీధర్ వ్యూహాత్మకంగా అనిల్‌కుమార్ కామిశెట్టితో కేటీఆర్‌కు మేలు జరిగేలా చేశారని రేవంత్ ఆరోపించారు. రూ. 63 కోట్ల అగ్రిమెంట్‌ను దశలవారీగా రూ. 80 కోట్లకు, ఆ తరువాత రూ. 127.50 కోట్లకు , మళ్లీ రూ. 158.85 కోట్లకు పెంచి, చివరికి రూ. 179.05 కోట్లు చేశారని తెలిపారు.
అంటే రూ. 63 కోట్ల ప్రాజెక్టు అంచనాను ఏకంగా మూడు రెట్లు పెంచి, లబ్ధి పొందారని, దీని వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. ఇంత ఖర్చు పెట్టి నిర్మించిన ఈ స్మారకం లోపభూయిష్టంగానే ఉందని, 8 ఎంఎం స్టీల్ వాడాల్సి ఉంటే 4 ఎంఎం మందంతో స్టీల్‌ను వాడారని, తద్వారా అప్పుడే స్టీల్ సొట్టలు పడుతోందని చెప్పారు.
స్మారక భవనంలో అమరుల పేర్లేవీ?
తెలంగాణ ఉద్యమం తొలి దశలో 369 మంది, మలిదశలో సుమారు 1,200 మంది అమరులయ్యారని, కానీ వారి పేర్లేవీ అమరుల స్మారకం కోసం నిర్మించిన భవనంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. తెలంగాణ అమరుల స్మారకం చూడగానే వారి పోరాటాలు, త్యాగాలను గుర్తుచేయాలి కానీ వారి త్యాగాలను కూడా కేసీఆర్ తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు.
మేమొచ్చాక విచారణ జరిపిస్తాం...
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1,569 మంది అమరుల పేర్లను శిలాశాసనంలో పొందుపరుస్తామని, డిసెంబర్ 9న అమరవీరుల కుటుంబాలతో సోనియాగాంధీ సహపంక్తి భోజనం ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. దేవాలయం, మసీదు, చర్చి ఎంత పవిత్రమైనవో అమరుల స్మారకం అంత పవిత్రమైందని, అలాంటి స్మారకం నిర్మాణంలో కేటీఆర్ కమీషన్లు దండుకుంటున్నా కేసీఆర్‌కు కనిపించదా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారకం, సచివాలయ నిర్మాణాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్నారు.
షర్మిలను ఏపీ కాంగ్రెస్ స్వాగతిస్తుంది
తెలంగాణ కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం ఉందని, సీమాంధ్ర నాయకుల అవసరం ఇక్కడి పార్టీ కి అక్కర్లేదని రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం గాంధీ భవన్‌లో విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ వై.ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరాలని భావిస్తే ఏపీ కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ స్వాగతం చెబుతుందన్నారు.
తెలంగాణ నుంచి 15 ఎంపీ సీట్లు, ఏపీ నుంచి 15 ఎంపీ సీట్లు కాంగ్రెస్‌కు లభిస్తే రాహుల్ గాందీని ప్రధానిని చేయవచ్చని, అందుకు అనుగుణంగా షర్మిల ఏపీలో పార్టీ కి ఉపయోగపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు ఏపీకి చెందిన వారు వస్తే అంగీకరించరని, 2018 ఎన్నికల్లో అది తేటతెల్లమైందన్నారు.
2018 ఎన్నికల్లో తమ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌తో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టారన్నారు. ఈసారి కూడా కేసీఆర్ వంటి వాళ్లు ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, ఈ పరిస్థితుల్లో షర్మిలను టీకాంగ్రెస్ అంగీకరించదని స్పష్టం చేశారు. షర్మిల వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టమని, ఆంధ్రలో తగిన అవకాశం ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment